అరుణ్ బజాజ్: ఆయన కుట్టుమిషన్‌తో చిత్రాలు కుడతారు

సాధారణంగా కుట్టుమిషన్‌తో బట్టలు కుడతారు. కానీ పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన ఓ యువకుడు అందమైన చిత్రాలను రూపొందిస్తున్నారు. వీటిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పంజాబ్ నుంచి బీబీసీ ప్రతినిధి సరబ్‌జిత్ సింగ్ ధలీవాల్, కెమెరామన్ గుల్షన్ కుమార్ అందిస్తున్న కథనం...
ఈ యువకుడి పేరు అరుణ్ బజాజ్. కానీ అందరూ ఆయనను 'నీడిల్ మాన్' అని పిలుస్తారు.
"నా జీవితమంతా సూదికి, కుట్టుమిషనుకే అంకితం చేశా. వాటితో నా అనుబంధం విడదీయలేనిది" అంటారు అరుణ్.

ఇవి దారాలు, కుట్టు మిషనుతో బట్టలపై అరుణ్ రూపొందించిన చిత్రాలు. "కుట్టుమిషన్ నాకు దైవంతో సమానం. దానిపై ఎంతసేపు గడుపుతానో నాకే తెలియదు. అదంటే నాకు చాలా ఇష్టం. దానివల్లే నేనీరోజు ఈ ఉన్నత స్థితిలో ఉన్నాను. దారాల్లోని వివిధ రంగులు ముందుగా మనసులోనే మిక్స్ చేసుకుంటా. ఆ తర్వాత వాటినే నేను చిత్రాలుగా రూపొందిస్తా" అని చెబుతారు.
"కుట్టుమిషనుపై నేను చేసే పని అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. నేను కుట్టు మిషనుతో వేసే చిత్రాలకు, నిజంగా వేసే చిత్రాలకూ తేడాను ఎవ్వరూ కనిపెట్టలేరు" అని ఆయనంటారు.
అరుణ్ బజాజ్ పంజాబ్‌లోని పాటియాలా నగరానికి చెందినవారు. ఈ ప్రత్యేక నైపుణ్యమే ఆయనకు ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

"నా చిత్రాలు చూపించినప్పుడు ముందు ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఇవన్నీ కుట్టుమిషనుతో వేశాననే విషయం తెలుసుకున్నాక వారంతా ఆశ్చర్యపోయారు."
"ఇలా చేస్తూ సమయం వృథా చేసుకోవద్దని మొదట్లో చాలామంది నాతో అనేవారు. కానీ ఇప్పుడు ఈ చిత్రాలంటే అందరికీ ఎంతో ఇష్టం.
ఈ చిత్రాలకు మరింత ప్రత్యేక గుర్తింపు రావాలని కోరుకుంటున్నా" అని అరుణ్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









