బడ్జెట్ 2019: మహిళలకు చేసిన కేటాయింపులు ఏంటి?

మహిళలు భారత్ బడ్జెట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, భూమికా రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం కేంద్రంలోని ప్రస్తుత మోదీ ప్రభుత్వంలో ఆఖరి బడ్జెట్ ప్రవేశపెట్టారు.

కొన్ని నెలల్లోనే సాధారణ ఎన్నికలు జరగబోతుండడంతో ఈ బడ్జెట్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఇది జనరల్ బడ్జెట్‌కు భిన్నంగా మధ్యంతర బడ్జెట్ అయ్యింది.

2019 మే-జూన్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడితే, ఆ తర్వాత జనరల్ బడ్జెట్ ప్రవేశపెడతారు.

బడ్జెట్ ప్రారంభ ప్రసంగంలో పీయూష గోయల్ ప్రస్తుత ప్రభుత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ మరోసారి గాడిన పడిందన్నారు. మహిళలు, యువతను ప్రస్తావిస్తూ మేం మహిళలు, యువత కలలు సాకారం చేసేందుకు ప్రయత్నించామన్నారు.

కానీ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆఖరి బడ్జెట్‌లో మహిళలు తమ కలలు నెరవేర్చుకునేలా ప్రత్యేకంగా ఏదీ లేదు.

2019-20 మధ్యంతర బడ్జెట్లో మహిళా భద్రత, సాధికారత మిషన్ కోసం 1330 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని పీయూష్ గోయల్ చెప్పారు.

2018-19లో ఈ మిషన్ కోసం వేసిన అంచనాల కంటే ఇది కేవలం 174 కోట్ల రూపాయలు అదనం.

మధ్యంతర బడ్జెట్‌లో మహిళల కోసం చేసిన ప్రకటన గురించి ఆర్థిక వేత్త నేహా షా "మొట్టమొదట మనం ఇది మధ్యంతర బడ్జెట్ అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనిపై ఎక్కువ ఆశలు పెట్టుకోవడం సరికాదు" అన్నారు.

మధ్యంతర బడ్జెట్‌పై ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదనే మాట నిజమే. కానీ మిడిల్ క్లాస్ టాక్స్ పేయర్స్ కోసం ప్రభుత్వం ఎంతోకొంత చేసింది. మహిళలకు మాత్రం ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా ఏదైనా చేసినట్లు ఏం కనిపించలేదు.

ముందే ప్రకటించి, అమలు చేస్తున్నారు కాబట్టే బహుశా ఉజ్వల యోజన, మెటర్నిటీ లీవ్‌ పెంచడం లాంటి వాటి గురించి పీయూష గోయల్ ప్రస్తావించారు.

మహిళలు

ఫొటో సోర్స్, EPA

‘గవర్నమెంట్‌ మహిళా ఉద్యోగులకే అయితే, దీని లబ్ధి అందరికీ ఉండదు’

ఉజ్వల యోజన కోసం 8 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించామని, ఇప్పటివరకూ ఆరు కోట్ల కనెక్షన్లు అందించామని చెప్పారు.

విజయవంతమైన ప్రభుత్వ పథకాల్లో ఉజ్వల యోజన కూడా ఒకటని పీయూష్ చెప్పారు. అలాగే మెటర్నిటీ లీవుల గురించి ప్రస్తావించిన ఆయన వాటిని తమ ప్రభుత్వం 26 వారాలకు పెంచిందన్నారు.

వీటితోపాటు ఆయన ముద్రా యోజన కింద లబ్ధి పొందే వారిలో 70 శాతంకు పైగా మహిళలే ఉన్నారని చెప్పారు.

"మహిళల కోసం ప్రకటించిన ఈ మెటర్నిటీ లీవులు వర్తిస్తే బాగానే ఉంటుంది. కానీ అలా ఇవ్వడం లేదు. ఈ పథకం కేవలం సెంట్రల్ గవర్నమెంట్‌ మహిళా ఉద్యోగులకే అయితే, దీని లబ్ధి అందరికీ ఉండదు" అని నేహా శర్మ అన్నారు.

ఉజ్వల యోజన గురించి మాట్లాడిన ఆమె "దీనివల్ల మహిళలకు ప్రయోజనం లభించి ఉండచ్చు. కానీ కొందరు సిలండర్ రీఫిల్ కోసం ఇప్పటికీ చాలా కష్టాలు ఎదుర్కుంటున్నారు. అలాంటి వారి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది" అన్నారు.

అగ్రికల్చర్ ట్రేడ్ పాలసీ, ఫుడ్ సెక్యూరిటీ నిపుణులు శ్వేతా శైనీ "ఈ బడ్జెట్ మహిళలకు ప్రత్యేకంగా ప్రయోజనాలు అందించకపోయినా, ట్యాక్స్, జీఎస్టీ, వడ్డీ మినహాయింపు ప్రయోజనాలు మహిళలకు కూడా అందుతాయని" అన్నారు.

అయితే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నఆమె "ఈ బడ్జెట్లో వ్యవసాయం చేస్తున్న మహిళలకు ఇంకొన్ని ప్రకటనలు చేసుండవచ్చని" చెప్పారు.

"వ్యవసాయంలో మహిళలు కూడా ముందుకొస్తున్నారు. వారిని ప్రోత్సహించడానికి మహిళా రైతులకు, కూలీలకు కొన్ని ప్రకటనలు చేసుండచ్చు. అలా జరిగుంటే బాగుండేదని నాకు అనిపిస్తోంది".

మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

కొత్త పథకాలు ప్రకటించకూడదు

"ఇప్పుడు 40 వేల రూపాయల వరకూ బ్యాంక్ వడ్డీపై ట్యాక్స్ చెల్లించాల్సిన పనిలేదు. దీనివల్ల ముఖ్యంగా ఉద్యోగాలు చేయని మహిళలకు చాలా ప్రయోజనం లభిస్తుంది. ప్రస్తుతం వారికి ఈ పరిధి పది వేల రూపాయల వరకే ఉంది" అన్నారు శ్వేత.

పన్నుల విషయాల్లో నిపుణులు, CA డీకే మిశ్రా "మహిళలకు రెండు రకాల ప్రయోజనాలు లభిస్తున్నాయి. వాటిలో ప్రత్యేకంగా ఒక జెండర్‌ కోసం అంటూ ప్రకటించనవి కూడా ఉన్నాయి. వాటి వల్ల మహిళలకు కూడా ప్రయోజనం అందుతుంది" అన్నారు.

ఆయన మాటల ప్రకారం "మహిళలకు ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా, వారికి ప్రయోజనం అయితే కలిగిందనే" తెలుస్తోంది.

మధ్యంతర బడ్జెట్, జనరల్ బడ్జెట్‌ కంటే ప్రత్యేకం

సాధారణంగా మధ్యంతర బడ్జెట్ ఎన్నికల వరకు దేశ బడ్జెట్ వివరాలు ఇస్తుంది. దానితోపాటు వచ్చే ఏడాది రెవెన్యూ, రాబోయే ప్రభుత్వం ఖర్చు గురించి ఒక అంచనాను కూడా అందిస్తుంది.

ఇటీవల భారత్ మహిళా ప్రెస్ కోర్ సెషన్‌లో మాట్లాడిన మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా "మధ్యంతర బడ్జెట్‌లో కొత్త పథకాలను ప్రకటించే హక్కు ప్రభుత్వానికి ఉండదని చెప్పారు.

"ఇలాంటి స్థితిలో ప్రభుత్వం మూడు, నాలుగు నెలల ఖర్చు వివరాలు మాత్రమే ఇవ్వాలి. ఎన్నికల సంవత్సరం ప్రభుత్వం సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడితే అది పరోక్షంగా రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)