ఎనిమీ ప్రాపర్టీస్: తెలంగాణలో ప్రజలు వదిలేసి వెళ్లిపోయిన వేల కోట్ల విలువైన ఈ భూములు ఎవరికి చెందుతాయి?

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''తెలంగాణలో రూ.10 వేల కోట్లకు పైగా విలువైన ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటిపై అధికారులతో సమీక్షించాం. మార్చి 15లోగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి వివరాలు ఇవ్వాలని చెప్పాం'' అంటూ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు.

దీంతో ఇప్పుడు ఈ ఎనిమీ ప్రాపర్టీ లెక్కలు తేల్చే పనిలో ఉన్నారు అధికారులు.

ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎనిమీ ప్రాపర్టీలున్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో చాలావరకు అన్యాక్రాంతమైనట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వాటిని తిరిగి తీసుకోవడం అధికారులకు సవాలుగా మారనుందనే చెప్పాలి.

''అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం, చాలా ప్రాంతాల్లో ఇవి ఆక్రమణకు గురైనట్లుగా తెలుస్తోంది. వాటిని ఏ విధంగా తిరిగి స్వాధీనం చేసుకోవాలనే విషయాన్ని ఆలోచిస్తాం. అవసరమైతే తిరిగి ప్రజలకే అందించేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది'' అని చెప్పారు బండి సంజయ్.

హైదరాబాద్ చుట్టుపక్కలే ఎక్కువ

ఎనిమీ ప్రాపర్టీస్ తెలంగాణలో నాలుగు జిల్లాల్లో ఉన్నప్పటికీ హైదరాబాద్ చుట్టుపక్కలే ఎక్కువగా ఉన్నాయి.

హైదరాబాద్ జిల్లా బాకారంలో 5,578 గజాలు, బహదూర్ పురాలోని రికాబ్‌ గంజ్‌లో 3,300 గజాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 40 ఎకరాలు, వికారాబాద్ జిల్లా అలంపల్లిలో 17.22 ఎకరాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ, మియాపూర్ పరిధిలో ఎనిమీ ప్రాపర్టీలు రికార్డుల్లో ఉన్నట్లుగా చెబుతున్నప్పటికీ, ఏళ్ల తరబడిగా పట్టించుకోకపోవడంతో అన్యాక్రాంతమైనట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

''హైదరాబాద్ జిల్లా పరిధిలోని షేక్‌పేట మండలం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఓల్డ్ బోయిన్‌పల్లి, శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ, శేరిలింగంపల్లి మండలం మియాపూర్, గండిపేట, పుప్పాలగూడ ప్రాంతాల్లో ఎనిమీ ప్రాపర్టీలున్నాయి.

వాటిపై అజమాయిషీ లేకపోవడంతో ఆక్రమణలకు గురవుతూ వచ్చాయి. ఈ ప్రాంతాల్లో దాదాపు 1,500 ఎకరాల ఎనిమీ ప్రాపర్టీ భూముల లెక్క తేలాల్సి ఉంది'' అని రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ రెవెన్యూ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.

ప్రస్తుతం ఈ భూములు ఎన్ని ఉన్నాయనేది పూర్తి వివరాలు తీసే పనిలో ఉన్నారు అధికారులు.

ఏమిటీ ఎనిమీ ప్రాపర్టీ?

దేశంలో ఎనిమీ ప్రాపర్టీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ‘ది ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ – 1968’ను తీసుకువచ్చింది. 1968 జులై 10 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

ఎనిమీ ప్రాపర్టీస్ చట్టం ప్రకారం, ఆస్తులకు కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా (సెపీ) పర్యవేక్షణ ఉంటుంది. ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అనుంబంధంగా ఉంటుంది.

రాష్ట్రాల్లో జిల్లాస్థాయిలో కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యత ఉంటుంది.

1962లో భారత్, చైనా మధ్య 1965, 1971లో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాలు జరిగాయి.

ఈ యుద్ధాల తర్వాత కొందరు భారత్‌ను విడిచి చైనా, పాకిస్తాన్‌లకు వలస వెళ్లిపోయారు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో యుద్ధాల తర్వాత పెద్ద సంఖ్యలో ముస్లింలు తమకు సంబంధించిన భూములు, స్థిరాస్తులను వదిలి వలస వెళ్లిపోయారు.

''1968లో వచ్చిన చట్టం మేరకు అలా వలస వెళ్లిపోయిన వారి భూములు, ఇతర స్థిరాస్తులు స్వాధీనం చేసుకుంటున్నట్లుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది'' అని బీబీసీకి చెప్పారు తెలంగాణకు చెందిన మాజీ జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్.

ఈ ఆస్తుల ఆక్రమణలు, వివాదాలు రేగడంతో వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో ఈ భూములకు ట్రస్టీగా సెపీ, యజమానిగా వేరే దేశానికి వలస వెళ్లిపోయిన వ్యక్తి ఉంటారని 2005లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

అయితే, కేంద్ర ప్రభుత్వం 2016లో ఎనిమీ ప్రాపర్టీస్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీని ప్రకారం ఎనిమీ ప్రాపర్టీకి యజమానిగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది.

ఈ చట్ట సవరణ బిల్లును 2017 మార్చి 14న లోక్‌సభ ఆమోదించింది.

అలాగే, ఈ చట్టంలోని సెక్షన్ 8(ఏ) ప్రకారం ఈ ఆస్తులను అమ్ముకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.

నగరాల్లోని అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఎనిమీ ప్రాపర్టీస్ ఉండటం కారణంగా మార్కెట్ విలువ వేల కోట్లకు చేరుకుంది. దీంతో ప్రైవేటు వ్యక్తులు, కేంద్ర ప్రభుత్వం మధ్య వీటిపై కోర్టుల్లో వివాదాలు నడుస్తున్నాయి.

''రంగారెడ్డి జిల్లాలో చాలావరకు భూములు ఆక్రమణకు గురయ్యాయి. వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టంతో కూడుకున్నది'' అని చెప్పారు సురేష్ పొద్దార్.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎనిమీ ప్రాపర్టీ విషయంలో లెక్కలు తేల్చుతుండటంతో, మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సి ఉందన్నారు పొద్దార్.

మార్చి 15లోగా ఎనిమీ ప్రాపర్టీ లెక్కలు సమర్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిన క్రమంలో అధికారుల సర్వే కీలకం కానుంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో వందల కోట్ల విలువైన భూములకు సంబంధించి లెక్కలు తేలాల్సి ఉంది.

రూ.లక్ష కోట్ల ఎనిమీ ప్రాపర్టీస్

తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఎనిమీ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని రెవెన్యూ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీనిపై సర్వే జరుగుతున్నట్లు తెలిపారు.

''ఎనిమీ ప్రాపర్టీల విషయంలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ తక్కువగా ఉండేది. దీనివల్ల దశాబ్దాలుగా సరైన నిఘా లేకపోవడంతో ఆక్రమణకు గురయ్యాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ లెక్కలు తీసే పనిలో ఉంది'' అని ఆయన చెప్పారు.

2017నాటికి దేశవ్యాప్తంగా 9500 ఎనిమీ ప్రాపర్టీస్ ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించిందని పీఆర్ఎస్ ఇండియా తన కథనంలో పేర్కొంది.

ఇవి చాలావరకు పాకిస్తాన్‌కు వలస వెళ్లి, అక్కడ స్థిరపడిన వారివేనని ప్రభుత్వం చెబుతోంది. అప్పటికి ఈ ఆస్తుల విలువ రూ.1,04,339 కోట్లు ఉన్నట్లుగా పీఆర్ఎస్ ఇండియా కథనంలో ప్రస్తావించింది.

ఎనిమీ, ఎవాక్యూ ప్రాపర్టీల మధ్య తేడా ఏంటి?

ఎనిమీ ప్రాపర్టీలే కాదు, ఎవాక్యూ ప్రాపర్టీ పేరుతో కూడా భారత్‌లో ఆస్తులున్నాయి. ఇవి కూడా ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి.

ఎవాక్యూ ప్రాపర్టీని కాందిశీకుల భూమి అని కూడా పిలుస్తారు.

దేశ విభజన సమయంలో జరిగిన ఘర్షణల తర్వాత పెద్ద సంఖ్యలో ముస్లింలు వారి భూములు, స్థిరాస్తులను వదిలి పాకిస్తాన్‌కు వలస వెళ్లారు.

అలా వెళ్లిన వారి ఆస్తులను ఎవాక్యూ ప్రాపర్టీగా పిలుస్తారని సురేష్ పొద్దార్ చెప్పారు. ఎనిమీ, ఎవాక్యూ ప్రాపర్టీలు రెండూ వలస వెళ్లిపోయిన వారికి చెందిన భూములే అయినప్పటికీ, వారు వలస వెళ్లిన కాలం వేర్వేరు అని వివరించారు సురేష్ పొద్దార్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)