కర్నూలు ఎంపీ ఇంట్లో ఆరుగురికి కరోనావైరస్ పాజిటివ్.. జిల్లాలో పెరుగుతున్న కేసులు

ఏపీలో క‌రోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందులో క‌ర్నూలు జిల్లాలో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతున్నాయి.

తొలుత మ‌ర్క‌జ్‌కి వెళ్లి వ‌చ్చిన వారి ద్వారా ఈ వైర‌స్ వ్యాప్తి చెంద‌గా ఇప్పుడు లోక‌ల్ కాంటాక్టులు కూడా న‌మోద‌వుతున్నాయి.

దాంతో క‌రోనా వైర‌స్ వ్యాప్తి అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ చెబుతున్నారు.

క‌ర్నూలు ఎంపీ ఇంట్లో ఆరుగురు

క‌ర్నూలు జిల్లాలో ప‌లువురు ప్ర‌ముఖులు ఈ వైర‌స్ బారిన ప‌డుతుండ‌డం విశేషంగా మారుతోంది. ఇప్ప‌టికే న‌గ‌రంలో ప్ర‌ముఖ వైద్యుడు క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోవ‌డం అంద‌రినీ విషాదంలో ముంచింది.

తాజాగా క‌ర్నూలు ఎంపీ డాక్ట‌ర్ కే సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి పాజిటివ్ గా నిర్ధార‌ణైంది. ఈ విష‌యం రెండు రోజులుగా ప్ర‌చారంలో ఉంది. కాగా ఎంపీ నేరుగా మీడియా ముందుకు వ‌చ్చి ఈ ప్ర‌చారం వాస్త‌వ‌మేన‌ని ప్ర‌క‌టించారు

డాక్ట‌ర్ సంజీవ్ కుమార్ ఈ ప‌రిణామాలపై ‘బీబీసీ’తో మాట్లాడుతూ ‘‘మా ఇంట్లో ఆరుగురుకి పాజిటివ్ వ‌చ్చింద’’ని స్పష్టం చేశారు.

‘‘మా తండ్రి, నా ఇద్ద‌రు సోద‌రులు.. ఆ ఇద్దరి భార్యలు, ఒక సోదరుడికి కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధరణైంది. అంద‌రి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. ఎలాంటి స‌మస్య‌లు లేవు. వారంతా క‌ర్నూలు కోవిడ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ ఆస్ప‌త్రిలో అన్ని స‌దుపాయాలున్నాయి. య‌ధావిధిగా నిబంధ‌న‌ల ప్ర‌కారం ఐసోలేష‌న్ పూర్తి చేస్తారు. మేము కూడా జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నాం. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదు. వైర‌స్ ఎలా సోకిందనేది ఇంకా నిర్ధర‌ణ కాలేదు. అన్నింటినీ ప‌రిశీలిస్తున్నాం’’ అని తెలిపారు.

‘వైరస్ వ్యాప్తి తగ్గించడానికి లాక్‌డౌన్ దోహదపడుతుంది’

మిగిలిన దేశాల‌తో పోలిస్తే మ‌న ద‌గ్గ‌ర క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌క్కువ‌గా ఉండ‌డానికి అనేక కార‌ణాలున్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు.

క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌లు పాటించ‌డానికి, వ్యాప్తిని త‌గ్గించ‌డానికే లాక్‌డౌన్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.

ఎక్కువ కేసులు రావ‌డం ప‌ట్ల ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని, ఇమ్యూనిటీ పెంచుకోవ‌డం ద్వారా కరోనాను ఎదుర్కోవ‌చ్చ‌ని తెలిపారు.

యూరప్ దేశాలు, అమెరికా లాంటి ప‌రిస్థితి మ‌న దేశంలో రాద‌ని ఒక డాక్ట‌ర్ గా స్ప‌ష్టంగా చెప్ప‌గ‌ల‌న‌ని ఆయ‌న అంటున్నారు.

నిల‌క‌డ‌గా ఉంది.. ఆందోళ‌న అవ‌స‌రం లేదు.

క‌ర్నూలు జిల్లాలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప‌ట్ల ఎటువంటి ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ వీర పాండియ‌న్ అన్నారు.

తాజా ప‌రిస్థితిపై ఆయ‌న బీబీసీతో మాట్లాడారు.

‘జిల్లాలో ప్ర‌స్తుతం 279 కేసులున్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త నాలుగు పాజిటివ్ కేసులు మాత్ర‌మే వ‌చ్చాయి.

24 మంది ఐసోలేష‌న్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెండు సార్లు నెగిటివ్ రావ‌డంతో వారిని ఇంటికి పంపించాము.

జిల్లాలో ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. అవ‌స‌ర‌మైన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. అవ‌స‌ర‌మైన మేర‌కు సిబ్బంది , స‌దుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

కేసులు కూడా త్వ‌ర‌లో త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంద’’ని చెప్పారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)