#గమ్యం: ఎన్టీఏ - ఆ పోటీ పరీక్షలిక ఏడాదికి రెండు సార్లు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనిల్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.
జులై 7న కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి ఓ ముఖ్యమైన ప్రకటన వచ్చింది. జేఈఈ, నీట్, నెట్, సీమ్యాట్, జీప్యాట్ పరీక్షలు రాయాలనుకుంటున్న విద్యార్థులకు, అభ్యర్థులకు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రకటన ఇది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. గత నవంబర్‌లో దీనికి ఆమోదం లభించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రకటన జారీ అయింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే... ఉన్నత స్థాయి ప్రవేశ లేదా పోటీ పరీక్షలన్నింటినీ ఓ ఉమ్మడి ఏజెన్సీ ద్వారా, వివాదరహితంగా నిర్వహించాలి. దీనికోసం ఎన్టీఏను ఏర్పాటు చేశారు.
దీంతో ఇక నుంచి జేఈఈ మెయిన్స్, నీట్ సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించనున్నారు. అయితే దీనివల్ల ప్రయోజనాలేంటి, రెండుసార్లు ఎప్పుడు నిర్వహిస్తారు వంటి విషయాలన్నీ ఈ వారం 'గమ్యం'లో వివరిస్తున్నారు Careers360.com ఇంజనీరింగ్ ఎడిటర్ ప్రభ ధవళ. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.
ఈ కొత్త విధానం ద్వారా ఏ పరీక్షా ఆఫ్‌లైన్‌లో జరగదు. ఇక నుంచి అన్నీ ఆన్‌లైన్ పరీక్షలే. ప్రతి సంవత్సరం జనవరిలో ఓసారి, ఏప్రిల్‌లో మరోసారి జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. అలాగే నీట్ ఫిబ్రవరిలో ఓసారి, మేలో ఓసారి నిర్వహిస్తారు. విద్యార్థులందరూ వారి ఇష్టానుసారంగా ఒక్క పరీక్షైనా రాయవచ్చు, లేదా రెండుసార్లూ హాజరు కావచ్చు. ఒకవేళ రెండుసార్లు పరీక్ష రాస్తే రెండింట్లో దేనిలో ఎక్కువ మార్కులు సాధిస్తారో వాటిని ర్యాంకింగ్ ఇచ్చేముందు పరిగణనలోకి తీసుకుంటారు. మిగిలిన నిబంధనలన్నీ యథాతథంగానే ఉంటాయి.
అన్ని పరీక్షలూ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి కాబట్టి దీనికి ముందుగా కొంత సంసిద్ధత అవసరం. కానీ అందరికీ కంప్యూటర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఓ ప్రత్యేక ఏర్పాటు చేసింది. నగరాలు, పట్టణాల్లోని ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రముఖ స్కూళ్లలో ఉన్న కంప్యూటర్లను శని, ఆదివారాల్లో నిర్థారించిన సమయాల్లో విద్యార్థులందరూ ఉచితంగా వినియోగించుకోవచ్చు. మాక్‌టెస్టులను ప్రాక్టీస్ చేయవచ్చు. ఆగస్టు మూడోవారం నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి. ఈ వివరాలన్నీ nta.ac.in వెబ్‌సైట్లో లభిస్తాయి.
ఎన్టీఏ పాత్ర కేవలం పరీక్ష నిర్వహించడం వరకే. తర్వాత జరిగే కౌన్సెలింగ్, ప్రవేశాలకు సంబంధించి ఎన్టీఏకు ఎలాంటి సంబంధం ఉండదు. పరీక్ష పూర్తై, ఫలితాలు వెలువడిన తర్వాత సంబంధిత అథారిటీ వీటిని నిర్వహిస్తుంది.

ఫొటో సోర్స్, NTA
ఎన్టీఏ నిర్వహించబోయే పరీక్షలు - ముఖ్యమైన తేదీలు
నెట్ (టీచర్‌షిప్)
- దరఖాస్తు తేదీలు: సెప్టెంబరు 1 నుంచి 30 వరకు
- పరీక్ష: డిసెంబరు 2 నుంచి 16 వరకు
- ఫలితాలు: 2018 జనవరి చివరివారంలో
జేఈఈ మెయిన్స్
- మొదటి పరీక్ష దరఖాస్తు తేదీలు: సెప్టెంబరు 1 నుంచి 30 వరకు
- పరీక్ష: 2018 జనవరి 6 నుంచి 20 వరకు (ఇంకా ఖరారు కాలేదు)
- ఫలితాలు: 2018 ఫిబ్రవరి మొదటివారం
- రెండో పరీక్షకు దరఖాస్తు తేదీలు: ఫిబ్రవరి రెండోవారం నుంచి
- పరీక్ష: ఏప్రిల్ 7 నుంచి 21 వరకు
- ఫలితాలు: మే మొదటి వారం
నీట్
- మొదటి పరీక్ష దరఖాస్తు తేదీలు: అక్టోబరు 1 నుంచి 31 వరకు
- పరీక్ష: ఫిబ్రవరి 3 నుంచి 17 వరకు
- ఫలితాలు: మార్చి మొదటివారం
- రెండో పరీక్షకు దరఖాస్తు తేదీలు: మార్చి రెండోవారం నుంచి
- పరీక్ష: మే 12 నుంచి 26 వరకు
- ఫలితాలు: జూన్ మొదటి వారం
సీమ్యాట్
- దరఖాస్తు తేదీలు: అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 15 వరకు
- పరీక్ష: జనవరి 27
- ఫలితాలు: ఫిబ్రవరి మొదటివారం
జీప్యాట్ (ఫార్మసీ)
- దరఖాస్తు తేదీలు: అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 15 వరకు
- పరీక్ష: జనవరి 27
- ఫలితాలు: ఫిబ్రవరి మొదటివారం

ఫొటో సోర్స్, Getty Images
సిలబస్, పరీక్ష విధానంలో ఏమైనా మార్పులుంటాయా?
ఎన్టీఏ వచ్చినంత మాత్రాన ఈ పరీక్షలన్నింటికీ సిలబస్‌లోగానీ పరీక్ష విధానంలోగానీ ఎలాంటి మార్పులూ లేవు. ఇంతకు ముందు ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగుతుంది. దానికి అలవాటు పడటానికి, అవగాహన పెంచుకోవడానికి మాక్‌టెస్టులను ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి.
ఇతర వివరాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఆయా పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు వస్తే తప్ప మరింత సమాచారం తెలిసే అవకాశం లేదు. అందువల్ల ఎన్టీఏ వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండండి. ఆల్ ద బెస్ట్.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









