కాటలోనియా రిఫరెండం: గాయపడిన ప్రజలకు స్పెయిన్ క్షమాపణ

ఫొటో సోర్స్, Getty Images
స్వాతంత్ర్యం కోరుతూ కాటలోనియాలో గత ఆదివారం నిర్వహించిన రిఫరెండాన్ని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులూ ప్రజలకూ మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఈ ఘటనలో గాయపడ్డ పౌరులకు స్పెయిన్ ప్రభుత్వ ప్రతినిధి ఎన్రిక్ మిల్లో క్షమాపణలు చెప్పారు.
చట్ట వ్యతిరేకంగా వోటింగ్ నిర్వహించి కాటలోనియా ప్రభుత్వమే తప్పు చేసిందని ఆయన అన్నారు. ఈ విషయంలో పోలీసుల తీరు బాధాకరమనీ, వాళ్ల తరఫున తాను క్షమాపణ చెబుతున్నాననీ మిల్లో పేర్కొన్నారు.
మరో పక్క పార్లమెంటులో స్వాతంత్ర్య అంశంపైన చర్చను లేవదీస్తామని కాటలాన్ విదేశాంగ శాఖ మంత్రి రాల్ రొమెవా అన్నారు.
కాటలోనియా స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఆపడానికి స్పెయిన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ పనికిరానివనీ, అవి తిరిగి వారి ప్రభుత్వానికే చేటు చేశాయనీ ఆయన బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.
కాటలోనియాలో రాజకీయ పరిణామాలు
గత ఆదివారం నిర్వహించిన రిఫరెండం నేపథ్యంలో కాటలోనియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
కాటలోనియా అధ్యక్షుడు కార్ల్స్ పగ్డిమాంట్ మంగళవారం నాడు పార్లమెంటులో మాట్లాడతారని పార్లమెంటు స్పీకర్ తెలిపారు.
అదే రోజు పార్లమెంటు కాటలోనియా స్వాతంత్ర్యాన్ని కూడా ప్రకటిస్తుందనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, గత రిఫరెండం వివాదాస్పదమైన నేపథ్యంలో కాటలోనియాలో మరోసారి ఎన్నికలు నిర్వహిస్తే బావుంటుందని స్పెయిన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఇనిగో మెండెజ్ డి విగో సూచించారు.

ఫొటో సోర్స్, EPA
అంకెల్లో కాటలోనియా
- 16% స్పెయిన్ ప్రజలు కాటలోనియాలోనే నివసిస్తున్నారు
- 25.6% స్పెయిన్ ఎగుమతులు కాటలోనియా నుంచే జరుగుతున్నాయి
- 19%... స్పెయిన్ జీడీపీలో కాటలోనియా వాటా
- 20.7% విదేశీ పెట్టుబడులు కాటలోనియాకే వెళ్తున్నాయి
- 35.7% కాటలోనియా జీడీపీ అప్పుల ద్వారా సమకూరిందే
(ఆధారం: ఆర్థికశాఖ, ఇండస్ట్రీ అండ్ కాంపిటిటివ్‌నెస్, యూరోస్టాట్, బ్యాంక్ ఆఫ్ స్పెయిన్)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








