'మేం సెక్స్ అమ్మేవాళ్లం కాదు.. కళాకారులం!'

ఫొటో సోర్స్, BBC/ Rakesh Kumar
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పైట లేకుండా లంగా, జాకెట్ వేసుకొని... పెదాలపై లిప్‌స్టిక్ పూసుకొని... కళ్లకు కాటుక, నుదుట బొట్టు, పొడవైన వెంట్రుకల్ని ఒక్క రబ్బరుబ్యాండుతో చుట్టేసుకున్న ఓ వ్యక్తి దిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జెంట్స్ టాయిలెట్లోకి దూరే ప్రయత్నంలో ఉన్నారు.
అప్పుడు రాత్రి దాదాపు 8 గంటలవుతోంది. ఏప్రిల్ నెల.
వెనుక నుంచి ఓ గార్డు వచ్చాడు. "మేడం, మీరు ఇందులోకి వెళ్లగూడదు" అన్నాడు.
ఆ వ్యక్తి వెంటనే ఇలా జవాబిచ్చాడు, "భయ్యా... నేను, రాకేశ్‌ను. గుర్తు పట్టలేదా? థర్డ్ ఇయర్ స్టూడెంట్‌ను. ఇప్పుడు నా పర్‌ఫార్మెన్స్ ఉంది. థియేటర్ ఒలింపిక్స్‌లో లోండా నాచ్ చేస్తున్నాం."
థియేటర్ ఫెస్టివల్
దిల్లీ నగరం మొట్టమొదటిసారి థియేటర్ ఒలింపిక్స్ ఫెస్టివల్‌కు ఆతిథ్యం ఇచ్చింది.
ఇందులో ప్రపంచంలోని 30 దేశాల నుంచి దాదాపు 25 వేల మంది కళాకారులు పాల్గొన్నారు.
ఈ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో రాకేశ్ కుమార్ ప్రదర్శించిన 'లోండా నాచ్' అందరి ప్రశంసలు అందుకుంది.
రాకేశ్ దిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) విద్యార్థి. ఆయనది బిహార్‌లోని సివాన్. అనుపమ్ ఖేర్, పంకజ్ కపూర్, ఓమ్‌పురి వంటి పేరున్న నటులంతా ఎన్ఎస్‌డీ నుంచి వచ్చినవారే.

ఫొటో సోర్స్, BBC/ Rakesh Kumar
పట్టుదలే అక్కడికి చేర్చింది..
ఇక్కడికి చేరుకోవడం కోసం రాకేశ్ వరుసగా ఐదుసార్లు పరీక్షలు రాశాడు. లిఖిత పరీక్ష తర్వాత చివరి రౌండ్‌లోనే ఆయన ప్రతిసారి విఫలమయ్యేవాడు. కానీ ఎలాగైనా సాధించాలనే పట్టుదల ముందు ఓటమి ఎక్కడ నిలబడగలుగుతుంది? రాకేశ్ పట్టుదలే అతడిని ఎన్ఎస్‌డీ దాకా తీసుకొచ్చింది.
అమ్మాయి వేషంలో రాకేశ్ లోండా నాచ్ అందరినీ ఆకట్టుకుంది.
బిహార్ గ్రామీణ ప్రాంతాల్లో లోండా నాచ్‌కు చాలా ప్రజాదరణ ఉంది. ఈ నాట్యంలో ప్రత్యేకత ఏంటంటే మగవాళ్లు మహిళల వేషం వేసుకొని డాన్స్ చేస్తారు. ఈ కళాకారులంతా భోజ్‌పురీ షేక్‌స్పియర్‌గా పిలిచే భిఖారీ ఠాకుర్‌ను తమకు ఆదర్శంగా భావిస్తారు.
ఆయన రూపొందించిన నాటకం 'బిదేసియా'ను రాకేశ్ తన గురువు సంజయ్ ఉపాధ్యాయ్‌తో కలిసి అనేక వేదికలపై ప్రదర్శించాడు.
అయితే ఈ కళ క్రమక్రమంగా అంతరించిపోతోంది.

ఫొటో సోర్స్, BBC/ Rakesh Kumar
ఎన్ఎస్‌డీ, లోండా నాచ్
అయితే ఎన్ఎస్‌డీ వేదికపై ఈ నాట్యాన్ని ప్రదర్శించాలన్న ఆలోచన రాకేశ్‌కు ఎలా వచ్చిందసలు?
దీని గురించి రాకేశ్ బీబీసీతో ఇలా చెప్పారు, "నేను ఒక వృత్తిగా లోండా నాచ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నా చిన్నతనంలో పెళ్లిళ్లు చూడడానికి వెళ్లినపుడు అక్కడ అమ్మాయిలు నాట్యం చేస్తుంటే వాళ్లతో కలిసి డాన్స్ చేయకుండా ఉండలేకపోయేవాణ్ని. ఇంటికి వచ్చాక నాకు చాలా దెబ్బలు పడేవి. అయినా నేను అట్లాగే చేస్తుండేవాణ్ని."
తనకు అప్పటి నుంచే దీని పట్ల మోజు ఉండేదని రాకేశ్ అంటారు.
చిన్నతనంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకుంటూ ఆయన "నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు నాటకంలో ఎవరెవరు పాల్గొంటారో చేతులు ఎత్తండి అని మా మేడం అడిగారు. నేను పాల్గొని అమ్మాయి వేషం వేశాను. నా ప్రదర్శనను జనం బాగా మెచ్చారు. ఆ తర్వాతి నుంచి నాకు అదో వ్యసనంలా మారింది" అని తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/ Rakesh Kumar
ప్రజాదరణ
బిహార్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో లోండా నాచ్‌కు నేటికీ వన్నె తరగలేదు. ఇందులో పురుషులు మహిళల లాగా అలంకరించుకొని డాన్స్ చేస్తారు. అయితే అశ్లీల సంభాషణలు, సంకేతాలు చాలానే ఉంటాయనే అపఖ్యాతి కూడా ఈ నాట్య ప్రక్రియ మూటగట్టుకుంది.
ఈ లోండా నాచ్‌కు మరో చీకటి కోణం కూడా ఉంది. ఈ నాచ్‌లో పాల్గొనే కుర్రాళ్లను జనం చులకనగా చూస్తారు. హేళన చేస్తారు.
లోండాలను ఉద్దేశించి చాలా కామెంట్స్ చేస్తుంటారు. అలాంటివెన్నో రాకేశ్ స్వయంగా ఎదుర్కొన్నారు.
జనాలు ఓ సెక్స్ వర్కర్ గురించి చులకనగా మాట్లాడుతూ ఎలాంటి కామెంట్స్ చేస్తారో తమ పట్లా అలాగే చేస్తారని రాకేశ్ తెలిపారు.
"మేం వ్యభిచారం చేయడం లేదు కదా, ఇదొక కళ అంతే."

ఫొటో సోర్స్, BBC/Rakesh Kumar
సమాజం లాగానే కుటుంబం కూడా ఆయన కళను తిరస్కరించిందా?
పై ప్రశ్న అడిగినప్పుడు రాకేశ్ ముఖంలో అప్పటి వరకు అలుముకున్న విచారం మాయమవుతుంది. చిన్నగా నవ్వేసి తన చిన్ననాటి జ్ఞాపకం నాతో పంచుకున్నారు.
"నా కుటుంబం నన్ను ఎప్పుడూ అడ్డుకోలేదు. మా నాన్నగారైతే స్టేజి పైకి వచ్చి నాకు బహుమతి ఇచ్చారు. అదీ ఐదొందల రూపాయల బహుమతి. నాకు చాలా బాగా అనిపించింది. మా నాన్నగారు ఆర్మీలో ఉన్నారు. చూడ్డానికి ఆయన చాలా కఠినంగా అనిపిస్తారు. ఆయన నన్ను ప్రోత్సహించినప్పుడు నాకెంతో సంతోషంగా అనిపించింది."

ఫొటో సోర్స్, BBC/ Rakesh Kumar
ఇంతకూ లోండా నాచ్ ఏంటసలు?
లోండా నాచ్ ఇతర నాట్య ప్రక్రియలకు ఎలా భిన్నమైంది?
దీనికి జవాబిస్తూ రాకేశ్ ఇలా అంటారు, "ఢోలక్ వాయిస్తూ, హార్మోనియం మోగిస్తూ కుర్రాడు (లోండా) గెంతుతూ చౌకీపై నాట్యం చేస్తుంటే ఆ మజానే వేరు."
"బాల్యం నుంచే నా గొంతులో రాగాలు బాగా పలికేవి. నా నడుం ఎటంటే అటు వంగుతుంది. నేను మేకప్ వేసుకొని నకిలీ బ్రెస్ట్‌లు ధరించి ప్రదర్శనలోకి దిగినపుడు నన్ను నేను మర్చిపోతుంటాను."
అయితే ఈ కళ అంతరించిపోవడానికి దగ్గరలో ఉందని ఆయనంటారు. ఇప్పుడు ఇలాంటి నాట్యం చేసే వాళ్లు చాలా తక్కువ మంది మిగిలారు. అందుకే ఇది అంతరించపోకుండా ఆపాలనే రాకేశ్ ప్రయత్నం.
"ఎన్ఎస్‌డీ స్టేజి మీదకు ఈ కళను తీసుకురావడం ద్వారా నేను దీనికి గుర్తింపు తేవాలనీ, తద్వారా ఇది అంతరించిపోకుండా చూడాలని నేను ఆశిస్తున్నా" అన్నారు రాకేశ్.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









