తమిళనాడులో బీజేపీ కుల సమీకరణలు ఆ పార్టీకి ఓట్లు తెస్తాయా

తమిళనాడు బీజేపీ కార్యకర్త

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తమిళనాడులోని కొన్ని పశ్చిమ జిల్లాలు, కన్యాకుమారి జిల్లాలో బీజేపీ పట్టు పెంచుకుంది.

కన్యాకుమారిలో నాడార్‌లను , పశ్చిమ జిల్లాలలోని గౌండర్ సామాజిక వర్గాన్ని కలపడమే ఆయా జిల్లాల్లో బీజేపీ బలానికి కారణమని చెబుతారు.

దక్షిణ తమిళనాడులోని షెడ్యూల్డ్ కులాల వారిని "దేవేంద్ర కుల వెళ్లలార్’’ కుల పరిధిలోకి చేర్చి ఆ వర్గాల వారిని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఇలాంటి కుల సమీకరణలు మిగిలిన జిల్లాల్లో బీజేపీకి అనుకూలించాయా?

"ఇలా కుల ప్రాతిపదికన అందరినీ ఒకే గూటికి చేర్చడం వల్ల కన్యాకుమారిలోని హిందూ సంస్థలకు మేలు చేకూరింది. కానీ, ఆ ప్రయత్నం మిగతా జిల్లాల్లో పని చేయలేదు. ఇది అర్ధం చేసుకోవాలంటే హిందూ సంస్థలు కన్యాకుమారిలో ఎలా వేళ్లూనుకుని పనిచేశాయో, దానిని ఓట్లుగా ఎలా మార్చుకుంటున్నాయో పరిశీలించాల్సి ఉంది" అని మౌంట్ కార్మెల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అన్నారు.

ఆయన కన్యాకుమారిలో హిందూ మత సంస్థల ఎదుగుదలపై పరిశోధన చేశారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, Getty Images

కన్యాకుమారిలో హిందూ మత సంస్థల అభివృద్ధి

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి కన్యాకుమారి కేరళలో భాగంగా ఉండేది. ఇది 1956 వరకు కేరళలో భాగంగానే ఉంది.

కన్యాకుమారి తమిళనాడులో చేరేటప్పటికే ఆ ప్రాంతంలో హిందూ మత సంస్థల కార్యకలాపాలు విరివిగా జరుగుతూ ఉండేవి.

"రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 1948లో పద్మనాభపురం రాజభవనంలో కన్యాకుమారి జిల్లాలో తొలి శాఖను ఏర్పాటుచేసింది. ఆ తర్వాత 1963 అల్లర్లు చోటు చేసుకున్నాయి. దాంతో హిందూ సంస్థల బలం మరింత పెరిగింది. అక్కడ వివేకానంద స్మారక చిహ్నం నిర్మించక ముందు ఒక శిలను వివేకానంద శిల అని గుర్తిస్తూ ఒక ఫలకాన్ని పెట్టారు. ఈ చర్యను ఆ ప్రాంతంలో నివసించే క్రైస్తవులు బాగా వ్యతిరేకించారు. క్రైస్తవులు ఆ శిలను జేవియర్ రాక్ అని అన్నారు. ఆ ఫలకాన్ని వారు పగలగొట్టడంతో అది అల్లర్లకు దారి తీసింది. ఆ తర్వాత అక్కడ వివేకానంద స్మారక చిహ్నాన్ని నిర్మించారు. కానీ, ఆ అల్లర్లు మిగిల్చిన గాయాలు మాత్రం రెండు మతాల వారి మనస్సులో ఉండిపోయాయి" అని అరుణ్ కుమార్ చెప్పారు.

ద్రవిడ పార్టీల కార్యకలాపాలు ఈ జిల్లాల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.

తమిళనాట బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

"కన్యాకుమారి జనాభాలో 80 శాతం మంది నాదర్లు, హిందూ నాడార్లు, క్రైస్తవ నాడార్లు, అయ్య వంశస్థులు ఉన్నారు.

ఆర్థిక పరంగా చూస్తే క్రైస్తవ నాడార్లు ఉన్నత స్థితిలో ఉన్నారు. వారి తర్వాత అయ్య వంశస్థులు ఇక్కడ ధనిక వర్గాల్లో ఉన్నారు.

హిందూ నాడార్లు మాత్రం మూడో స్థానంలో ఉన్నారు. ఈ ఆర్థిక అసమానతలే వీరిని మత ప్రాతిపదికన ఏకం చేయడానికి పనికొచ్చాయి".

"కామరాజర్ ఉన్నంత వరకు ఈ విబేధాలు అంతగా ప్రస్ఫుటం కాలేదు. కానీ, 1982లో చోటు చేసుకున్న అల్లర్ల తర్వాత ధనులింగ నాడార్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి హిందూ వర్గాల్లో చేరారు. ఆ తర్వాత అక్కడ హిందూ మత సంస్థల ప్రభావం పెరిగింది.

అక్కడున్న ఆర్థిక అసమానతలను సాంఘిక అసమానతలుగా చూపించడం మొదలుపెట్టి వారందరినీ ఒకే తాటి పైకి తెచ్చారు.

1982లో ఇక్కడ జరిగిన అల్లర్ల తర్వాత హిందూ నాడార్లలో హిందుత్వ భావన బాగా పెరిగింది. 1984లో హిందూ ఫ్రంట్ కి చెందిన ఒక అభ్యర్థి పద్మనాభపురం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇదే తమిళనాడులో తొలి హిందూ ఫ్రంట్ కి చెందిన అభ్యర్థి సాధించిన విజయం. ఆ తర్వాత కన్యాకుమారిలో అనేక నినాదాలు కూడా సృష్టించారు" అని అరుణ్ కుమార్ వివరించారు.

తమిళనాట బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

కన్యాకుమారి జిల్లాలో సాధారణంగా జాతీయ పార్టీలదే ఆధిక్యంగా ఉంటూ వస్తోంది. 2009లో డీఎంకే పార్టీకి చెందిన హెలెన్ డేవిడ్ సన్ ఎన్నికల్లో గెలిచే వరకు ప్రాంతీయ పార్టీలేవీ కన్యాకుమారిలో విజయం సాధించలేదు. కన్యాకుమారి తమిళనాడులో కలిసేవరకూ కూడా ఈ జాతీయవాదం కాంగ్రెస్ పార్టీకి అనుకూలించింది. కానీ, మార్షల్ నెసమని, కామరాజర్ మరణం తర్వాత హిందూ నాడార్లు హిందూ సంస్థలకు, బీజేపీకి మద్దతివ్వడం ప్రారంభించారు.

"వీటన్నిటి మధ్యా బీజేపీ కూడా హిందూ నాడార్లు కాకుండా మిగిలిన కులాల వారినీ ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.

ముఖ్యంగా పద్మనాభపురంలో నివసించే కృష్ణవాగై కులం వారిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి కుల సమీకరణలు చేయడానికే బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ, ఇలాంటి ప్రయత్నాలు కన్యాకుమారిలో తప్ప మరెక్కడా పని చేయటం లేదు" అని అరుణ్ కుమార్ అన్నారు.

బీజేపీని బయట వాళ్ళు ఒక మతవాద పార్టీగా చూస్తారు. కానీ, వారు కులాలపైనా పని చేస్తారు" అని పేరు చెప్పడానికి ఇష్టపడని మదురైకి చెందిన ఒక పరిశోధకుడు అన్నారు.

"బీజేపీ ఈ కులాలు పుట్టుకకు సంబంధించిన సిద్ధాంతాలను ఆమోదిస్తుంది. ఉదాహరణకు దేవేంద్ర కుల వెళ్లలార్లు తమను తాము ఇంద్రుడి సంబంధీకులుగా భావిస్తారు. పరయార్ కులస్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ నందనార్ చిత్రంతో కూడిన కరపత్రాలను పంచుతోంది. ఇలాంటివన్నీ ఈ ప్రాంతంలో ఉన్న కొంత మందిని ఆకర్షించవచ్చు" అని ఆయన అన్నారు.

"బీజేపీ ఇదే పద్దతిని మొదటినుంచి అవలంబిస్తూ వస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, వారు ఇదే తీరును అవలంబిస్తారు. వారు కులాల్లో, పురాణాల్లో అల్లిన కథలన్నిటినీ ఆమోదించేస్తారు. ఆ కోణం నుంచి వారి రాజకీయ కార్యకలాపాలకు రచన చేయడం ప్రారంభిస్తారు" అని దళిత అధ్యయనకారుడు రఘుపతి అన్నారు.

తమిళనాట బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

పశ్చిమ జిల్లాల్లో కుల సమీకరణలు

తమిళనాడు దక్షిణాన ఉన్న జిల్లాల్లో నాడార్లు, దేవేంద్ర కుల వెళ్లలార్లతో పని చేసిన తర్వాత బీజేపీ పశ్చిమ జిల్లాలను లక్ష్యంగా చేసుకుంది. దక్షిణ జిల్లాల్లో అమలు చేసిన కుల సమీకరణల లాంటి వాటినే గౌండర్లు, అరుంధతియార్లతో 1990లలో చేయాలని ప్రయత్నించింది.

బీజేపీ పశ్చిమ జిల్లాల్లో పని చేయడానికి ముందుగా బలహీన వర్గాలను ఎంచుకుంది.

"1990లకు ముందు బీజేపీని పశ్చిమ జిల్లాల్లో బలహీన వర్గాల పార్టీగా భావించేవారు.

1991లో బలహీన వర్గానికి చెందిన అర్జున్ సంపత్ ఆ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉండేవారు. 1993 నుంచి బీజేపీ గౌండర్ కులస్థులపై దృష్టి పెట్టడం మొదలుపెట్టింది. అదే సమయంలో ద్రవిడ పార్టీలతో అసంతృప్తిగా ఉన్న చాలా మంది బీజేపీ వైపు తిరిగారు. దీనికి పొల్లాచి మహాలింగం లాంటి పారిశ్రామిక వేత్తల మద్దతు కూడా దొరికింది.

దీనికి మరో కారణం కోయంబత్తూర్లో చాలా దుకాణాలు ముస్లింల యాజమాన్యంలో ఉండేవి. ఇదే విషయాన్ని చెబుతూ హిందూ సంస్థలు గౌండర్ కులస్థులను కూడగటుతున్నప్పుడే కోయంబత్తూర్ బాంబు పేలుడు, ఆ తర్వాత జరిగిన అల్లర్లు బీజేపీకి అనుకూలంగా మారాయి.

బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

"ఇలా ఎందుకు జరిగింది? ద్రవిడ పార్టీలు కులాల మధ్య ఉన్న అంతరాలకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకుండా వాటిని అలాగే కొనసాగనిస్తారు. దాంతో ద్రవిడ పార్టీలు పట్టించుకోని మైనారిటీలు అందరూ తమకొక గుర్తింపు, మద్దతు కావాలని కోరుకుని బీజేపీ వైపు తిరుగుతారు. పశ్చిమ జిల్లాల్లో ఉండే కన్నడ జనాభాను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ 2014-2016 మధ్యలో అనేక సమావేశాలు నిర్వహించింది. ఆ సమావేశాల్లో బీఎస్ యడ్యూరప్ప లాంటి వాళ్ళు కూడా పాల్గొన్నారు. దీంతో బీజేపీ వారికి ప్రాముఖ్యం ఇస్తోందనే భావన చాలా మందికి కలిగింది"

"ఇదంతా కాకుండా వివిధ కులాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కూడా బీజేపీ ప్రయత్నించింది.

ప్రస్తుతానికి డీనోటిఫైడ్ తెగల జాబితాలో ఉన్న సీర్ మరబినార్ లాంటి వారికి షెడ్యూల్డ్ తెగల స్థాయిని కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీని గురించి హిందూ సంస్థల కార్యాలయాల్లో ప్రభుత్వ సంబంధిత వ్యక్తులతో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ తెగల వారికి షెడ్యూల్డ్ తెగల గుర్తింపు లభిస్తే ఇక్కడ ఓటు బ్యాంకు అంతా బీజేపీ వైపే వెళ్లే అవకాశం ఉంది" అని అరుణ్ కుమార్ అన్నారు.

అయితే, ఈ కుల సమీకరణలు కొనసాగుతాయా? ఇవి ఎప్పటికీ ప్రయోజనాలను చేకూరుస్తాయా? అనేది చూడాలి.

మరోవైపు ద్రవిడ పార్టీలు కులాల మధ్య అంతరాలను ప్రోత్సహించిన విషయాన్ని బీజేపీ ఉపయోగించుకుంటోంది.

"దీని వలన దీర్ఘకాలిక లాభాలు ఉంటాయో లేదో చెప్పలేం. కుల ప్రాతిపదికన ప్రజలు ఏకమైతే, హిందూ మతానికి చెందినవారిమనే గుర్తింపు తేవడం అంత త్వరగా రాదు. అందుకే వారు కన్యాకుమారిలో కోయంబత్తూర్ లో వైఫల్యాలు ఎదుర్కొంటున్నారు. కోయంబత్తూర్‌లో జరిగిన అల్లర్ల తర్వాత 1998, 1999లో బీజేపీకి చెందిన సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. కానీ, ఆ విజయం ఎప్పటికీ కొనసాగలేదు. ఇక్కడ కుల వివాదాలు చాలా స్పష్టంగా ఉండటంతో వారంతా హిందూ మత ప్రాతిపదికన ఒకే తాటిపైకి రాలేదు" అని అరుణ్ వివరించారు.

తమిళనాట బీజేపీ

ఫొటో సోర్స్, AFP

"దేవేంద్ర కుల వెళ్లలార్ల కు ప్రస్తుతం ఇచ్చిన గుర్తింపు ఇవ్వడానికి బీజేపీ చాలా కష్టపడాల్సి వచ్చింది. లేదంటే అది ఎన్నికల్లో ప్రయోజనం పొందలేదు" అని రఘుపతి అన్నారు.

"వారు ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలతో ప్రభావితులై ఉంటారు. బీజేపీ చేసిన ఇలాంటి పనుల వల్ల ఓట్లు వస్తాయనుకుంటే ఎగ్మోర్ లో జాన్ పాండియన్ ఎందుకు పోటీ చేస్తున్నారు? బీజేపీ హిందుత్వ వాదం, దేవేంద్ర కుల వెళ్లలార్లకు, నాడార్ కులాల వారికి వ్యతిరేకంగా ఉంది. ఇక్కడున్న అసలైన సమస్యలను పరిష్కరించకుండా ఈ విధానాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేరు" అని రఘుపతి అన్నారు.

కానీ, కన్యాకుమారిలో బీజేపీకి నిరంతరం మద్దతు లభిస్తూనే ఉంది. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి హెచ్ వసంత్ కుమార్ గెలిచినప్పటికీ బీజేపీకి మద్దతు తెలిపేవారు అక్కడ ఎక్కువగా ఉన్నారు. ఉదాహరణకు హిందూ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు కావాలని బీజేపీ నిరసన చేసినప్పుడు వారికి మద్దతు తెలుపుతూ లక్ష మంది ప్రజలు నిరసనలో పాల్గొన్నారు.

కన్యాకుమారి, పశ్చిమాన ఉన్న కోయంబత్తూర్ జిల్లాలు మాత్రమే కాకుండా బీజేపీ ఇదే విధమైన కుల సమీకరణాలను ఇతర జిల్లాల్లో కూడా ప్రయత్నిస్తోంది. వారక్కడ ప్రధాన పార్టీల దృష్టిలో లేని కులాలను లక్ష్యంగా చేసుకుని పని చేస్తారు. ఉదాహరణకు మదురైలో ఉండే సౌరాష్ట్ర సామాజికవర్గానికి చెందినవారు.

వీరికి మద్దతివ్వడం ద్వారా బీజేపీ దీర్ఘకాలిక ఓటు బ్యాంకును తయారు చేసుకోవాలని చూస్తోంది.

కానీ, ఎన్నికల రాజకీయాల్లో ఇలాంటి ఆలోచనలు పని చేస్తాయో లేదో కేవలం బీజేపీ కార్యకలాపాల మీదే కాకుండా, ద్రవిడ పార్టీలతో సహా ఆ ప్రాంతంలో ఉన్న మిగిలిన ప్రధాన వర్గాల ప్రతిస్పందన పై కూడా ఆధార పడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)