కుమారస్వామి: బీజేపీతో శత్రుత్వం నుంచి కాంగ్రెస్‌తో దోస్తీ దాకా

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యడ్యూరప్ప రాజీనామాతో కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికర ఘట్టంలోకి చేరుకున్నాయి.
కర్ణాటక ఫలితాలు వెలువడగానే బీఎస్ యడ్యూరప్ప ఎంత వేగంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారో, అంతే వేగంగా ఆయన రాజీనామా కూడా చేసేశారు. అలా కేవలం 55 గంటల్లోనే బీజేపీ ప్రభుత్వం పడిపోయింది.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే, యడ్యూరప్ప ఒకరోజు ముఖ్యమంత్రిగానే మిగిలిపోతారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. జేడీఎస్‌తో పొత్తుతో తమ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అది ప్రకటించింది.
ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి పదవికి, కుమారస్వామికి మధ్య 'ఒకవేళ' అనే దూరం ఉంటూ వచ్చింది. కానీ శనివారం యడ్యూరప్ప ప్రభుత్వం విశ్వాసపరీక్షకు సిద్ధపడకపోవడంతో కుమారస్వామికి ముఖ్యమంత్రి అయ్యేందుకు దారి సుగమమైంది.
యడ్యూరప్ప రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కుమారస్వామిని ఆహ్వానించారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాక, అందులో కాంగ్రెస్ పాత్ర ప్రముఖంగా ఉంటుంది.
అయితే, అంతకన్నా ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం - అసలు జేడీఎస్, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు ఎలా కుదిరింది?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత కుమారస్వామి మాట్లాడుతూ, "2006లో బీజేపీతో కలిసి నడవాలన్న నా నిర్ణయం ఫలితంగా నా తండ్రిగారి కెరీర్‌లో ఒక మచ్చ ఏర్పడింది. దేవుడు నాకు ఈ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చాడు. నేను కాంగ్రెస్‌తో కలిసి నడుస్తాను" అన్నారు.
ఇంతకూ కాంగ్రెస్‌తో కుమారస్వామి సంబంధాలు ఎప్పుడూ ఇలాగే ఉన్నాయా? బీజేపీతో ఆయన సంబంధాల్లో సమస్యేంటి?
ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే చరిత్ర పుటల్లోకి వెళ్లాల్సిందే.

ఫొటో సోర్స్, Reuters
బీజేపీతో చెలిమి
కర్ణాటకలో 2004 విధానసభ ఎన్నికల తర్వాత జేడీఎస్, కాంగ్రెస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ 2006 వచ్చేసరికి కుమారస్వామి పొత్తును చీల్చారు.
2006లో తన తండ్రి హెచ్‌డీ దేవెగౌడ మాటను పెడచెవిన పెడుతూ కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీని చీల్చి బీజేపీతో దోస్తీ చేశారు.
పాలనా కాలంలో సగభాగం కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉంటారనీ, మిగిలిన సగభాగం బీజేపీకి ఆ అవకాశం ఇవ్వాలనీ బీజేపీ-జేడీఎస్‌ల మధ్య డీల్ కుదిరింది. కానీ 2007 అక్టోబర్‌లో కుమారస్వామి తన వాగ్దానాన్ని తానే ఉల్లంఘిస్తూ బీజేపీకి ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకున్నారు.
ఆ తర్వాత జరిగిన విధానసభ ఎన్నికల్లో బీజేపీ తన సొంత బలంతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్‌తో వైరం
ఇక మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ విషయానికొస్తే, 1999లో ఆయన జనతా దళ్ నుంచి వేరుపడి జనతాదళ్ సెక్యులర్ ఏర్పాటు చేశారు.
1977లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే జనతా పార్టీ ఏర్పాటు జరిగిందన్నది గమనార్హం. ఆ తర్వాత పరిణామాల్లో జనతా పార్టీనే జనతా దళ్‌గా ముందుకొచ్చింది.
కానీ ఆ తర్వాత వీటి మధ్య శత్రుత్వం పోయి స్నేహం కుదరడంతో దేవెగౌడ ప్రధానిగా 1996లో పది నెలల పాటు సాగిన ప్రభుత్వానికి కాంగ్రెస్ కూడా మద్దతునిచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
సిద్ధరామయ్య బాధ
ఇక సిద్ధరామయ్యది మరో రకం బాధ. ఆయన చాలా సంవత్సరాల పాటు దేవెగౌడతో కలిసి నిష్ఠాపూర్వకంగా పని చేశారు.
కానీ పార్టీ పగ్గాలు అప్పజెప్పాల్సిన సమయం వచ్చేసరికి దేవెగౌడ తన చిరకాల విశ్వాసపాత్రుడైన సిద్ధరామయ్యను పక్కనబెట్టి తన కుమారుడైన కుమారస్వామిని ముందుకు తెచ్చారు.
సొంత గూటిలోనే తిరస్కరణకు గురైన తర్వాత సిద్ధరామయ్య అహింద (అల్పసంఖ్యాకులు, ఓబీసీ, దళితులు) ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు.
కానీ దేవెగౌడ పట్ల ఆయనలో శత్రుత్వ భావన కొనసాగడమే కాదు, ఈ కారణం వల్లనే ఆయన వొక్కళిగ సముదాయానికి చెందిన అధికారుల పట్ల వివక్ష చూపారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.
దేవెగౌడ వొక్కళిగ సముదాయానికి చెందిన వ్యక్తి. కర్ణాటక రాజకీయాల్లో ఈ సముదాయానికి చెందిన వారిది ప్రముఖ పాత్ర.
కుమారస్వామికి రాజకీయాలు ఆయన తండ్రి నుంచే సంక్రమించాయి. దేవెగౌడకు వ్యతిరేకంగా సిద్ధరామయ్య చేస్తున్న రాజకీయ దాడిని మొత్తం వొక్కళిగ సముదాయంపైనే చేస్తున్న దాడిగా కుమారస్వామి చిత్రీకరించడం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
కుమారస్వామి రాజకీయ ప్రయాణం
కుమారస్వామి 1996లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మొట్టమొదటిసారి ఆయన 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కనక్‌పురా నుంచి పోటీచేసి గెలిచారు.
ఇప్పటివరకు ఆయన తొమ్మిదిసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. అందులో ఆరుసార్లు విజేతగా నిలిచారు. ఈసారి ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి - చెన్నపట్టణ, రామానగర్ - పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు.
రాజకీయాల్లోకి రావడానికి ముందు కుమారస్వామి సినిమా పరిశ్రమలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








