కేంద్ర కేబినెట్, స్వతంత్ర, సహాయ మంత్రి హోదాల మధ్య తేడాలేంటి?

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది.

రాష్ట్రపతి భవన్‌లో దేశ, విదేశీ అతిథుల మధ్య జూన్ 9న జరిగిన కార్యక్రమంలో మంత్రివర్గ సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా కేబినెట్ మంత్రి, సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), సహాయ మంత్రులుగా పలువురు బాధ్యతలు స్వీకరించారు. (ఇందులో స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రిని మినిస్టర్ ఆఫ్ స్టేట్ - ఇండిపెండెంట్ చార్జ్‌గా, సహాయ మంత్రిని మినిస్టర్ ఆఫ్ స్టేట్‌గా పిలుస్తారు.)

అయితే, కేబినెట్ మంత్రికి, ఇండిపెండెంట్ చార్జ్ మంత్రికి, సహాయ మంత్రికి మధ్య తేడా ఏంటి?

మంత్రిమండలి

ప్రధాన మంత్రితో సహా మొత్తం 72 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో 30 మంది కేబినెట్ ర్యాంక్, ఐదుగురు స్వతంత్ర హోదా (ఇండిపెండెంట్ చార్జ్) కలిగిన సహాయ మంత్రులు, మరో 36 మంది సహాయమంత్రి హోదాను పొందారు.

జూన్ 10న వారికి శాఖల కేటాయింపు పూర్తయ్యింది.

భారత రాజ్యాంగం ప్రకారం మంత్రుల సంఖ్య మొత్తం లోక్ సభ సభ్యుల్లో 15 శాతానికి మించరాదు. గతంలో మంత్రివర్గ సంఖ్యపై కచ్చితమైన పరిమితులు లేవు. రాజ్యంగ సవరణ బిల్లు-2003 (91వ రాజ్యాంగ సవరణ)లో భాగంగా రాజ్యంగంలోని 75వ ఆర్టికల్‌కు సవరణ ద్వారా ఈ 15 శాతం నిబంధన చేర్చారు.

దీని ప్రకారం కేంద్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 81కి మించకూడదు. (మొత్తం లోక్ సభ సభ్యులు 543).

మంత్రులు - విధులు

కేంద్ర మంత్రిమండలి కేబినెట్ మంత్రి, సహాయ మంత్రి (ఇండిపెండెంట్ చార్జ్), సహాయ మంత్రుల కలయిక.

సాధారణంగా సీనియర్లు కేబినెట్ హోదాలో ఉంటారు. తమకు కేటాయించిన ఆయా మంత్రిత్వ శాఖలకు వీరు నేతృత్వం వహిస్తారు. కేబినెట్ మంత్రి ఆధ్వర్యంలోనే ఆ శాఖ పరిపాలనా వ్యవహారాలు కొనసాగుతాయి.

విధుల నిర్వహణలో వీరికి సహాయ మంత్రులు (మినిస్టర్ ఆఫ్ స్టేట్) సహకరిస్తుంటారు. పని విభజనలో భాగంగా, ఆ శాఖ పరిధిలోని కొన్ని ప్రధాన విభాగాల బాధ్యతలను కేబినెట్ మంత్రి వీరికి అప్పగించవచ్చు. సహాయ మంత్రులు (ఎంవోఎస్) తమ పనిని కేబినెట్ మంత్రికే నివేదిస్తారు.

స్వతంత్ర్య హోదా (ఇండిపెంటెంట్ చార్జ్) పొందిన సహాయ మంత్రులు తమ శాఖలను స్వతంత్రంగా నిర్వహిస్తారు. సాధారణంగా ఇలాంటి శాఖల పరిధి తక్కువగా ఉంటుంది. ఆ శాఖకు చెందిన పాలనా నిర్ణయాల్లో పూర్తి నిర్ణయాధికారం వీరికి ఉంటుంది. తమ శాఖ నివేదికలను వీరు నేరుగా ప్రధాన మంత్రికి నివేదిస్తారు.

కేబినెట్ ర్యాంక్ మంత్రులతో పోలిస్తే రెండు రకాల సహాయ మంత్రుల హోదా, పొందే సౌకర్యాలు, భత్యాలు తక్కువగా ఉంటాయి.

సహాయ మంత్రుల విధులు..

సహాయ మంత్రుల విధుల గురించి గతంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన తెలంగాణకు చెందిన సముద్రాల వేణుగోపాల చారి బీబీసీకి వివరించారు.

మాజీ ప్రధానులు దేవెగౌడ, ఐకే గుజ్రాల్, వాజ్‌పేయి మంత్రివర్గాల్లో ఆయన సహాయ మంత్రి హోదాలో పనిచేశారు.

''పెద్ద శాఖల్లో సహాయ మంత్రులు ఏ విధులు నిర్వర్తించాలన్నది ఆయా శాఖల కేబినెట్ మంత్రుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కేబినెట్ మంత్రి అనుకూలంగా ఉంటే సహాయ మంత్రికి పని విభజన చేస్తారు. అయితే, ముఖ్యమైన ఫైళ్లు నేరుగా కేబినెట్ మంత్రికే పంపుతారు. కొన్ని ఫైళ్లు ఆ శాఖ కార్యదర్శి ద్వారా సహాయ మంత్రికి వస్తాయి. అయినా, చివరకు ఫైల్ కేబినెట్ మంత్రి వద్దకు పోవాల్సిందే '' అని వేణుగోపాల చారి తెలిపారు.

''వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో ఆక్వా, ఫిషరీస్ విభాగాలు నాకు అప్పగించారు. సాధారణంగా సహాయ మంత్రులు పూర్తి స్థాయి మంత్రిమండలి సమావేశాలకు మినహా కేబినెట్ సమావేశాలకు హాజరుకారు. కేబినెట్ మీటింగ్ ఎజెండాలో స్వతంత్ర హోదా పొందిన సహాయ మంత్రుల శాఖలకు సంబంధించిన అంశాలు ఉంటే, వారు హాజరవుతారు. ప్రోటోకాల్ ప్రకారం సహాయ మంత్రులకు శాఖా సంబంధిత నిర్ణయాలు ఆయా శాఖల కార్యదర్శులు తెలియజేస్తారు.''

''పార్లమెంట్ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వం తరఫున కేబినెట్ మంత్రి, ఆ శాఖ సహాయ మంత్రి జవాబులు ఇస్తారు. ఈ సమయంలో లోక్ సభ, రాజ్యసభల్లో ఇద్దరి మధ్య విధుల కేటాయింపు ఉంటుంది. సాధారణంగా సహాయ మంత్రులుగా జూనియర్లు ఉంటారు. పని నేర్చుకోవడానికి ఇదో అవకాశం'' అని వేణుగోపాల చారి వివరించారు.

ప్రోటోకాల్, జీతభత్యాలు..

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రాధాన్యత క్రమం (ఆర్డర్ ఆఫ్ ప్రెసెడెన్స్)లో కేబినెట్ ర్యాంక్, కేంద్ర సహాయ మంత్రి వరుసగా ఏడు, పది స్థానాల్లో ఉన్నారు. (https://www.mha.gov.in/sites/default/files/table_of_precedence.pdf)

కేంద్ర మంత్రుల జీత భత్యాల చట్టం,1952’ కేంద్ర మంత్రులు పొందే సౌకర్యాలను వివరిస్తుంది.

ఈ చట్టం ప్రకారం, ఒక పార్లమెంట్ సభ్యుడు పొందే జీతం, పెన్షన్, భత్యాలు కేంద్ర మంత్రులకు(అన్ని ర్యాంకుల మంత్రులు) కూడా వర్తిస్తాయి.

ప్రస్తుతం మంత్రులకు నెలకు లక్ష రూపాయల జీతం, నియోజకవర్గ భత్యంగా 70 వేలు, కార్యాలయ నిర్వహణ ఖర్చుల కింద 60 వేలు లభిస్తాయి. ఎంపీలు, కేంద్ర మంత్రుల జీత భత్యాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సవరిస్తూ ఉంటుంది.

ఎంపీలతో పోల్చినప్పుడు కార్యాలయ ఆతిథ్య ఖర్చుల రూపంలో కేబినెట్ మంత్రికి రెండు వేలు, సహాయ మంత్రులకు వెయ్యి రూపాయల అదనపు అలవెన్స్ సౌకర్యం ఉంది.

పదవిలో ఉన్నంత కాలం నివాస బంగ్లా (సహాయ సిబ్బంది క్వార్టర్స్‌తో సహా), ప్రయాణం, టెలిఫోన్, విద్యుత్, వైద్యం, ఇతర సౌకర్యాలు ఉచితంగా పొందుతారు.

విధినిర్వహణలో మంత్రులకు సహాయ సిబ్బందిని కేటాయిస్తారు. వీరిలో వ్యక్తిగత కార్యదర్శులు, సహాయకులు, స్టెనోగ్రాఫర్, క్లర్క్, డ్రైవర్, ప్యూన్లు ఉంటారు.

కేంద్ర ప్రభుత్వ ‘పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం’ విడుదల చేసిన ఒక సర్క్యులర్ ప్రకారం.. కేబినెట్ హోదా మంత్రికి 15, ఇండిపెండెంట్ చార్జ్ మంత్రికి 14, సహాయ మంత్రికి 13 మంది సిబ్బందిని కేటాయిస్తారు.

అదనంగా ఇతర శాఖల బాధ్యతలు నిర్వహించాల్సి వచ్చిన సందర్భంలో అదనపు సిబ్బందిని తీసుకునే అవకాశం ఉంది.

కోవిడ్ సమయంలో జీతాల్లో కోత..

కాలానుగుణంగా ఎంపీలు, మంత్రుల జీతాలు, అలవెన్స్‌లు పెరుగుతుంటాయి. అయితే, వాటిని తగ్గించిన అరుదైన సందర్భం ఒకటి ఇటీవలి కాలంలో ఏర్పడింది.

2020 ఏప్రిల్‌లో కోవిడ్ సందర్భంగా మంత్రులు, ఎంపీల జీతభత్యాల్లో ఏడాది పాటు 30 శాతం మేర కోత విధిస్తూ అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)