భారత్‌తో ఫైనల్ మ్యాచ్‌లో తలపడడంపై పాకిస్తాన్ ఆటగాళ్లు ఏమన్నారు?

"ఫైనల్‌లో భారత్‌తో సహా ఏ జట్టునైనా ఓడించే సత్తా పాకిస్తాన్‌కు ఉంది."

బంగ్లాదేశ్‌పై ఉత్కంఠభరిత విజయానంతరం పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అన్న మాటలివి.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తర్వాత సల్మాన్ అలీ రిపోర్టర్లతో మాట్లాడుతూ, '' ఇలాంటి మ్యాచ్‌లను గెలిస్తే, కచ్చితంగా ప్రత్యేక జట్టుగా నిలుస్తాం. ప్రతి ఒక్కరూ బాగా ఆడారు. బ్యాటింగ్‌లో కొంత మెరుగుపడాల్సి ఉంది. మేం దానిపై వర్క్ చేస్తున్నాం'' అని చెప్పాడు.

ఆసియా కప్ 41 ఏళ్ల చరిత్రలో.. భారత్, పాకిస్తాన్‌ జట్లు తొలిసారి ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆదివారం దుబయ్‌లో జరగనుంది.

ఈసారి ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఒకటి గ్రూప్ మ్యాచ్ కాగా, మరోటి సూపర్ 4 మ్యాచ్.

ఈ రెండు మ్యాచ్‌లలో భారత్‌దే పైచేయి.

భారత్‌తో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌పై మాట్లాడిన సల్మాన్ అలీ అఘా, '' మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఏం చేయాలో మాకు తెలుసు. మా జట్టు చాలా బలంగా ఉంది. మేం ఎవరినైనా ఓడించగలం. వారిని ఓడించేందుకు మేం ఆదివారం మైదానంలోకి దిగబోతున్నాం'' అని అన్నాడు.

'మేం రెడీ'

ఆల్-రౌండ్ పెర్ఫార్మెన్స్‌కు గానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పొందిన షాహీన్ షా అఫ్రిదిని ప్రత్యేకంగా ప్రస్తావించాడు పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ.

''షాహీన్ ప్రత్యేక ఆటగాడు. జట్టుకు కావాల్సింది చేస్తాడు. అతని విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నా. మేం 15 పరుగులు వెనకబడ్డాం. దీంతో ప్రారంభంలోనే మా బౌలింగ్‌తో ఒత్తిడిని పెంచాం. కొత్త బంతితో బాగా బౌలింగ్ చేశాం. ఇలా బౌలింగ్ చేస్తే, కచ్చితంగా మీరు మ్యాచ్ గెలుస్తారు'' అని అఘా అన్నాడు.

''ఫీల్డింగ్ కూడా బాగా చేశాం. దీనికోసం మేం కాస్త అదనంగా సాధన చేయాల్సి ఉంది. ఫీల్డింగ్ చేయలేకపోతే, జట్టులో మీకు స్థానం ఉండదని మైక్ హెసన్ చెప్పారు'' అని అఘా తెలిపాడు.

షాహీన్ అఫ్రిది తొలుత 13 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఆ తర్వాత, 17 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.

''తొలి వికెట్లు పడిన తర్వాత, టీమ్ నన్ను పంపాలని నిర్ణయించుకుంది. ఆ సిక్సులు మాకు అనుకూలంగా మారాయి'' అన్నాడు షాహీన్ అఫ్రిది.

భారత్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌ గురించి మాట్లాడిన అతను, ''వియ్ ఆర్ రెడీ(మేం సిద్ధం)'' అన్నాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ కోచ్ మైక్ హెసన్ భారత్‌పై అనుసరించబోయే వ్యూహం గురించి మాట్లాడారు.

భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై మానసిక ఒత్తిడి ఉంటుందా? అన్న ప్రశ్నకు "అస్సలు లేదు" అన్నారు మైక్ హెసన్.

'' భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌తో పోలిస్తే రెండో మ్యాచ్‌లో మేం బాగా ఆడాం. తొలి ఆటలో మేమంత చురుగ్గా లేం. భారత జట్టు మ్యాచ్‌పై పట్టుసాధించింది. కానీ, చివరి మ్యాచ్‌‌లో చాలాసేపటి వరకు మాదే పైచేయిగా ఉంది. అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ మ్యాచ్‌ను మానుంచి లాగేసుకుంది. ఈ ఇన్నింగ్స్‌ను పక్కనపెడితే, మేం బాగా ఆడాం'' అని మైక్ హెసన్ అన్నారు.

''భారత్‌పై ఎక్కువసేపు ఒత్తిడి కొనసాగించేలా మేం ఒక మార్గాన్ని కనుక్కోవాలి. చివరి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు 10 ఓవర్ల వరకు మేం అలానే చేశాం'' అని చెప్పారు.

''ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లన్నీ కూడా ట్రోఫీని గెలిచేందుకే ఆడాం. ఫైనల్స్, చాలా ముఖ్యమైన మ్యాచ్. బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాం'' అన్నారు.

ఇటీవలి మ్యాచ్‌లలో భారత్ - పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఘర్షణల గురించి మాట్లాడిన మైక్ హెసన్, ''క్రికెట్‌పై దృష్టిపెట్టాలన్నదే నా మెసేజ్. మేం అదే చేస్తాం కూడా. జరిగిందేంటో నాకంటే మీకే ఎక్కువ తెలుసు. నేను కేవలం క్రికెట్‌నే డీల్ చేస్తున్నా" అని మైక్ హెసన్ పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ షా అఫ్రిది కీలక పాత్ర పోషించాడు.

ఫామ్‌లోకి అఫ్రిది

'' ఇది చాలా సంతోషకరమైన విషయం. పాకిస్తాన్‌కు షార్ప్ బౌలింగ్‌తో దాడి చేసేవాళ్లు అవసరమైనప్పుడు షాహీన్ అఫ్రిది ఉత్తమమైన ఫామ్‌లోకి వచ్చాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే.. కెరీర్ ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు అఫ్రిది మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు'' అని క్రికెట్ అనలిస్ట్ సమీ చౌదరి బీబీసీతో అన్నారు.

'' షాహీన్ అఫ్రిదికి ప్రస్తుతం చాలా ఆయుధాలు అందుబాటులో ఉన్నాయి. అంతకుముందు అతను కేవలం ఒక రకమైన స్వింగ్‌, వేగంపైనే ఆధారపడేవాడు. కానీ, ఇప్పుడు మంచి వేగంతో వివిధ రకాల స్వింగ్‌లను ప్రయత్నిస్తున్నాడు'' అని సమీ రాశారు.

ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టీమ్‌వర్క్ అద్భుతమైన విజయాన్ని అందించడమే కాకుండా .. జట్టులో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచిందన్నారు సమీ.

ఇలాంటి సవాళ్లను అధిగమించి.. గెలుపొందడం నేర్చుకుంటే చాంపియన్లు అవుతామని వాళ్లు భావిస్తున్నట్లు చెప్పారు.

భారత జట్టు ఆటతీరు

ఈ ఆసియా కప్‌లో భారత జట్టు చాంపియన్లలా ఆడింది. మూడు గ్రూప్ మ్యాచుల్లోనూ గెలుపొందింది. తన సూపర్ 4 మ్యాచ్‌లలో రెండింటిని అలవోకగా గెలుచుకుంది.

భారత జట్టు మంచి ఫామ్‌లో కనిపిస్తోంది.

కొన్ని మ్యాచ్‌లలో బౌలింగ్‌లో తడబడినా, బ్యాటర్లు అద్భుతంగా రాణించారు.

భారత జట్టు గురించి మాట్లాడుకుంటే.. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ దాదాపు ప్రతి మ్యాచ్‌కూ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు.

అభిషేక్ శర్మ దూకుడుగా చేసిన ఇన్నింగ్స్ ఈసారి ఆసియా కప్‌లో చర్చనీయాంశంగా మారాయి.

ఈ టోర్నమెంట్‌లో, ముఖ్యంగా భారత స్పిన్నర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు.

కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లు భారత విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత జట్టు మిడిల్ ఆర్డర్ తడబడింది. ఇది జట్టుకు ఆందోళనకరంగా మారింది.

అయితే, సరైన సమయంలో హార్దిక్ పాండ్యా రంగంలోకి దిగడంతో, భారత్ ఆ మ్యాచ్‌‌లో గెలుపొందింది.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంతగా ఫామ్‌‌లో లేకపోవడం ఆందోళన కలిగించే అంశమే. పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 47 పరుగులు మాత్రమే చేశాడు. అంతకుమించి పరుగులు చేయలేకపోయాడు.

భారత్ - పాక్ వైరం

ఐదు లేదా అంతకంటే ఎక్కువ జట్లు పాల్గొన్న టోర్నీల గురించి మాట్లాడుకుంటే, భారత్-పాకిస్తాన్‌లు ఫైనల్‌లో ఐదుసార్లు తలపడ్డాయి.

వీటిల్లో భారత్ రెండు మ్యాచ్‌లలో, పాకిస్తాన్ మూడు మ్యాచ్‌లలో గెలుపొందాయి.

అయితే, ఇటీవల కాలాల్లో మాత్రం.. వన్డే అయినా, టీ-20 అయినా.. రెండు ఫార్మాట్లలోనూ భారత జట్టు మంచి ఆటతీరు ప్రదర్శిస్తోంది.

వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భారత జట్టు ఫైనల్‌కు వెళ్లింది. అలాగే, టీ20 వరల్డ్ కప్ 2024ను గెలుచుకుంది.

ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను కూడా భారత్ గెలుచుకుంది.

ఆసియా కప్‌లో సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, '' భారత్, పాకిస్తాన్ మధ్య ఎలాంటి పోటీ లేదు. ప్రస్తుతం దీనిపై ప్రశ్నలు వేయడం ఆపేయాలి'' అని అన్నారు.

''భారత్, పాకిస్తాన్ మధ్య పోటీ అంటూ మీరు (రిపోర్టరులు) ప్రశ్నించడం మానేయాలి. ఎందుకంటే, నా అభిప్రాయం ప్రకారం.. రెండు జట్లు 15 నుంచి 20 మ్యాచ్‌లు ఆడి.. అందులో ఒక్కో జట్టు 7-8 మ్యాచ్‌లలో గెలిస్తే అది పోటీగా ఆడుతున్నట్లు చెబుతాం. కానీ, 13-0(13 ఆడి అన్నీ ఓడిపోవడం) లేదా 10-1(11 మ్యాచ్‌లలో ఒక జట్టు పది గెలిస్తే ఇంకోటి ఒకటే గెలవడం) అయితే ఆ జట్టు పోటీ ఇస్తున్నట్లు కాదు'' అని సూర్యకుమార్ అన్నాడు.

పాకిస్తాన్ జట్టు ఇకపై భారత్‌తో పోటీపడలేదని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రం అంగీకరించాడు.

సౌరవ్ గంగూలీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

‘‘భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లను ఇటీవల చాలా పెద్దగా చేసి చూపిస్తున్నారు. కానీ, గత నాలుగైదేళ్లుగా అంతలా ఏమీ జరగడం లేదు. వన్‌సైడెడ్‌గా ఉంటోంది'' అని ఆయన ఇటీవల అన్నారు.

కానీ, ఫైనల్‌కు ముందు పాకిస్తాన్ జట్టు దూసుకొచ్చిన తీరు చూస్తే, ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)