You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జూలియన్ అసాంజ్‌కు బెయిల్ నిరాకరించిన బ్రిటన్ కోర్టు - BBC Newsreel
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ బెయిల్ దరఖాస్తును బ్రిటన్ కోర్టు తిరస్కరించింది. ఆయనను అప్పగించాలని అమెరికా చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన రెండు రోజుల తరువాత బ్రిటన్ కోర్టు ఈ తీర్పు ప్రకటించింది.
అసాంజ్ తప్పించుకునే అవకాశాలు ఉన్నాయనడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయని డిస్ట్రిక్ట్ జడ్జి వెనీసా బారైట్సెర్ అన్నారు.
అసాంజ్ మానసిక స్థితి ఆందోళనకరంగా ఉందని, ఆత్మహత్యకు ప్రయత్నించే ప్రమాదం కూడా ఉన్నందను ఆయనను అమెరికాకు అప్పగించలేమని సోమవారం ఆమె తీర్పు ఇచ్చారు.
దాంతో, ఈ తీర్పుపై అపీలు చేయదలచుకున్న అమెరికా, తమ వాదనను వినేంతవరకు 49 ఏళ్ల అసాంజ్‌ను విడుదల చేయకూడదని కోర్టును కోరింది.
ముదురు రంగు సూట్ వేసుకుని మాస్క్ పెట్టుకున్న అసాంజ్ వెస్ట్ మెనిస్టర్ మేజిస్ట్రేట్ కోర్ట్ తీర్పుపై స్పందించలేదు..
అసాంజ్ 2019 నుంచి జైల్లో ఉన్నారు. అంతకు ముందు తనను అమెరికాకు అప్పగించకుండా తప్పించుకోడానికి ఆయన ఏడేళ్లు ఈక్విడార్ ఏంబసీలో దాక్కున్నారు.
హ్యాకింగ్ చేసినందుకు, వర్గీకృత సమాచారాన్ని బయటపెట్టినందుకు అమెరికా లాయర్లు ఆయన్ను విచారించాలని భావిస్తున్నారు. అసాంజ్ బయటపెట్టిన సమాచారంలో అఫ్గానిస్తాన్, ఇరాక్, మిగతా దేశాల్లో నిఘా ఏజెన్సీలకు సహకరించే ఇన్ఫార్మర్ల గుర్తింపు కూడా ఉంది.
తన క్లయింట్ మద్దతుదారుడు ఒకరు లండన్‌లో ఇల్లు ఇచ్చేందుకు ముందుకొచ్చారని, కఠినమైన బెయిల్ షరతులకు లోబడి ఆయన తన భాగస్వామి, పిల్లలతో అక్కడ ఉంటారని అసాంజ్ లాయర్ ఎడ్ ఫిట్జ్‌గెరాల్డ్ క్యూసీ బెయిల్ అప్లికేషన్లో చెప్పారు.
"మీ తీర్పు అన్నిటినీ మార్చేసింది, ముఖ్యంగా పరారయ్యే ఉద్దేశం ఏదైనా ఉంటే దాన్ని మార్చేసింది" అని ఫిట్జ్ గెరాల్డ్ అన్నారు. కఠిన ఆంక్షలకు లోబడి ఆయన సమాజంలో తన కుటుంబంతో కలిసి సురక్షితంగా ఒంటరిగా ఉంటారు అని చెప్పారు.
కానీ, అసాంజ్‌కు మరో దేశానికి వెళ్లడానికి రహస్యంగా విమానం ఏర్పాటు చేయగల వనరులు, సామర్థ్యం పూర్తిగా ఉన్నాయని అమెరికా లాయర్ క్లెయిర్ డొబ్బిన్ కోర్టుకు చెప్పారు.
"అసాంజ్ తనను చట్టానికి మించిన వారుగా భావిస్తారు. తనకోసం అయినా, ఇతరుల కోసం అయినా ఖర్చు ఆయనకు పెద్ద విషయం కాదు" అన్నారు.
కోర్టుకు భారీగా హాజరైన జూలియన్ అసాంజ్ మద్దతుదారుల్లో ఆయన భాగస్వామి స్టెల్లా మోరిస్ కూడా ఉన్నారు.
"ఇది చాలా నిరాశకు గురిచేసింది. జూలియన్ అసలు బెల్మర్ష్ జైలులో ఉండకూడదు. ఆయనపై ఆరోపణలు కొట్టివేయాలని అమెరికా న్యాయ శాఖను కోరుతున్నాను. అమెరికా అధ్యక్షుడు జూలియన్‌కు క్షమించాలని వేడుకుంటున్నా అన్నారు.
జూలియస్ అసాంజ్‌ను అప్పగించడాన్ని జిల్లా జడ్జ్ బారైట్సెర్ సోమవారం అడ్డుకున్నారు. ఆయన సమాధానం ఇవ్వాల్సిన ఒక కేసు ఉన్నప్పటికీ, అసాంజే మానసికంగా ఆరోగ్యంగా లేరని, అమెరికాలో గరిష్ట భద్రత ఉన్న జైలులోకి తీసుకెళ్లాక ఆయన ఆత్మహత్య చేసుకోరని అమెరికా అధికారులు గ్యారంటీ ఇవ్వలేరని అన్నారు.
బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు సమావేశమవుతున్న అమెరికన్ కాంగ్రెస్
ట్రంప్ మద్దతుదారుల నిరసనల నడుమ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు చట్టసభ సభ్యులు బుధవారం సమావేశం కాబోతున్నారు.
ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను ధ్రువీకరించేందుకు అమెరికాలో రెండు చట్టసభల సంయుక్త సమావేశం ఏర్పాటుచేస్తారు. అధికారికంగా బైడెన్‌ను ఎన్నుకునే ఈ సమావేశానికి అవాంతరాలు కలిగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు కొందరు రిపబ్లికన్లు మద్దతు పలుకుతున్నారు.
నిరసనల నడుమ ఇప్పటికే వందల మంది నేషనల్ గార్డ్ భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రంప్ ఓటమిని ధ్రువీకరించకుండా అడ్డుకునేందుకు వాషింగ్టన్ డీసీలో ట్రంప్ మద్దతుదారులు ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఓటమిని ట్రంప్ అంగీకరించని సంగతి తెలిసిందే.
కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది?
అమెరికాలోని 50 రాష్ట్రాలకు చెందిన ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సర్టిఫికేట్లను ఉభయ సభల సమావేశంలో ఓపెన్ చేస్తారు. అమెరికా ఎన్నికల విధానాల ప్రకారం.. ఓటర్లు మొదట ఎలక్టర్లను ఎన్నుకుంటారు. అలా ఎన్నికైన ఎలక్టర్లు కొన్ని వారాల తర్వాత అధికారికంగా అధ్యక్ష అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ప్రకారం.. బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయి.
ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ప్రకారమే అధ్యక్షుణ్ని ఎన్నుకునే ప్రక్రియ ఉంటుంది. అంటే ఎలక్టోరల్ కాలేజీలో ఎక్కువ ఓట్లు వచ్చిన వారే అధ్యక్షుడు అవుతారు.
స్వల్ప తేడాతో బైడెన్ విజయం సాధించిన రాష్ట్రాల ఫలితాలను ధ్రువీకరించే సమయంలో అడ్డుపడాలని కొందరు రిపబ్లికన్ చట్టసభ సభ్యులు భావిస్తున్నారు.
బైడెన్ విజయాన్ని ధ్రువీకరించకుండా అడ్డుపడాలంటే రెండు సభల్లోనూ ఆధిక్యం ఉండాలి. సెనేట్‌లో ఇప్పటికీ రిపబ్లికన్ల వైపే ఆధిక్యముంది. అయితే రిపబ్లికన్లలో కొందరు ట్రంప్ చేస్తున్న ఆరోపణలతో విభేదిస్తున్నారు.
కేసీఆర్ బంధువుల కిడ్నాప్.. మాజీ మంత్రి అఖిల ప్రియ అరెస్ట్
తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిల ప్రియను అదుపులోకి తీసుకొన్నారు.
కిడ్నాప్ అయిన సునీల్ రావు, నవీన్ రావు, ప్రవీణ్ సీఎం కేసీఆర్ సోదరి తరఫు సమీప బంధువులు. వీరు ముగ్గురూ సీఎం కేసీఆర్ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులని సమాచారం.
బోయినపల్లిలోని మనోవికాస్ నగర్ లో నివాసం ఉంటున్న ప్రవీణ్ రావు వారి సోదరులతో కలిసి నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఇన్ కంటాక్స్ అధికారులంటూ దుండగులు ఇంట్లోకి దూసుకోచ్చారని ప్రవీణ్ రావు సోదరుడు ప్రతాప్ రావు కుమారుడు మనీష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.
ఫిర్యాదులో ఇచ్చిన వివరాల ప్రకారం, సర్చ్ వారెంట్ , ఐడీ కార్డులు చూపించి వారి దగ్గర మొబైల్ ఫోన్లను తీసుకున్నారని తెలిపారు. సునీల్ రావు, నవీన్ రావు, ప్రవీణ్ లను హాల్ లో కూర్చోబెట్టి మిగతా కుటుంబ సభ్యులను బెడ్ రూమ్ లో బంధించారని తెలిపారు. ఎనిమిది గంటల సమయంలో సునీల్ రావు భార్య ఇంటికి వచ్చారు. ఇంటికి బయట నుంచి గడి ఉండటంతో సునీల్ రావు, నవీన్ రావు, ప్రవీణ్ కిడ్నాప్ కు గురైనట్టు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాజీ మంత్రి అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ కిడ్నాప్ చేయించి ఉండొచ్చని ఫిర్యాదులో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
నార్సింగి లోని మై హోమ్ అవతార్ అపార్ట్‌మెంట్ వద్ద ముగ్గురిని కిడ్నాపర్లు వదిలి పారిపోయారు.
అక్కడినుండి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు ప్రవీణ్ రావ్ అతని సోదరులు.
వికారాబాద్ సమీపంలో అనుమానితులను అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. హఫీజ్ పేట్ భూ వివాదమే కిడ్నాప్ కు కారణమని పోలుసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కిడ్నాప్ అయిన సునీల్ రావు, నవీన్ రావు, ప్రవీణ్ సోదరుడు ప్రతాప్ రావు మీడియాతో మాట్లాడుతూ, "తమ సోదరులను ఫార్మ్ హౌస్ కు తీసుకుని వెళ్లి కాగితాలపై సంతకాలు చేయించారు. మాకు అనుమానం ఉన్న వారి పేర్లు పోలీసులకు తెలిపాము. మాకు గతంలో కూడా బెదిరింపులు వచ్చాయి.." అని తెలిపారు.
సీపీ అంజనీకుమార్ ఏమన్నారు...
ఈ వ్యవహారంపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ, అఖిల ప్రియను ఉదయం 11.20 గంటలకు అరెస్ట్ చేసి, ఆరోగ్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి పంపించామని చెప్పారు. అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్‌కు కూడా ఈ కేసులో పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన అన్నారు.
సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా నిందితులను పట్టుకున్నామని చెప్పిన అంజనీ కుమార్, కిడ్నాప్‌కు పాల్పడినవారు ఇన్‌కమ్ టాక్స్ అధికారులమంటూ నకిలీ ఐడీలతో వచ్చారని తెలిపారు. ఈ కేసులో ఏవీ సుబ్బారెడ్డి మొదటి నిందితుడు. కాగా, అఖిల ప్రియ, భార్గవ్‌లు రెండవ, మూడవ నిందితులగా కేసు నమోదు చేసినట్లు వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ప్రతిరోజూ స్నానం చేయడం, చర్మ సౌందర్య ఉత్పత్తులు వాడటం ఎంత వరకు అవసరం?‘
- అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- హోమీ జహంగీర్ భాభా భవిష్యవాణి, బ్రిటన్‌లో నిజం కాబోతోందా
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
- బిట్ కాయిన్లు: అప్పుడు నిషేధించారు... ఇప్పుడు దూసుకుపోతున్నాయి...
- ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?
- కరోనావైరస్: భారత్ ఆమోదించిన కోవాగ్జిన్‌పై ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి?
- మైనస్ 67 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)