అమన్ సహ్రావత్: పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో కాంస్యం

పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన అమన్ సహ్రావత్ కాంస్య పతకం సాధించారు.

సెమీ‌ఫైనల్‌ మ్యాచ్‌లో ఓడిపోవడంతో కాంస్యం కోసం అమన్ శుక్రవారం (9వ తేదీన) ప్యూర్టోరికోకు చెందిన డారియన్ క్రజ్‌తో పోటీ పడ్డారు.

ఈ మ్యాచ్‌లో 13-5 తేడాతో విజయం సాధించి, ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు కుస్తీలో తొలి పతకం అందించారు.

అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అల్బేనియాకు చెందిన జెలిమ్‌ఖాన్ అబకరోవ్‌పై అమన్ విజయం సాధించారు. ఆ మ్యాచ్‌లో మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన అమన్ 12-0 తేడాతో జెలిమ్‌ను ఓడించి సెమీస్‌ చేరారు.

కానీ సెమీ ఫైనల్‌లో జపాన్ రెజ్లర్ హిగూచీ చేతిలో 0-10 తేడాతో ఓటమి పాలయ్యారు.

అనంతరం కాంస్యం కోసం మరో సెమీఫైనల్లో ఓడిన డారియన్ క్రజ్‌తో అమన్ పోటీ పడి గెలిచారు.

క్వార్టర్స్‌కు చేరుకోవడానికి అమన్ వ్లాదిమిర్ ఎగోరఫ్‌పై గెలిచారు. ఆ మ్యాచ్‌లోనూ అమన్ 10-0 తేడాతో భారీ విజయం సాధించారు.

ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం

అమన్ 2018లో జూనియర్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచారు.

అనంతరం 2021లో నేషనల్ చాంపియన్‌షిప్ గెలిచారు.

2022లో అండర్ 23 ప్రపంచ టైటిల్స్‌లో కాంస్య పతకం సాధించారు.

2023లో అమన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడంతో మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)