You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బడ్జెట్ 2023: లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో వచ్చే మార్పులు ఏంటి, కొత్తగా పాలసీ తీసుకునే వాళ్లు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ పరంగా అనేక కీలకమైన విషయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది జీవిత బీమా పాలసీలకు జోడిచిన అదనపు పన్ను.
కొత్త నియమం ప్రకారం, ఒక పాలసీ పరిమితి ముగిసే సమయానికి పాలసీదారుడు చెల్లించిన ప్రీమియం మొత్తం ఐదు లక్షలకు పైగా ఉంటే.. ఆ పాలసీ కాలపరిమితి దాటాక వచ్చిన మొత్తం ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది. 2023 ఏప్రిల్ 1 నుంచీ ఆరోగ్య బీమా తీసుకునేవారికి ఈ మార్పు వర్తిస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న పాలసీల నుంచీ వచ్చే మొత్తానికి ఈ నియమం వర్తించదు.
ఈ కొత్త నియమం పాలసీదారులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునే ముందు ఈ నియమం ఎలా పని చేస్తుందో ఒక ఉదాహరణ చూద్దాం.
కాల పరిమితి: 15 సంవత్సరాలు
వార్షిక ప్రీమియం: 50 వేలు
బీమా మొత్తం: 10 లక్షలు
మెచ్యూరిటీ మొత్తం: 13 లక్షలు
ఈ ఉదాహరణలో పదిహేనేళ్ల తర్వాత మెచ్యూరిటీ మొత్తం అందే సమయంలో పదమూడు లక్షల రూపాయలకు పాలసీదారుడు ఆదాయపు పన్ను స్లాబుల ప్రకారం పన్ను చెల్లించాలి. అంటే పాలసీదారుడి ఆదాయానికి ఈ పదమూడు లక్షల రూపాయలు అధికంగా జమ చేసి ఆదాయపు పన్ను లెక్క వేసుకోవాలి.
ఇప్పుడు ఈ మార్పు బీమా రంగాన్ని, పాలసీ దారులను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం.
పాలసీదారులపై ప్రభావం
30 శాతం ఆదాయపు పన్ను స్లాబులో ఉన్న వాళ్లు పైన ఉదాహరణలో చెప్పిన పాలసీ తీసుకుంటే పాలసీ గడువు ముగిశాక దాదాపు నాలగు లక్షల రూపాయలు ఆదాయపు పన్ను చెల్లించాలి. ఇది పాలసీదారుల మీద పడే చాలా పెద్ద భారం.
ఈ భారం పడకుండా ఆరోగ్య బీమా పొందడానికి ఎలా ముందుకు వెళ్లాలో చూద్దాం. స్థూలంగా చెప్పాలంటే ఎండోమెంట్ పాలసీలలో కట్టే ప్రీమియం రెండు భాగాలుగా చేసి, ఒకటి టర్మ్ పాలసీ పొందటానికి వాడాలి, రెండో భాగం మార్కెట్ అనుసంధానిత మదుపు మార్గాల్లోకి మళ్లించాలి. ఆ వివరాలు చూద్దాం.
1. ముందుగా మనకు టర్మ్ పాలసీ అనేది ఒక అవసరం. అది ఒక మదుపు మార్గం కాదు. ఈ అవగాహన కీలకం. చాలామంది ఎండోమెంట్ పాలసీలు 80సీ కేటగిరిలో పన్ను రాయితీ పొందటానికి తీసుకుంటారు. ఇది సరైన పద్దతి కాదు.
ఎండోమెంట్ పాలసీలకు బదులుగా టర్మ్ పాలసీ తీసుకోవడాం ద్వారా ఎండోమెంట్ పాలసీ ద్వారా అందే కవరేజ్ పొందవచ్చు.
సాధారణంగా టర్మ్ పాలసీ ప్రీమియం ఎండోమెంట్ పాలసీ ప్రీమియం కంటే తక్కువగా ఉంటుంది. బీమా విషయంలో పాలసీదారులకు అందే కవరేజ్ చూసుకోవాలి తప్ప గడువు తీరాక వచ్చే మొత్తం కాదు.
2. టర్మ్ పాలసీ తీసుకుంటే ఎండోమెంట్ పాలసీలో గడువు తీరాక వచ్చే మొత్తం కోల్పోతాం అనే అనుమానం సహజంగా వస్తుంది. పైన చెప్పిన ఉదాహరణలో పాలసీ గడువు ముగిశాక వచ్చే పదమూడు లక్షల రూపాయలు టర్మ్ పాలసీలో రావు.
ఈ లోటును భర్తీ చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర మార్కెట్ అనుసంధానిత మార్గాల ద్వారా మదుపు చేయడం మంచిది.
ఇలా మార్కెట్ ద్వారా చేసే మదుపు మీద వచ్చే ఆదాయం ఎండోమెంట్ పాలసీ కంటే అధికంగా ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్ పనితీరు ప్రాతిపదికగా ఆలోచిస్తే 12 శాతం వార్షిక వృధ్ధి సులభంగా చూడచ్చు.
ఈ ఆదాయం మీద ఉన్న 10 శాతం ఎల్టీసీజీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా మదుపరులకు అందే మొత్తం ఎండోమెంట్ పాలసీ కంటే అధికంగా ఉంటుంది.
ఇప్పుడు పైన చెప్పిన ఉదాహరణను మరోసారి చూద్దాం
మదుపు మొత్తం: 50 వేలు
టర్మ్ పాలసీ:
ప్రీమియం: 25 వేలు
బీమా కవరేజ్: కోటి రూపాయలు
మ్యూచువల్ ఫండ్ లేదా ఇతర మార్కెట్ మదుపు మార్గం:
వార్షిక మదుపు: 25 వేలు
వార్షిక వృధ్ధి (కనీస అంచనా): 12 శాతం
పదిహేనేళ్ళ తర్వాత ఆదాయం: పది లక్షలు
ఎల్టీసీజి తర్వాత ఆదాయం: తొమ్మిది లక్షలు
మార్కెట్ నుంచీ వచ్చే ఆదాయం కనీసం వచ్చే ఆదాయం అని గుర్తించండి. ఈ మొత్తం కూడా 30% పన్ను స్లాబులో ఉండి ఎండోమెంట్ పాలసీ తీసుకున్న వారికి వచ్చే రాబడి కంటే అధికం.
బీమా రంగం మీద ప్రభావం
బీమా పాలసీ మీద వచ్చే రాబడిని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకు రావాలనే వాదన చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. గత ఏడాది యూలిప్ పాలసీలను ఎల్టీసీజీ పరిధిలోకి తీసుకు వచ్చారు. దానికి కొనసాగింపుగా ఈ కొత్త నియమాన్ని ప్రవేశ పెట్టారు.
ఈ నియమం వల్ల ఎండోమెంట్ పాలసీలు తీసుకునేవారు దాదాపుగా ఉండరు. ఈ మార్పు వెనుక హేతుబద్దత గురించి ఆలోచిస్తే ఒక విషయం స్పష్టం అవుతుంది. 2050ల నాటికి మనదేశ జనాభాలో ఎక్కువమంది 50+ వయసు కలిగిన వాళ్ళు ఉంటారు.
అందరికీ ప్రభుత్వం తరఫున బీమా అందించడం దాదాపు ఆసాధ్యం. ఈ దృష్టితో పాలసీదారులను ఎండోమెంట్ పాలసీల నుండీ టర్మ్ పాలసీ వైపు మళ్ళించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచనగా కనిపిస్తోంది.
ఇదే దారిలో టర్మ్ పాలసీ ప్రీమియం మీద ఆదాయపు పన్ను రాయితీ అందించి ఉంటే టర్మ్ పాలసీ మరింత ఆకర్షణీయంగా ఉండేది.
మరోవైపు ఈ నిర్ణయం వల్ల ఎక్కువగా కుదుపుకు లోనయ్యే సంస్థ ఎల్.ఐ.సి. అంటే అతిశయోక్తి లేదు. భారత బీమా మార్కెట్లో ఎల్.ఐ.సి వాటా 45% ఉంది. ఎల్.ఐ.సి పాలసీలలో ఎండోమెంట్ పాలసీలు చాలా ముఖ్యమైనవి.
కొన్ని దశాబ్దాలుగా ఎల్.ఐ.సి సంస్థ వివిధ వర్గాలకు వారి అవసరాలకు తగినట్టుగా ఎండోమెంట్ పాలసీలు అందిస్తోంది. ఆ సంస్థ మార్కెటింగ్ విధానం కూడా ఎల్.ఐ.సి పాలసీలు ఒక మదుపు మార్గం అన్న విధంగా ఉంటాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇవన్నీ మారిపోతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఎల్.ఐ.సి నుంచీ ఎలాంటి పాలసీలు రాబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఎల్.ఐ.సి. అంత బలమైన ఏజెంట్ నెట్‌వర్క్ ఉన్న సంస్థ నుంచీ ఇతర కంపెనీలతో పోటీగా ఉండే టర్మ్ పాలసీలు వస్తే అంతిమంగా అవి పాలసీదారులకు లబ్ది చేకూరుస్తాయి.
ప్రస్తుతం టర్మ్ పాలసీలలో ప్రైవేట్ కంపెనీలు ముందంజలో ఉన్నాయి. ప్రస్తుత మార్పు వల్ల ఎల్.ఐ.సి కూడా టర్మ్ పాలసీల మీద ఎక్కువగా దృష్టిసారించాల్సిన పరిస్థితి వచ్చింది. దీని వల్ల పాలసీదారులకు ఖచ్చితంగా ప్రీమియం, ఇతర విషయాల పరంగా లాభం కలుగుతుంది.
ఇవి కూడా చదవండి:
- పులులను బలి తీసుకుంటున్నది ఎవరు? ఒక్క రాష్ట్రంలోనే ఏడాదిలో 38 పులులు, 87 చిరుతల మృతి
- భారత మహిళా క్రికెటర్ల కష్టాలు, పడే పాట్లు వింటే ఆశ్చర్యం, బాధ కలుగుతాయి
- ఏపీ కొత్త గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్.అబ్దుల్ నజీర్, ప్రస్తుత గవర్నర్ ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ
- భూకంపాల నుంచి హైదరాబాద్ ఎంత వరకూ సురక్షితం?
- ఎల్జీబీటీ: గే, ట్రాన్స్‌జెండర్ పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఎంత కష్టం, ఎలాంటి సమస్యలుంటాయి ?