ప్రెస్‌రివ్యూ: దేశం ఉత్తర, దక్షిణాలుగా విడిపోయే పరిస్థితి వస్తుందన్న పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, JanasenaParty
పాలకులు చేసిన తప్పుతో ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారని 'ఈనాడు' తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విషయాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని... ప్రజల్ని, పార్టీలను అయోమయంలో పడేస్తున్నాయని అన్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే సదుద్దేశంతో సంయుక్త నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్‌సీ) ద్వారా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ప్రత్యేకహోదా ఇస్తారా? ఇవ్వరా? లేదా దానికి ప్రత్యామ్నాయం ఏదైనా చూపిస్తారా? అనేది స్పష్టం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మాటకు కట్టుబడి బాధ్యతగా వ్యవహరించకపోతే దేశ సమగ్రతకే భంగమన్నారు. పౌరులకు తాము ద్వితీయశ్రేణి ప్రజలమా అన్న భావన కలిగితే దేశం దక్షిణ, ఉత్తర ప్రాంతాలుగా విడిపోవాలనే వేర్పాటువాదానికి దారి తీస్తుందని అన్నారు.
జేఎఫ్‌సీ తొలిరోజు సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. పవన్‌కల్యాణ్ ట్యాంక్‌బండ్ వద్ద డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి సమావేశానికి వెళ్లారు. లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ దీనికి నేతృత్వం వహించారని ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, nara chandrababu naidu/Facebook
ఆంధ్రప్రదేశ్‌కు ఏం తెస్తారు.. ఏమిస్తారు?
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాలని భావిస్తుండటం, అదికూడా నేరుగా ప్రధాని కార్యాలయం నుంచే ప్రతిపాదన రావడం ఆసక్తి రేకెత్తిస్తోందని 'ఆంధ్రజ్యోతి' కథనాన్ని ప్రచురించింది.
రాష్ట్ర ప్రజల్లో, ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తి అగ్నిని చల్లార్చేలా... తగిన ప్రతిపాదనలతో ప్రధాని వస్తారా? పర్యటన సందర్భంగా వాటి గురించి ప్రకటిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఉండగా ఢిల్లీ నుంచి అందిన సమాచారాన్ని అధికారులు తెలియచేశారు.
ఒకవేళ ప్రధానమంత్రి వస్తే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యే (మార్చి 5)లోపు ముందు వస్తారా? తర్వాత వస్తారా? అన్నది తేలాల్సి ఉంది. అయితే... 5వ తేదీలోపే ప్రధాని వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని పర్యటన ప్రతిపాదనపై రాష్ట్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని... 'మట్టి-నీళ్లు' ఇచ్చి వెళ్లిపోయిన సంగతి గుర్తు చేసుకుంటోంది. ''అప్పుడు ప్రధాని నవ్యాంధ్రకు వరాలు ప్రకటిస్తారని అంతా ఆశించారు. ఆశగా ఎదురు చూశారు. కానీ... ఆయన మొండిచేయి చూపించారు.
అప్పుడే దీనిపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇప్పుడు... ప్రజల్లో మరోసారి ఆగ్రహం రగులుతున్న సమయంలో రాష్ట్రానికి వస్తామంటున్నారు. ఆయన అలా వచ్చి ఇలా వెళ్లిపోతే ఫలితం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రంతో కలిసి ఇదంతా చేసిందనే సంకేతాలు వెళతాయి అని ప్రభుత్వం భావిస్తోందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
బీర్ల అమ్మకాలకు అంతర్జాతీయ కంపెనీల పోటీ
తెలంగాణలో మద్యం వ్యాపారం లాభసాటిగా మారటంతో రాష్ట్రీయ మద్యం మార్కెట్‌లోకి ప్రవేశించటానికి వివిధ దేశాల బీర్ల కంపెనీలు ఎగబడుతున్నాయని 'సాక్షి' తెలిపింది.
ఇక్కడ అంచనాలకు మించి బీర్ల వినియోగం ఉండటం, ఈ ఏడాది బీర్ల బేసిక్ ధర పెంచటానికి ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో సొమ్ము చేసుకోవటానికి పలు అంతర్జాతీయ కంపెనీలు రంగంలోకి దిగాయి.
మొత్తం 26 కార్పొరేటు కంపెనీలు 186 దేశీయ, విదేశీ బ్రాండ్లను సరఫరా చేసేందుకు టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ట్యూబర్గ్, క్యాల్సిబర్గ్, ఫోస్టర్, బడ్వైజర్, హన్‌కెన్ బ్రాండ్లు ఇప్పటికే రాష్ట్రీయ మార్కెట్‌లో వినియోగంలో ఉండగా.. స్కోల్, విక్టోరియా, ఆంగోర్, హినానో, గోల్డ్ స్టార్, పెరోని, రెడ్ స్ట్రైప్, టస్కర్ తదితర బ్రాండ్లు కొత్తగా రాబోతున్న జాబితాలో ఉన్నాయి.
రాష్ట్రీయ మద్యం మార్కెట్లో బీర్లను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 186 రకాల బ్రాండ్లను సరఫరా చేయడానికి కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. వీటిలో 66 బ్రాండ్లు ఇప్పటికే వినియోగంలో ఉండగా.. కొత్తగా మరో 120 బ్రాండ్లకు టెండర్లు దాఖలయ్యాయి.
సాధారణంగా ఏడాది కాలానికి బీర్లు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. గతేడాది చేసుకున్న ఒప్పందం మార్చి 31తో ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రావాల్సి ఉంది.
బీర్ల వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. సగటున నెలకు 37.5 లక్షల కేసుల బీర్లు తాగుతున్నారు. టీఎస్‌బీసీఎల్ నివేదికల ప్రకారం రాష్ట్రంలో రోజుకు 8 లక్షల మంది 13 లక్షల సీసాల బీర్లు తాగుతున్నారని సాక్షి తెలిపింది.

ఫొటో సోర్స్, Telangana CMO
కేంద్ర బడ్జెట్‌తో తెలంగాణకు నిరాశే
కేంద్ర బడ్జెట్ తమను తీవ్రంగా నిరాశపరిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసిందని 'ఈనాడు' పేర్కొంది.
పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా కేంద్రం నుంచి సరైన చేయూత రాకపోవడం బాధాకరమని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి దిల్లీ నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.
దాదాపు గంటపాటు భేటీ అయి దిల్లీ పర్యటన, ఇతర అంశాలపై చర్చించారు. కేసీఆర్ కేంద్ర బడ్జెట్ గురించి ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్కటీ సానుకూలత లేదని పేర్కొన్నట్లు తెలిసింది. ''పన్నుల్లో వాటా మినహాయిస్తే అదనంగా ఒక్క రూపాయి కూడా కేంద్రం కేటాయించలేదు. విభజన హామీలపైనా దృష్టి సారించలేదు. భారీ ఎత్తున నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టాం. ఇంటింటికీ నీరందించేందుకు మిషన్ భగీరథను తెస్తున్నాం. మిషన్ కాకతీయ సహా ఎన్నో నిర్మాణాత్మక ప్రాజెక్టులున్నాయి. వీటిని పూర్తిగా తెలంగాణ వనరులనే వినియోగిస్తున్నాం.
బ్యాంకుల నుంచి రుణాలు తెస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి చెందితే దేశానికే మేలు అని కేంద్రం గుర్తించాలి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు తదితర సందర్భాల్లో కేంద్ర నిర్ణయాలకు తెలంగాణ మద్దతు తెలిపింది. అదే రీతిలో తెలంగాణకు కేంద్రం సాయం అందించాల్సి ఉన్నా అది జరగడం లేదు' అని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసిందని ఈనాడు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








