2,700 కిలోమీటర్లు నడుచుకుంటూ ఉత్తర భారతంలో తిరిగిన యువకుడు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు ఎందుకు బయలుదేరారు

యతి గౌర్

ఫొటో సోర్స్, Yati Gaur

గమ్యం చేరుకోవడం కన్నా ఆ దారిలో నడవడమే ఎక్కువ ఇష్టం అంటారు 24 ఏళ్ల యతి గౌర్. ఎంత ఇష్టమంటే ఒక్క ఏడాదిలో 2,700 కిలోమీటర్లకు పైగా దూరం నడిచేటంత.

సెప్టెంబర్ 1న యతి ఈశాన్య దిశగా తన యాత్ర ప్రారంభించారు. వచ్చే మూడు నెలల్లో సిక్కిం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాలలో పర్యటిస్తూ 1,800 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవాలన్నదే ఆయన లక్ష్యం.

గత ఏడాది హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను కాలినడకన చుట్టివచ్చారు యతి.

కొత్త అభిరుచి

కోవిడ్ 19 కారణంగా ఇళ్లకే పరిమితమైనపోయిన సమయంలో అనేమంది కొత్త కొత్త అభిరుచులవైపు మళ్లడం ప్రారంభించారు.

గత ఏడాది లాక్‌డౌన్ సమయంలోనే యతికి పాదయాత్రలపై అభిరుచి ఏర్పడింది.

"ఏడు నెలలపాటు నాలుగు గోడల మధ్యే ఉండిపోవడం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. బందించేసినట్లుండేంది. ఇంక ఇలా ఉండలేనని అనిపించింది. ఆగస్టులో ఉత్తరాఖండ్ ప్రభుత్వం పర్యటకులను అనుమతించడం ప్రారంభించగానే రిషికేశ్ వెళ్లేందుకు సిద్ధపడ్డాను. అదే విషయం మా ఇంట్లోవాళ్లకు చెప్పాను" అంటూ యతి బీబీసీతో చెప్పారు.

ఓ నెలపాటు రిషికేశ్‌లో గడిపిన తరువాత యతికి కేదార్‌నాథ్ వెళ్లాలనే ఆలోచన వచ్చింది. దాంతోపాటుగా ఏదైనా సాహసం చేయాలనే కోరిక కలిగింది. అలాగే, డబ్బు ఆదా చేయాలనే తాపత్రయం మొదలైంది.

దాంతో, కాలినడకన కేదార్‌నాథ్ వెళ్లాలని నిశ్చయించుకున్నారు. 2020 సెప్టెంబర్ 1న రిషికేశ్‌లో బయలుదేరారు. సరిగ్గా ఎనిమిదోరోజు కేదార్‌నాథ్ చేరుకున్నారు. అక్కడి ఆలయాన్ని దర్శించారు.

అది తన జీవితంలోని అత్యంత అద్భుతమైన క్షణాలలో ఒకటని యతి చెప్పారు.

అక్కడితో ఆగిపోలేదు ఆయన. అదే ఉత్సాహంతో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ కూడా కాలినడకన చుట్టివచ్చారు.

హిమాలయ పర్వత సానువుల్లో...

ఫొటో సోర్స్, YATI GAUR

ఫొటో క్యాప్షన్, హిమాలయ పర్వత సానువుల్లో...

పాదయాత్ర ఆలోచన ఎలా వచ్చింది?

యతి గౌర్ సినిమాకి సంబంధించిన చదువు పూర్తి చేశాక, ఒక బ్యాక్‌ప్యాక్ హాస్టల్‌లో రెండున్నరేళ్లు పనిచేశారు. అక్కడ, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పర్యటకులను కలిశాక, ప్రయాణాలపై యతికి ఆసక్తి పెరిగింది.

"మీరెందుకు ఇలా పలు ప్రదేశాలు సందర్శిస్తున్నారని అక్కడికి వచ్చే పర్యటకులను అడిగేవాడిని. 'ఇది మా కోసం మేం చేస్తున్నాం, ఇందులో ఆనందం ఉంది' అని వారు చెప్పేవారు. మనకోసం మనం జీవిచడంలో ఆనందం ఉంటుందని నాకప్పుడే తెలిసింది. ఆ అనుభవం, అందరికీ చెప్పుకునేంత మంచి కథగా మారగలదని కూడా అర్థమైంది" అని యతి వివరించారు.

మోటార్‌బైక్‌పై యాత్రలు, ప్రయాణాలు ఫ్యాషన్‌గా మారుతున్న ఈ రోజుల్లో పాదయాత్రను ఎందుకు ఎంచుకున్నారని యతిని అడిగితే, "నడవడం తనకు ఒక థెరపీ లాంటిదని" చెప్పారు.

"మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్లగలిగేవి కాళ్లు మాత్రమే. నడుస్తూ వెళుతుంటే, ప్రతి 35-40 కిలోమీటర్ల తర్వాత హిమాలయాలు మారడాన్ని నేను చూశాను. బైక్ మీదో లేదా మరే ఇతర వాహనం మీదో వెళితే ఇలాంటి అనుభూతి సాధ్యం కాదని నాకనిపిస్తుంది.

ప్రయాణం కష్టమేగానీ దానివల్ల ప్రకృతితో అనుబంధం సులభం అవుతుంది. నడుస్తున్నప్పుడు నేను చిన్నపిల్లాడిలా మారిపోతాను. నాకు ఎలాంటి ఆందోళనా ఉండదు. మార్గమధ్యంలో కనిపించే ప్రతీ కొత్త విషయాన్ని చూసి చిన్నపిల్లల్లాగే ఆశ్చర్యపోతుంటాను."

సుమారు 20 కిలోలున్న ఒక బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని యతి ప్రయాణానికి సిద్ధమవుతారు. అందులో స్లీపింగ్ బ్యాగ్, కొన్ని జతల బట్టలు, ఆయింట్‌మెంట్, లెగ్ సపోర్టర్ మినహా పెద్ద వస్తువులేం పెట్టుకోరు.

ఎక్కడ చీకటి పడితే అక్కడే ఆ రాత్రికి బస చేస్తుంటారు. లేదా కనువిందు చేసే దృశ్యాలు ఉంటే అక్కడ గడుపుతారు. సాధారణంగా దేవాలయాల్లోనూ, ధర్మసత్రాలోనూ యతికి ఆశ్రయం లభిస్తూ ఉంటుంది. ఈ యాత్రలకు నెలకు 15వేలకు మించి ఖర్చు పెట్టరు.

యతి గౌర్

ఫొటో సోర్స్, Yati Gaur

కొన్ని చేదు జ్ఞాపకాలు

యతితో మాట్లాడుతూ ఉంటే, ఆయనకు ప్రకృతితో ఉన్న గాఢమైన అనుబంధం, ప్రజల మంచితనంపై ఉన్న విశ్వాసం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

పర్వత ప్రాంత ప్రజల ఆత్మీయత, రాజస్థాన్ రంగులు, సంగీతం గురించి మాట్లాడినప్పుడల్లా ఆయన కళ్లు ఆనందంతో మెరుస్తుంటాయి.

అయితే, ఈ ప్రయాణంలో కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయని యతి చెప్పుకొచ్చారు.

ఓసారి రాజస్థాన్ పర్యటనలో ఒక సాధువు ప్రబోధాలకు ఆకర్షితుడై ఆయన ఆశ్రమం చేరుకున్నారు యతి. అక్కడ గుడారం వేసుకుని కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈలోగా ఆ సాధువు అనుచరులు యతిని చుట్టుముట్టి గుర్తింపు కార్డు చూపించమని దబాయించారు.

"నాకు గడ్డం ఉండడం వలన వాళ్లు నన్ను ముస్లిం అనుకుంటున్నారని అర్థమైంది. షాకైపోయాను. 'నేనెక్కడి నుంచి వస్తే ఏంటి? ఆకలితో, అలసటతో వచ్చాను. ఏ బోధనలు వింటూ నేనిక్కడిదాకా వచ్చానో, అవి ఇక్కడే లేవు, అదృశ్యమైపోయాయని నాకు బోధపడింది' అంటూ వాళ్ల కళ్లల్లోకి సూటిగా చూస్తూ జవాబిచ్చాను."

సాధారణంగా సూర్యాస్తమయం తరువాత యతి నడక కొనసాగించరు. కానీ, ఆ రోజు ఆ సంఘటన తరువాత అక్కడి నుంచి వెంటనే బయలుదేరి, చీకటి పడినా కూడా నడక కొనసాగించారు.

అలా కొన్ని కిలోమీటర్లు నడిచి ఒక గుజ్జర్ల గ్రామంలో ఆ రాత్రికి బస చేశారు. అక్కడ యతికి ఎంతో ఆదరణ లభించింది. అయితే, తాను విడిచివచ్చిన ఆశ్రమం భక్తులు ఆ గ్రామంలో కూడా ఉన్నారని యతి గ్రహించారు. ఆ రాత్రి అక్కడ భజన గీతాలు వినిపించాయి.

ఇప్పటివరకూ ఎన్నో ప్రాంతాలను సందర్శించినా, తనకు అత్యంత ఇష్టమైనవి మాత్రం హిమాచల్‌ ప్రదేశ్‌లో రోహ్రూలోని పబ్బర్ లోయ, కేదార్‌నాథ్ ఆలయానికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల పైన ఉన్న వాసుకి తాల్ అని యతి చెప్పారు.

ఒక బ్యాక్‌ప్యాక్ మాత్రం పట్టుకుని పాదయాత్రకు సిద్ధం అవుతారు యతి

ఫొటో సోర్స్, YATI GAUR

ఫొటో క్యాప్షన్, ఒక బ్యాక్‌ప్యాక్ మాత్రం పట్టుకుని పాదయాత్రకు సిద్ధం అవుతారు యతి

భవిష్యత్తు ప్లాన్ ఏంటి?

తనకు నిర్దిష్ట లక్ష్యాలపై నమ్మకం లేదంటారు యతి. కానీ, తూర్పు ఆసియా అంతా కాలినడకన చుట్టిరావాలనే కోరిక మాత్రం ఉందని చెప్పారు.

త్వరలో చార్‌ధామ్ యాత్ర చేయనున్నారు. భారతీయ సంస్కృతిలో పాదయాత్ర సంప్రదాయానికి చార్ ధామ్ యాత్ర చిహ్నమని ఆయన అన్నారు.

24 ఏళ్ల యతి, కృష్ణ దాస్ సంగీతం మొదలుకొని ఓషో, జిడ్డు కృష్ణమూర్తిల తత్వాల గురించి మాట్లాడుతుంటే ఒక రుషిలా కనిపిస్తారు.

కానీ, తాను సాధు సన్యాసిని కానని, తన కుటుంబాన్ని విడిచిపెట్టలేనని ఆయన అన్నారు.

"ఏదో ఒక రోజు నేను సొంత హాస్టల్ తెరవాలి. విశ్వవిద్యాలయాలకు వెళ్లి నా అనుభవాలన్నీ అక్కడి విద్యార్థులతో పంచుకోవాలి.. ఇవే నా కోరికలు" అని యతి చెప్పారు.

ఈ యాత్రలన్నిట్లో యతి నేర్చుకున్న పెద్ద పాఠం "దేన్నైనా స్వీకరించగలగడం" అనే లక్షణం.

యువతకు తానిచ్చే సందేశమేమిటని అడిగితే హిందీ సినిమా 'తను వెడ్స్ మను' నుంచి ఒక డైలాగ్ చెప్పారు.

"ఈ మనిషి అల్లంలా అన్ని మూలల నుంచీ విస్తరిస్తున్నాడు."

మానసిక వికాసం, బాహ్య అభివృద్ధి సమతుల్యంలో ఉండాలంటే మనం వర్తమానంలో జీవించాలని యతి అంటారు. దీని కోసం సంగీతం, సినిమా, ధ్యానం.. ఇలా దేన్నైనా అవలంబించవచ్చని అన్నారు.

"99 శాతం ప్రజలు ఊహల్లో జీవిస్తుంటారు. వారికి నేను చెప్పాలనుకున్నది ఒక్కటే.. చుట్టూ చూడండి, ఇదే జీవితం. జీవితం చిన్నదని నేను భావించట్లేదు. నా వరకు జీవితం చాలా విశాలమైనది" అని యతి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)