పార్లమెంటును రద్దు చేయనున్న షింజో అబే

ఫొటో సోర్స్, Reuters
జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చారు. వచ్చే గురువారం పార్లమెంటును రద్దు చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు.
అయితే, మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ప్రకటించలేదు. మరోవైపు అక్టోబర్ 22వ తేదీన ఎన్నికలు జరగొచ్చని జపనీస్ మీడియా తెలిపింది.
గత కొన్ని నెలలుగా షింజో అబే తన అనుచరులకు పదవులు కట్టబెట్టడం, ఉత్తర కొరియాతో పెరిగిన ఉద్రిక్తతల మధ్య తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో జాతీయ స్ధాయిలో ఆయన ప్రభుత్వ ప్రతిష్ఠ దిగజారింది.
జపాన్‌లో విద్య, సామాజిక పథకాలపై 17.8 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
తాజా ఎన్నికలు జపాన్ భవిషత్తు నిర్మాణం కోసమేనని మంగళవారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో షింజో అబే ప్రకటించారు. తమ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలను కొనసాగిస్తానని, తాజాగా ప్రారంభించిన సేల్స్ టాక్స్‌తో సుస్ధిర ఆర్ధికాభివృద్ధి సాధించి, అప్పులను తగ్గిస్తానని ఆయన తెలిపారు.
ఎందుకీ మధ్యంతర ఎన్నికలు ?
ఈ మధ్యంతర ఎన్నికలతో రాజకీయంగా తిరిగి పుంజుకోవాలని, ప్రస్తుతమున్న ప్రతిపక్షాల బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని షింజో అబే ఈ నిర్ణయం తీసుకున్నారన్నది విశ్లేషకుల అంచనా.
ఈ ఏడాది జులైలో ఆయన ప్రభుత్వ రేటింగ్ 30 శాతానికి దిగజారింది. కానీ ఆయన త్వరగానే పుంజుకొని సెప్టెంబర్ నాటికి తన బలాన్ని 50 శాతానికి పెంచుకున్నారు.
అనుచరులకు పదవులు కట్టబెట్టారనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. రాజకీయ కారణాలతో పార్లమెంటును రద్దుచేయట్లేదని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
రాజకీయంగా ఎన్నోసవాళ్లు
అయితే, ఉత్తర కొరియా విషయంలో కఠిన వైఖరి తీసుకోవడంతో అబేకు మద్దతు పెరిగింది. లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ నాయకుడైన షింజో అబే జపాన్‌లో సామాజిక పథాకాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టనున్నారు.
మరోవైపు జపాన్‌లో ప్రధాన ప్రతిపక్షమైన డెమొక్రాటిక్ పార్టీ అంతర్గత కుమ్ములాటతో సతమతమవుతోంది. దీంతో ఆ పార్టీ రేటింగ్ పదిలోపే ఉంది.
షింజో అబే పార్టీకి చెందిన మాజీ కేబినెట్ సభ్యుడు, ప్రస్తుత టోక్యో గవర్నర్ యురికో కోయికే కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడం షింజో అబేకు సవాలుగా మారింది.
స్ధానిక మీడియా చెబుతున్నట్లుగా ఒకవేళ వచ్చేనెలలోనే ఎన్నికలు జరిగితే.. షింజో అబే ప్రధాన మంత్రి కావచ్చునని, కానీ కొమీటో పార్టీతో కూడిన అధికార కూటమి మూడింట రెండొంతల మెజారిటీ సాధించకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
షింజో అబే మరోసారి ప్రధాన మంత్రి పదవి చేబడితే జపాన్ యుద్ధానంతర చరిత్రలో అత్యంత ఎక్కువ కాలంపాటు దేశాన్ని పరిపాలించిన నాయకుడిగా నిలిచిపోనున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)








