'తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు జీతాలివ్వాలంటే రూ. 224 కోట్లు కావాలి... మావద్ద 7.5 కోట్లే ఉన్నాయి'

ఫొటో సోర్స్, Getty Images/BBC
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జీతాలు పిటిషన్ ను హైకోర్టు ఈ నెల 29 కి వాయిదా వేసింది. ఈ నెల 28 న ఆర్టీసీ పై డివిజన్ బెంచ్ లో విచారణ అనంతరం పిటిషన్ పై విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించాలంటే రూ. 224 కోట్లు కావాలని, అయితే కార్పొరేషన్ వద్ద రూ. 7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
సమ్మె కారణంగా ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించలేదు. పని చేసిన కాలానికి జీతం ఇవ్వకుండా ప్రభుత్వం ఆపేయడం కక్షపూరిత చర్య అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అయితే, సమ్మె చేస్తున్న కాలంలో 50 శాతం బస్సులు నడిపిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది, మరి ఆ ఆదాయం ఎటు పోయిందని పిటిషనర్... తక్షణమే 48 వేల మంది ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ జీతాలను ఇవ్వాలని కోరారు. ఇరు పక్షాలు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 29 కి వాయిదా వేసింది.
సమ్మెపై గతంలో హైకోర్టు వ్యాఖ్యలు
అక్టోబర్ 15న తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదలను జరిగాయి. అప్పుడు హైకోర్టు, ప్రభుత్వం, ఆర్టీసీ కార్మిక సంఘాల పట్టుదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించింది.సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని కార్మికులకు సూచించింది.
దీంతో, సమ్మెలో ఉన్న కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని యూనియన్ నాయకులు కోర్టు దృష్టికి తెచ్చారు.
ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన కూడా వెలువడిందని వారన్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన ఈ ప్రకటన కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని యూనియన్ నాయకులు కోర్టుకు తెలిపారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము సమ్మె అస్త్రాన్ని ప్రయోగించామని, ఈ పరిస్థితుల్లో సమ్మె విరమిస్తే ఇక తమ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావని వారు అన్నారు.
నెల ముందే తాము సమ్మె నోటీసు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కార్మిక సంఘాలు కోర్టుకు తెలిపాయి.
"చాలా కాలంగా సమస్యలు అలానే ఉన్నాయి. సంస్థకు పూర్తి స్థాయి ఎండీ కూడా లేరు. ఇబ్బందులు చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పాలో తెలియడం లేదు" అని కార్మిక సంఘాలు హైకోర్టుకు తమ వాదనలు వినిపించాయి.

ఫొటో సోర్స్, Getty Images
సమ్మె విరమణకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
అక్టోబర్ 5 నుంచి సమ్మె జరుగుతుండగా, దాన్ని విరమింపచేయడానికి ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.సమస్య పరిష్కారానికి యూనియన్లు, ప్రభుత్వం... ఇద్దరూ ఓ మెట్టు దిగి ప్రయత్నించాలని సూచించింది.
జీతాల పిటిషన్‌పై మళ్ళీ విచారణ 29న
ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తోందని, జీతాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అయితే, అక్టోబర్ 28న ఆర్టీసీపై డివిజన్ బెంచ్ లో విచారణ అనంతరం జీతాల పిటిషన్‌పై మళ్ళీ విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. పిటిషన్ విచారణనను ఈనెల 29కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- గూగుల్ పిక్సెల్ 4: 'రాడార్ ఫీచర్' కారణంగా భారతదేశంలో విడుదల రద్దు
- మహిళ అంగీకారంతో సెక్స్ చేసినా మగాడి మీద 'రేప్' కేసు పెట్టవచ్చా...
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- పాకిస్తాన్‌కు 4 నెలల డెడ్‌లైన్
- సిరియాలో సైనిక చర్య చేపట్టిన టర్కీపై తీవ్రమైన ఆంక్షలు విధించిన అమెరికా
- 'పప్పు' చేసిన అద్భుతం... అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో జంటకు నోబెల్
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
- తండ్రి శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్న కొడుకులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








