You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శివం భజే మూవీ రివ్యూ: అశ్విన్ బాబు థ్రిల్లర్ ప్రేక్షకులను మెప్పించిందా?
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
ప్రముఖ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, రాజు గారి గది సినిమాతో హిట్ కొట్టిన అశ్విన్ బాబు హీరోగా వచ్చిన తాజా సినిమా ‘శివం భజే.’
‘కాన్‌స్పిరసీ-డివోషన్-క్రైమ్ ’ ఎలిమెంట్స్‌తో థ్రిల్లర్ జోనర్‌లో గంగా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
కథ ఏంటి?
ఒక మాములు లోన్ రికవరీ ఏజెంట్‌గా ఉండే చందూకు ఏ పరిస్థితుల్లో జీనో ట్రాన్స్ ప్లాంటేషన్ (జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే ప్రక్రియ) జరిగింది?
శివుని కాలభైరవ రూపంగా భావించే కుక్క కళ్లను, చందుకు ట్రాన్స్ ప్లాంట్ చేస్తారు.
ఆ తరువాత చందు చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు భారతదేశం మీద చేసిన కుట్రలను ఎలా ఛేదించాడు?
మిస్టరీగా ఉన్న హత్యల వెనకున్న హంతకులను ఎలా పట్టుకున్నాడు?
అసలు ఆపరేషన్ లామా ఏంటి? అన్నదే ఈ సినిమా కథ.
స్క్రీన్ ప్లే ఎక్కడ దారి తప్పింది?
కుట్ర-భక్తి-నేరాలు...అనే మూడింటి కలయికగా వచ్చిన ఈ సినిమాలో ఈ మూడు ఎలిమెంట్స్‌ను ఎంగేజింగ్‌గా చెప్పలేకపోవడం వల్ల బోరింగ్‌గా అనిపిస్తుంది. జీనో ట్రాన్స్ ప్లాంటేషన్ 'హీరోయిక్ ఎలిమెంట్'గా సెకండాఫ్‌లో కథ మలుపు తిరుగుతుంది.
కానీ, ఆ మెడికల్ ఎలిమెంట్ లాజికల్‌గా కనెక్ట్ కాకపోవడంవల్ల కథలో బలం కనిపించలేదు.
అంతర్జాతీయ కుట్రకు ఉండే నేపథ్యం ఈ సినిమాలో పెద్దగా లేకపోవడం కూడా సినిమాకు మైనస్. నేపథ్యంలో జరిగే కథకు, హీరో దూరంగా ఉండటం వల్ల కథంతా కూడా అసహజంగానూ, సెకండ్ హాఫ్‌లో కాసేపు డాక్యుమెంటరీ శైలిలో నడుస్తుంది.
నిజానికి ఈ సినిమా అంథాలజీ అంటే ఒక కథలా కాకుండా కలగాపులగంగా అనేక కథల సమాహారంగా నడుస్తుంది తప్ప ఒక్క రూపంలో ఉన్న భావన కలగదు.
ఎవరెలా నటించారు?
సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్య కుట్రను ఛేదించే నాయకుడిగా మారి చందు పాత్రలో అశ్విన్ బాబు తనకున్న పరిమితిలో బాగానే నటించాడు. కానీ, హీరో ఎస్టాబ్లిషింగ్, ఇంట్రడక్షన్ సీన్స్ బలంగా లేవు.
అందుకే ఈ పాత్ర కథకు తగ్గ స్థాయిలో మ్యాచ్ కాలేకపోయింది. క్యారెక్టర్ డిజైన్‌లోనే లోపం ఉంది. ముఖ్య కథకు దూరంగా చందు పాత్ర ఉండటం వల్ల హీరో మ్యాజిక్ ఈ సినిమాలో పెద్దగా కనిపించదు.
ఆపిల్ రెడ్డి పాత్రలో హైపర్ ఆది ఎంటర్‌టైన్ చేయడంతో సినిమాలో కామెడీ మాత్రం కొంతమేరకు పండిందనే అనుకోవచ్చు. అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ పర్లేదనిపించారు. హీరోయిన్‌గా నటించిన దిగంగనా సూర్య వంశీ తన రోల్ వరకు బాగానే చేసింది.
ఈ సినిమాకు అతి పెద్ద వైఫల్యం క్యారెక్టర్లను సరిగ్గా డిజైన్ చేయకపోవడమే. టాపిక్ గురించి చేసిన రీసెర్చ్ తప్ప, దానిని ఏంగేజింగ్‌గా మార్చే స్క్రీన్ ప్లే కానీ, పాత్రలు కానీ లేకపోవడం వల్ల యాక్టర్ల నటనకు ఆస్కారం తగ్గిన భావన కలుగుతుంది.
అంతర్జాతీయ కుట్రను బలంగా పండించే సన్నివేశాలు, పాత్రలు అలా వచ్చిపోతూ ఉంటాయి. వాటికి డైలాగ్స్ ఉండవు. వాటి స్క్రీన్ స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలా ఒకటి రెండు ఫ్రేములలో పాత్రలు కనిపించి మాయమైపోవడం కథను గజిబిజీ చేసేసింది.
పాటలు -సంగీతం:
అశ్విన్ బాబు ఇంతకు ముందు తీసిన ‘హిడింబ’కు పని చేసిన వివేక్ బడిసానే ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు.
ఈ సినిమాకు థీమ్ సాంగ్‌గా వచ్చిన ‘రం రం ఈశ్వరం’ పాటను హేమచంద్ర పాడారు.
ఈ పాట కొంత సినిమా ‘టైటిల్’తో ,కథతో కనెక్ట్ అయ్యేలా ఉండటం, మ్యూజిక్ కూడా పర్లేదనిపించేలా ఉండటంతో ఈ పాట సినిమాకు ప్లస్ అనే చెప్పొచ్చు.
మిగిలిన పాటలు పర్లేదనిపించాయి. కథలో మాత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్ కు ఉండాల్సిన ప్రామిసింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం వివేక్ బడిసా స్కోప్ ఉన్న మేరకు ఇచ్చారు.
ప్లస్ పాయింట్స్
అశ్విన్ బాబు, హైపర్ ఆది కామెడీ స్క్రీన్ ప్లేని ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో కొంత సేపు ఉంచేలా చేయడం సినిమాకు ప్లస్ పాయింట్. ఇంటర్వెల్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉండటం కథకు ప్లస్ పాయింట్. 'ఠాగూర్ 'సినిమాలో హాస్పిటల్ సీన్ కామెడీ ట్రాక్‌ను బ్రహ్మాజీ పాత్ర ఇమిటేట్ చేయడం కొంతవరకు పర్లేదనిపించింది.
మైనస్ పాయింట్స్
కథలో హీరో ఇంట్రడక్షన్ బలంగా లేదు. ఫస్ట్ హాఫ్‌లో అసలు స్టోరీ గురించి ఏం చెప్పకపోవడంతో, మొత్తం లాగింగ్‌గా ఉండటం మైనస్ పాయింట్.
కథ జోనర్ ఎలిమెంట్స్ కూడా ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడా కనిపించకపోవడం కూడా సినిమాకు మైనస్ అయ్యింది. హీరో-హీరోయిన్ల లవ్ ట్రాక్ చాలా కృతకంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
హీరోని మాములు క్యారెక్టర్ నుంచి పవర్ఫుల్ గా మారే ట్రాన్సిషన్ అన్నది కామిక్‌గా ఉండటం సినిమాకు మైనస్ అయ్యింది.
కొత్త కథతో మెప్పించే ప్రయత్నం చేసినా మెడికల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ ఎఫర్ట్ మెప్పించలేకపోయింది.
ప్రేక్షకులు ఊహించే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా పెద్దగా లేకపోవడంతో 'శివం భజే' నిరాశ పరిచిందనే చెప్పొచ్చు. అలాగే సినిమాకు ప్రాణంగా ఉండే క్లైమాక్స్ సీన్ కూడా తేలిపోవడంతో టైటిల్‌కు తగ్గ పవర్ ఈ సినిమాలో కనిపించలేదనే అనిపిస్తుంది.
( ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)