దిల్లీలో ఎనిమిది నెలల పాపపై అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images
దేశ రాజధాని దిల్లీలో ఎనిమిది నెలల వయసున్న పసి పాపపై ఆ బాలిక కజిన్ దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు.
తీవ్రగాయాలైన పసిపాపను ఆదివారం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
నిందితుడైన 28 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. అతడు రోజు కూలీ కార్మికుడని పేర్కొన్నారు.
దిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలీవాల్ సోమవారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి ఆ పసిపాపను చూశారు. పాపకు అయిన గాయాలు "ఘోరమైనవి" అని ఆమె అభివర్ణించారు.
ఆదివారం జరిగిన ఈ దారుణ ఘటనపై సోమవారం స్థానిక మీడియాలో కథనాలు రావటంతో వెలుగుచూసింది.
ఆ పసిపాపకు మూడు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చిందని స్వాతి మలీవాల్ ట్వీట్ చేశారు.
"గుండెను మెలిపెట్టే పాప ఏడుపు ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వినిపిస్తోంది. ఆమె అంతర్గత అవయవాలకు దారుణ గాయాలయ్యాయి" అని మలీవాల్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఏం చేయాలి? దేశ రాజధానిలో ఒక ఎనిమిది నెలల పాప మీద క్రూరంగా అత్యాచారం జరిగినపుడు దిల్లీకి ఎలా నిద్రపడుతుంది? మనం ఇంతగా మొద్దుబారిపోయామా? లేకపోతే ఇది మన ఖర్మ అని అంగీకరించామా?" అని ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఆమె మరో ట్వీట్ చేశారు.
దేశంలో బాలికలను రక్షించటానికి "మరింత కఠినమైన చట్టాలు, మరిన్ని పోలీసు వనరులు అవసరం" అని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నేరుగా విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు.
దేశ రాజధాని దిల్లీలో 2012లో 23 ఏళ్ల విద్యార్థినిపై బస్సులో సామూహిక అత్యాచారం, హత్య జరిగిన దారుణం తర్వాత భారత్‌లో లైంగిక హింసపై నిశిత పరిశీలన పెరిగింది.
ఆ దురాగతంతో దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఆ ఆందోళనల తీవ్రత నేపథ్యంలో.. అత్యాచారాలకు మరణశిక్ష విధించటం వంటి కఠినమైన చట్టాలను ప్రభుత్వం చేసింది.
అయినా కానీ మహిళలు, చిన్నారులపై దేశ వ్యాప్తంగా దారుణ లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

చిన్నారులపై లైంగిక హింస పెరుగుతోంది: గీతా పాండే, బీబీసీ న్యూస్, దిల్లీ
పసిపాపపై దారుణ లైంగిక దాడి భారత ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమెకు అయిన గాయాల తీవ్రత చాలా మందిని భయభ్రాంతులకు లోనుచేశాయి. మనం మరింతగా దిగజారిపోయామా అనే భావన పలువురికి కలుగుతోంది.
కానీ ప్రభుత్వ లెక్కలను చూస్తే.. ఇలాంటి నేరాలు అరుదు కాదని చెప్తున్నాయి.
ఇంకా ఆందోళన కలిగించేదేమిటంటే.. ఈ నేరాల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సమాచారం ప్రకారం.. భారతదేశంలో 2016లో చిన్నారులపై అత్యాచారం కేసులు 19,765 నమోదయ్యాయి. అంటే 2015లో నమోదైన 10,854 కేసుల కన్నా 82 శాతం పెరిగాయి.
రెండేళ్ల కిందట 11 నెలల వయసున్న ఓ బాలిక తన తల్లి పక్కన నిద్రిస్తుండగా పొరుగింటి వ్యక్తి అపహరించి రెండు గంటల పాటు కిరాతకంగా అత్యాచారం చేశాడు.
2015 నవంబర్‌లో హైదరాబాద్‌లో మూడు నెలల వయసున్న ఓ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన దారుణం చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








