కాటలోనియా ఎన్నికలు: స్వాతంత్ర్య అనుకూల, వ్యతిరేక పక్షాల మధ్య హోరాహోరీ పోరు?

ఓటేస్తున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

స్పెయిన్‌లోని కాటలోనియాలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం(డిసెంబరు 21) కీలకమైన ప్రాంతీయ ఎన్నికలు జరుగుతున్నాయి.

కాటలోనియా స్వాతంత్ర్యంపై అక్టోబరు 1న నిర్వహించిన రెఫరెండం వివాదాస్పదమైంది. రెఫరెండంలో స్వాతంత్ర్యానికి అనుకూలంగా ఫలితం వచ్చింది.

అయితే రెఫరెండం చెల్లదని స్పెయిన్ ప్రకటించింది. స్వాతంత్ర్య ప్రకటనను చట్టవిరుద్ధమని తేల్చి.. కాటలోనియా పార్లమెంటును రద్దు చేసింది.

ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంత పార్లమెంటుకు స్పెయిన్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తోంది.

ఓటేస్తున్న కాటలోనియా వాసి. ఆసక్తిగా చూస్తున్న కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

కాటలోనియాకు స్వాతంత్ర్యం కల్పించాలనేవారు ఎంత మంది, ఇప్పుడున్నట్లుగానే పాక్షిక స్వయంప్రతిపత్తితో ఈ ప్రాంతం స్పెయిన్‌లో భాగంగానే కొనసాగాలనేవారు ఎంత మంది అనేది ఈ ఎన్నికలో వెల్లడి కానుంది.

ఈ రెండు డిమాండ్ల మద్దతుదారుల మధ్య హోరాహోరీ పోటీ ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

తాజా ఎన్నికలతో కూడా కాటలోనియా రాజకీయ సంక్షోభం పరిష్కారమవుతుందనే సూచనలు పెద్దగా లేవని బార్సిలోనాలోని బీబీసీ ప్రతినిధి కెవిన్ కనోలీ తెలిపారు.

పది లక్షల మంది ఓటర్లు ఎటూ నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నారని, వారి నిర్ణయంపైనే గురువారం నాటి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుందని స్పానిష్ పత్రిక ఎల్ పాయిస్ అభిప్రాయపడింది.

కాటలోనియాలో దాదాపు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 85 శాతం వరకు పోలింగ్ నమోదు కావొచ్చని సర్వేలు వెల్లడించాయి.

ఓటేస్తున్న కాటలోనియా వాసి

ఫొటో సోర్స్, EPA

'అత్యంత ముఖ్యమైన ఎన్నిక'

కాటలోనియా చరిత్రలో ఇది అత్యంత ముఖ్యమైన ఎన్నికని బార్సిలోనాలో ఓటు వేయడానికి వరుసలో ఉన్న అనా అనే విద్యార్థి వ్యాఖ్యానించినట్లు బీబీసీ ఐరోపా ప్రతినిధి గావిన్ లీ తెలిపారు.

కాటలోనియా స్వాతంత్ర్య అనుకూల పక్షం 'రిపబ్లికన్ లెఫ్ట్ ఆఫ్ కాటలోనియా(ఈఆర్‌సీ)' తొలి స్థానంలో నిలుస్తుందని, ఈ ప్రాంతం స్పెయిన్‌లోనే కొనసాగాలనే 'సిటిజన్స్' పార్టీపై ఈఆర్‌సీ స్వల్ప ఆధిక్యం సాధిస్తుందని స్పానిష్ పత్రిక ఎల్ పాయిస్‌లో కొద్ది రోజుల కిందట ప్రచురితమైన సర్వేలు సూచిస్తున్నాయి.

స్పెయిన్ జెండాతో యువత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాటలోనియా భవిష్యత్తును ఈ ఎన్నికలు నిర్ణయించనున్నాయి

కాటలోనియా పదవీచ్యుత అధ్యక్షుడు కార్లెస్ ప్యుగ్డిమాంట్‌కు చెందిన 'టుగెదర్ ఫర్ కాటలోనియా' పార్టీ మూడో స్థానంలో నిలవొచ్చని పేర్కొన్నాయి.

అయితే స్వాతంత్ర్యానికి అనుకూలంగా పార్లమెంటులో ఏ పార్టీకీ మెజారిటీ లభించకపోవచ్చని వెల్లడించాయి.

వీడియో క్యాప్షన్, అక్టోబర్ రిఫరెండం సందర్భంగా ఓటర్లను హింసాత్మకంగా అదుపు చేస్తున్న పోలీసులు

బలాన్ని చాటండి: ప్యుగ్డిమాంట్

గురువారం ఎన్నికలో కాటలోనియా ప్రజలు వారి తిరుగులేని బలాన్ని ప్రదర్శించాలని కాటలోనియా పదవీచ్యుత అధ్యక్షుడు కార్లెస్ ప్యుగ్డిమాంట్ 'ట్విటర్'లో పిలుపునిచ్చారు.

ఆయన ప్రస్తుతం బెల్జియంలో ప్రవాసంలో ఉన్నారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)