You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆసియా కప్ ఫైనల్: భారత్, పాకిస్తాన్ మధ్య జరగబోతోందా, సమీకరణాలేంటి?
- రచయిత, అభిజీత్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ కోసం
బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించిన తర్వాత, ఒకప్పుడు తనకు సునీల్ గవాస్కర్ ఇచ్చిన సలహాను వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తావించారు. 70 లేదా 80 స్కోరు సాధిస్తే 100 పరుగులు మిస్ చేయవద్దని గవాస్కర్ సూచించారని చెప్పారు సెహ్వాగ్.
ఆసియా కప్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ 70కి పైగా పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది భారత్.
మ్యాచ్ తర్వాత, అభిషేక్ శర్మ సోదరి కోమల్ మాట్లాడుతూ, "సెంచరీ మిస్ కావడం బాధాకరం. కానీ, ఇది ఆటలో ఒక భాగం. ఈ టోర్నీలో అభిషేక్ కచ్చితంగా సెంచరీ సాధిస్తాడు" అని అన్నారు.
అభిషేక్ తల్లి మంజు శర్మ కూడా మరోసారి అభిషేక్ సెంచరీ మిస్ అయినందుకు బాధగా ఉన్నట్లు చెప్పారు.
మ్యాచ్ తర్వాత, "అభిషేక్ మళ్లీ బాగా ఆడాడు కానీ, సెంచరీ మిస్ అయ్యాడు. పర్వాలేదు, చాలా మ్యాచ్‌లు ఉన్నాయి" అని అన్నారు మంజు శర్మ.
ఆరుగురు హీరోలు
బంగ్లాదేశ్‌పై భారత విజయానికి అభిషేక్ శర్మ(75 పరుగులు), శుభ్‌మన్ గిల్ (29 పరుగులు), హార్దిక్ పాండ్యా (38 పరుగులు), కుల్దీప్ యాదవ్ (మూడు వికెట్లు), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా (తొలి రెండు వికెట్లు)లు దోహదపడ్డారు.
బంగ్లాదేశ్ తరఫున సైఫ్ హసన్ అత్యధికంగా 69 పరుగులు చేయగా, పర్వేజ్ హుస్సేన్ 21 పరుగులు చేశారు.
మరే ఇతర బ్యాటర్ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 127 పరుగులకే ఆలౌట్ అయింది.
అభిషేక్ రికార్డులు
పాకిస్తాన్‌పై రాణించిన అభిషేక్ శర్మ, బంగ్లాదేశ్ మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్నాడు. కేవలం 37 బంతుల్లో 75 పరుగులు చేసిన అభిషేక్, వరుసగా రెండోసారి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
అంతేకాదు, ఈ సందర్భంగా అభిషేక్ పలు రికార్డులూ నెలకొల్పాడు.
2024 జులై నుంచి తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌ను ప్రారంభించిన అభిషేక్, ఈ సంవత్సరం టీ20లలో 500 పరుగులు పూర్తి చేసిన ఏకైక భారత బ్యాటర్.
ఇక, ఆ రోజు నుంచి ఇప్పటివరకు అభిషేక్ టీ20లలో 58 సిక్సర్లు కొట్టాడు. ఈ సమయంలో ఐసీసీ పూర్తి సభ్య దేశాల బ్యాటర్లలో అత్యధిక సిక్సర్లు (58) కొట్టిన ప్లేయర్ కూడా ఈ భారత్ ఓపెనరే.
భారత్‌కే చెందిన సంజూ శాంసన్ 37 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా టీ20లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్లలో అభిషేక్ ఏడో స్థానంలో ఉన్నాడు.
'ప్రమాదరకరమైన ఓపెనర్'
గ్రూప్ దశలో యుఏఈతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 187.50 స్ట్రైక్ రేట్‌తో 16 బంతుల్లోనే 30 పరుగులు చేసి, తన ఆటను మొదలుపెట్టాడు.
ఒక మ్యాచ్ నుంచి మరొక మ్యాచ్‌కు అతని స్కోర్లు పెరుగుతూనే ఉన్నాయి. గ్రూప్ దశలో, పాకిస్తాన్‌పై 13 బంతుల్లో 31 పరుగులు, ఒమన్‌పై 15 బంతుల్లో 38 పరుగులు చేశాడు.
ఇక, సూపర్-4లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో 74 పరుగులు చేశాడు. బుధవారం బంగ్లాదేశ్‌పై కేవలం 37 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు.
ఈ టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు(248) చేసింది అభిషేక్ శర్మనే.
అభిషేక్ ఇప్పటివరకు 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం అతని స్ట్రైక్ రేట్ 197.72గా ఉంది. ఈ టోర్నీలో అభిషేక్ బ్యాటింగ్ తీరును, క్రిస్ గేల్, ట్రావిస్ హెడ్, బ్రెండన్ మెకల్లమ్, అతని గురువు యువరాజ్ సింగ్‌లతో పోల్చుతున్నారు.
"ప్రస్తుతం అంతర్జాతీయ టీ20లో అభిషేక్ శర్మ అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్" అని ఇర్ఫాన్ పఠాన్ ఒక ట్వీట్ కూడా చేశాడు.
ఫైనల్ పోరు ఎవరితో?
సూపర్ 4లో గురువారం సాయంత్రం జరిగే పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ మ్యాచ్ ఇప్పుడు సెమీఫైనల్‌లా మారింది.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో భారత్‌తో ఆడనుంది.
అయితే, సూపర్4 లో శ్రీలంకపై గెలిచి, భారత్‌పై ఓడిన బంగ్లాదేశ్ జట్టు, పాకిస్తాన్‌పై ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది.
ఈ టోర్నీలో ఇప్పటివరకు పాకిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవలేకపోయింది. కానీ, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించింది. దీంతో, బంగ్లాదేశ్ జట్టుకు గెలుపు సులువు కాదు. ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే ఈ టోర్నీలో ఆ జట్టు మూడోసారి భారత జట్టుతో తలపడినట్లవుతుంది.
మరోవైపు, సూపర్ 4లో శుక్రవారం శ్రీలంకతో భారత్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ, దాని ఫలితంతో ఫైనల్‌కు చేరాల్సిన జట్టులో ఎటువంటి తేడా ఉండదు. ఎందుకంటే శ్రీలంక జట్టు ఇప్పటికే టైటిల్ పోరు నుంచి నిష్క్రమించింది. భారత్ ఫైనల్ చేరింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)