You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సంకీర్ణ ప్రభుత్వం నరేంద్ర మోదీ దూకుడును కట్టడి చేస్తుందా?
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సంకీర్ణ ప్రభుత్వాలు భారత దేశానికి కొత్తేమీ కాదు.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన ప్రజాస్వామ్యంలో, ఆరు నుంచి డజను పార్టీలు కలిసి అతిపెద్ద సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి.
1989 నుంచి 2004 వరకు, ఆరు సార్వత్రిక ఎన్నికలలో ఒక్క పార్టీకీ పూర్తి మెజారిటీ రాలేదు. ఈ సంకీర్ణాలలో కొన్ని గందరగోళంగా ఉన్నాయి. 1989 - 1999 మధ్య ఎనిమిది సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, వాటిలో కొన్ని చాలా తొందరగా కూలిపోయాయి.
అయితే, దేశంలో ఆర్థిక సంస్కరణలు, అత్యధిక వృద్ధి రేటు, కాంగ్రెస్, బీజేపీల నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాల సమయంలోనే సాధ్యమయ్యాయి.
2014 తర్వాత 2024లో లోక్‌సభలో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ లేని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది.
పుంజుకున్న ప్రతిపక్షాలతో, సీట్లు తగ్గిన బీజేపీకి చెందిన నరేంద్ర మోదీ, మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మెజారిటీ కోసం బీజేపీ ఇప్పుడు ప్రధానంగా తన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లోని రెండు మిత్రపక్షాలపై ఆధారపడింది.
అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా ఇప్పటివరకు మెజారిటీతో పాలించి, దశాబ్దకాలం పాటు రాజకీయాలను శాసించిన మోదీ, సంకీర్ణాన్ని సమర్థంగా నడపగలరా ఆయన తన ఆధిపత్య శైలిని వదిలి, మిత్రపక్షాలతో సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తారా? తన పార్టీ, అనుకూలమైన మీడియా ద్వారా పెరిగిన వ్యక్తిత్వ ఆరాధనను వదిలి, అందరినీ కలుపుకుపోతూ, వినయపూర్వకంగా ఉండగలరా?
అయితే, సంకీర్ణంలో అంతా సాఫీగా సాగడం అసాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మోదీ ఎక్కువగా ఆధారపడుతున్న రెండు మిత్రపక్షాలు, రెండు ప్రాంతీయ పార్టీలు. ఒకటి జనతాదళ్ (యునైటెడ్), రెండోది తెలుగుదేశం పార్టీ (టీడీపీ). ఈ రెండు పార్టీలకు కలిపి 28 సీట్లు ఉన్నాయి. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు - ఇద్దరూ అనుభవజ్ఞులైన, తెలివైన నాయకులు. గతంలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నారు. అయితే బీజేపీతో, ప్రత్యేకించి మోదీతో విభేదాల కారణంగా దూరం అయ్యారు.
2019లో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రత్యర్థి అయిన మోదీని, "టెర్రరిస్ట్" అని ముద్ర వేశారు.
రాజకీయ స్నేహాలు వింతగా ఉంటాయి. భారత్‌కు ఇలాంటివి కొత్తేమీ కాదు.
కేవలం రెండు లేదా మూడు మిత్రపక్షాలపై ఆధారపడిన సంకీర్ణ ప్రభుత్వాలు, ఒక్కరు మద్దతు ఉపసంహరించుకున్నా కూలిపోయే ప్రమాదం ఉంటుంది.
మోదీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి దోహదపడుతుందని చాలామంది నమ్ముతున్నారు. ఇది ప్రధానమంత్రి ఆధిపత్యాన్ని తగ్గిస్తుందని, పాలనను వికేంద్రీకరిస్తుందని, దాని వల్ల ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం వస్తుందని, అధికార యంత్రాంగం, న్యాయవ్యవస్థ, మీడియా వంటి సంస్థలను మరింత స్వతంత్రంగా, బలోపేతంగా మార్చగలదని వాళ్లు అంటున్నారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి 1998 నుంచి 2004 వరకు బహుళ-పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించారు. విదేశీ పెట్టుబడులను సులభతరం చేశారు. ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించారు. వాణిజ్య అడ్డంకులను తొలగించారు. ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చారు.
అణు పరీక్షలపై దశాబ్దాల నాటి మారటోరియానికి ముగింపు పలికి, పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలను సడలించి, అమెరికాతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు. దీనికి చాలావరకు, అందరినీ కలుపుకుపోయే వాజ్‌పేయి వ్యక్తిత్వం కారణం.
అయితే ప్రస్తుత మోదీ నేతృత్వంలోని సంకీర్ణం, గతం కంటే చాలా భిన్నమైనది.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 స్థానాల కంటే బీజేపీకి వచ్చింది తక్కువే అయినా, 240 సీట్లు సాధించింది కాబట్టి కూటమిలో బీజేపీ ఆధిపత్యం ఉంటుంది.
గతంలో, మైనారిటీ ప్రభుత్వాలు తక్కువ సీట్లతో అయినా విజయవంతంగా నడిచాయి. కాంగ్రెస్ 1991లో 232 సీట్లతో, 2004లో 145 సీట్లతో, 2009తో 206 సీట్లతో విజయవంతంగా మైనారిటీ ప్రభుత్వాలను నడిపింది.
అయితే ఇప్పుడు మోదీ దూకుడుతో ఉన్న, కొత్త పుంతలు తొక్కుతున్న బీజేపీకి నాయకత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ చెప్పినట్లు మోదీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా, పాలనలో "నా దారి రహదారి" అనే విధానాన్ని అవలంబిస్తున్నారు.
గతంలో, బీజేపీ సంకీర్ణ భాగస్వాములు బీజేపీకి సంబంధించిన కీలకమైన సైద్ధాంతిక, సమీకృత అంశాలను వెనక్కి నెట్టడంలో విజయం సాధించాయి.
గత కొన్నేళ్లుగా బీజేపీ ఎజెండాలోని పలు అంశాలు – కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేయడం, రామ మందిర నిర్మాణం వంటివి, మోదీ నాయకత్వంలో చేశారు.
ఈసారి ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రజలను మతప్రాతిపదికన విభజించే ప్రసంగాలు చేశారు. మరీ ప్రత్యేకించి ముస్లింలకు వ్యతిరేకంగా చాలా చోట్ల మాట్లాడారు. అలాంటి మాటలను తగ్గించమని మిత్రపక్షాలు ఇప్పుడు ఆయనకు చెప్పగలుగుతాయా?
సంకీర్ణ రాజకీయాలు విజయం సాధించాలంటే ఒక కూటమిగా, సమష్టిగా పనిచేయాలి. సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు, బీజేపీ ఏయే ప్రధాన సమస్యలపై ఏకీభవించవచ్చన్నది ఇప్పుడు కీలక ప్రశ్న.
భారతదేశంలో 1967 వరకు కేంద్ర, రాష్ట్రాల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేవారు. తర్వాత రెండు ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించడం మొదలైంది. అయితే ఇప్పుడు మళ్లీ మునుపటిలా జమిలి ఎన్నికల కోసం బీజేపీ ఒత్తిడి చేస్తోంది.
యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను తీసుకువస్తామని ఆ పార్టీ వాగ్దానం చేసింది. దేశంలోని మెజారిటీ హిందువులు, మైనారిటీ ముస్లింలు గతంలో దీనిని ప్రతిఘటించారు.
2026 తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన సున్నితమైన సమస్య ఉంది. బీజేపీకి పట్టు ఉన్న పేద, ఎక్కువ జనాభా కలిగిన హిందీ రాష్ట్రాలకు అనుకూలంగా ఉండేలా నియోజకవర్గాలను పునర్విభజిస్తారని సాపేక్షంగా సంపన్నమైన, తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు భయపడుతున్నాయి.
మోదీ మిత్రపక్షాలకు చెందిన ప్రాంతీయ, నిర్దిష్ట డిమాండ్లను కూడా వినాలి. ఆయా నాయకుల ఆశయాలకు అనుగుణంగా వ్యవహరించాలి. టీడీపీ, జేడీ(యూ) రెండూ తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను డిమాండ్ చేశాయి, దీని అర్థం అవి మరిన్ని కేంద్ర నిధులను కోరుతున్నాయి.
మోదీ మరిన్ని ఉద్యోగాలను సృష్టించి పేద, మధ్యతరగతి ప్రజలకు ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో వ్యవసాయం, భూమి, కార్మిక రంగంలో అనేక నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం. వీటిలో దేనిని సాధించాలన్నా, మోదీకి మిత్రపక్షాలతో సంప్రదింపుల విధానం అవసరం కావచ్చు.
ప్రజల దృష్టిని ఆకర్షించాలనుకునే వ్యక్తిగా, మోదీకి అందరినీ కలుపుకుపోయే రాజకీయాలు అంత సులభం కాకపోవచ్చు అని చాలా మంది భావిస్తున్నారు.
"హఠాత్తుగా తన జీవితంలో ఇంతకు ముందెన్నడూ నటించని పాత్రలో నటించాలని ఆయనను కోరుతున్నారు" అని మోదీ జీవిత చరిత్ర రచయిత నీలాంజన్ ముఖోపాధ్యాయ అన్నారు.
కానీ విజయవంతమైన రాజకీయ నాయకులకు పునర్నిర్మాణ కళలో ప్రావీణ్యం ఉంటుంది. భారతదేశం ఇప్పుడు వినయపూర్వకమైన, సంప్రదింపులు జరిపే, ఏకాభిప్రాయం సాధించే మోదీని చూస్తుందా?
"మనం వేచి చూడాలి" అని రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి అన్నారు. "మనం దీనిని ప్రస్తుత పరిస్థితుల దృష్టి నుంచి చూడాలి, అంతే తప్ప గతంలోని పొత్తుల ద్వారా కాదు." అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కంగనాపై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ మహిళా జవాన్ ఎవరు, ఎయిర్ పోర్టులో అసలేం జరిగింది?
- తెలంగాణ: ఒక్క సీటూ గెలవని బీఆర్ఎస్, ఎన్నికలకు ముందే ఆశలు వదిలేశారా
- ఎన్నికల్లో మోదీ బలం తగ్గడాన్ని పొరుగు దేశాలు, అమెరికా ఎలా చూస్తాయి?
- లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: బీజేపీ కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ వ్యూహం ఎలా ఫలించింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)