ఇండియా కూటమి: పడి లేచిన ప్రతిపక్షం, ఇంకా ఎక్కడ వెనకబడిందంటే...

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలో జూన్ 4న వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చాలామందికి ఆశ్చర్యం కలిగించాయి. విజేతలు నిరాడంబరంగా కనిపిస్తే, రన్నరప్‌లు సంబరాలు చేసుకున్నారు.

543 మంది సభ్యులున్న పార్లమెంట్‌లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 290కి పైగా సీట్లతో మూడోసారి అధికారం చేపట్టడానికి సిద్ధమవుతోంది.

కానీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేదు. ఈ ఫలితం ప్రతిపక్ష ఇండియా కూటమికి, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి పెద్ద కమ్‌ బ్యాక్‌ (పునరాగమనం)గా పరిగణిస్తున్నారు.

ఇండియా కూటమి కేవలం 230 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే సంఖ్యయితే కాదు, కానీ ఫలితాలు వచ్చిన 24 గంటల తర్వాత కూడా వారు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు.

‘ప్రతిపక్షమే ఊహించలేదు’

ఫలితాలపై రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ బీబీసీతో మాట్లాడుతూ "ఇది అసాధారణమైన కథ. ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ప్రతిపక్షం ఊహించని రీతిలో విజయం సాధించింది’’ అని అన్నారు.

ఆనందోత్సాహాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ తీర్పును "మోదీకి నైతిక, రాజకీయ ఓటమి" అని పేర్కొంది, ఈ ఎన్నికలో బీజేపీ ప్రధానంగా మోదీ పేరు, రికార్డులపైనే ప్రచారం చేసింది.

ఫలితాల రోజు సాయంత్రం, రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ "దేశం ఏకగ్రీవంగా మోదీ, అమిత్ షాలకు మాకు మీరు వద్దు అంటూ సందేశం పంపింది’’ అన్నారు. ఈ ఉత్సాహానికి ఒక నేపథ్యం ఉంది.

ఎన్నికల సమయంలో ప్రతిపక్షం పూర్తిగా గందరగోళంగా కనిపించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో 20కిపైగా భిన్నమైన ప్రాంతీయ పార్టీలున్నాయి,

ఎన్నికల ముందు కూటమి చీలిపోయే అంచున ఉన్నట్లు కనిపించింది. ఆ సమయంలో తిరుగులేని విధంగా కనిపించిన మోదీని సవాలు చేయగలరా? అని నిపుణులూ ప్రశ్నించారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్షాలు దీటుగా నిలబడ్డాయి. పార్టీలు, నాయకుల నుంచి దర్యాప్తు ఏజెన్సీల దాడులు జరిగాయి. అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఇద్దరు ముఖ్యమంత్రులు జైలు పాలయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను అధికారులు స్తంభింపజేసింది.

'బీజేపీకి బెడిసి కొట్టిందక్కడే'

ప్రతిపక్షాల పనితీరుకు క్రెడిట్ ఎక్కువగా నెహ్రూ-గాంధీ వంశానికి చెందిన రాహుల్ గాంధీకి చెందుతుందని కిద్వాయ్ అన్నారు. ఆయన ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశానికి మొదటి, ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి, ఆయన నాన్నమ్మ, తండ్రి కూడా ప్రధానమంత్రులుగా పనిచేశారని అన్నారు.

"ఆయన గొప్ప వారసత్వ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఐదో తరం నాయకుడు" అని కిద్వాయ్ అన్నారు.

"దేశంలోని ప్రధాన మీడియా రాహుల్‌కు చాలా ప్రతికూలంగా ఉంది, సోషల్ మీడియా ఆయనను అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎక్కువ సెలవులు తీసుకున్న నాన్-సీరియస్ రాజకీయ నాయకుడిగా అంచనా వేసింది.’’ అని తెలిపారు.

కానీ, రాహుల్ గాంధీ అలాంటి అసమానతలను అధిగమించారని, ఇటీవలి సంవత్సరాలలో తనతో పాటు పార్టీపై ఉన్న ఆ అభిప్రాయాన్ని మార్చడానికి చాలా కష్టపడ్డారని కిద్వాయ్ తెలిపారు.

“రాహుల్ భారత్ జోడో యాత్ర, న్యాయ్ మార్చ్‌తో దేశం పొడవునా లక్షలాది మందిని కలుసుకున్నారు. ఇది ఆయన స్థాయిని పెంచింది. ఆయనకు విశ్వాసాన్ని, రాజకీయ శక్తిని కూడా ఇచ్చింది.’’ అన్నారు కిద్వాయ్.

కానీ రాహుల్‌ను ఇప్పటికీ మోదీకి ముప్పుగా చాలామంది భావించడం లేదు. గత ఏడాది, మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని కోర్టు రాహుల్‌ను పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారించింది. ఆయన పార్లమెంటు సభ్యత్వం రద్దు చేశారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా అయిపోయింది. అయితే, సుప్రీంకోర్టు ఆ తీర్పుపై స్టే విధించడంతో రాహుల్ సభ్యత్వం పునరుద్దరించారు.

‘విపక్షాల వెంటాడి వేటాడే తత్వం’ బెడిసికొట్టిందని రాజకీయ విశ్లేషకుడు, రచయిత అజోయ్ బోస్ అభిప్రాయపడ్డారు.

‘‘బీజేపీ కాస్త అహంకారంతో, ఆత్మసంతృప్తితో ఉంది. కానీ ప్రతిపక్షాలను భయపెట్టడానికి వారు ఎంచుకున్న మార్గాలు, వ్యూహాలు బీజేపీకే వ్యతిరేకంగా పని చేశాయి, ఇండియా కూటమి ఏర్పాటుకు దారితీసింది. పార్టీలు, తాము తుడిచిపెట్టుకుపోతామని భయపడ్డాయి, చాలామంది ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు.’’ అని తెలిపారు.

"దేశం ఏకపక్ష నియంతృత్వంగా మారడం పట్ల ప్రజల్లో అశాంతి, అసౌకర్యం ఏర్పడింది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రతిపక్షాల ప్రతిఘటన

బీజేపీ అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో బలమైన ప్రతిఘటనను ఎదుర్కొంది.

తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ కీలకంగా ఉన్న రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలను ఇండియా కూటమి గెలుచుకుంది. బీజేపీ కనీసం ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీని 12 స్థానాలకు పరిమితం చేశారు (2019లో 42 స్థానాలకు గాను 18 స్థానాలను మోదీ పార్టీ గెలుచుకుంది).

మహారాష్ట్రలో బీజేపీ తొమ్మిది స్థానాలకే పరిమితమైంది, 2019లో అక్కడ బీజేపీ 48 సీట్లలో 23 గెలుచుకుంది, అప్పటి మిత్రపక్షమైన శివసేన మరో 18 స్థానాలను కైవసం చేసుకుంది. కానీ మోదీ, బీజేపీలకు అతిపెద్ద నష్టం ఉత్తరప్రదేశ్‌లో జరిగిందని బోస్ చెప్పారు.

“సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)ది ఈ ఎన్నికలలో అతిపెద్ద విజయం. రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకుని యూపీలోని 80 సీట్లలో 43 సీట్లు గెలుచుకున్నారు. బీజేపీ సంఖ్య 33కి పరిమితమైంది. మోదీ పార్టీ అక్కడ 2019లో 62 సీట్లు గెలుచుకోగా, 2014లో 71 సీట్లు సాధించింది.

ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌లను "పెయిర్ ఆఫ్ బాయ్స్" అంటూ మోదీ అభివర్ణించారు. వారి కూటమి గతంలో చాలాసార్లు పరాజయం పాలైంది. అయితే ఈ జోడీ వల్ల యూపీలో బీజేపీకి పరాభవం ఎదురైంది.

"అయోధ్య నగరంలో కొత్త రామ మందిరం కూడా బీజేపీ గెలవడానికి సాయపడలేదు." అని బోస్ అన్నారు.

మోదీ నేతృత్వంలో జనవరిలో చాలా ఆర్భాటంగా అయోధ్యలో అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని ప్రారంభించి, పార్టీ తమ ట్రంప్ కార్డ్‌గా రామమందిర ఆలయాన్ని పరిగణించింది. కానీ ఆలయం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో మాత్రం బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు.

'ర్యాలీలతో మాకు అర్థమైంది'

ఎస్పీ యువజన విభాగం నాయకుడు, ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అయిన అభిషేక్ యాదవ్ బీబీసీతో మాట్లాడుతూ యూపీని గెలవడానికి ఈ ఆలయం సహాయపడుతుందని బీజేపీ నమ్మిందని అన్నారు.

‘‘ఏప్రిల్ ప్రారంభం వరకు యూపీలో ఎన్నికలు మాకు వ్యతిరేకంగా, ఏకపక్ష పోటీలా అనిపించాయి. కానీ మా ర్యాలీలకు పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం మొదలైనప్పుడు బీజేపీపై అంతర్లీనంగా ఆగ్రహం ఉందని మాకు అర్ధమైంది.’’ అని యాదవ్ అన్నారు.

ఉద్యోగాలు లేకపోవడం, ఆహారం, ఇంధనం ధరలు పెరగడం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. ఆర్మీ సైనికులను నియమించే విధానంలో వచ్చిన మార్పులపై కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.

"ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఎస్పీ కలిసి ఎన్నికల్లో పోరాడుతున్నందున, బీజేపీ వ్యతిరేక ఓటర్లందరూ మాకు ఓటు వేయడానికి ఏకమయ్యారు." అన్నారాయన.

‘కూటమే చేజార్చుకుంది’

ప్రతిపక్ష కూటమి పనితీరు బాగానే ఉన్నప్పటికీ, కొన్ని విషయాలలో ఓటర్ల మనసును అర్ధం చేసుకోవడంలో అది విఫలమైందని కిద్వాయ్ అన్నారు.

మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలలలో ఎక్కడ ఎక్కువ అసంతృప్తి ఉందో పసిగట్టలేక ఇండియా కూటమి అవకాశాన్ని చేజార్చుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.

"నిరుద్యోగం, గ్రామీణ ఆర్థిక దుస్థితి గురించి మాట్లాడారు, చాలామంది ఓటర్ల మనసులను గెలుచుకోగలిగారు. కానీ వారి వ్యూహంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి." అని కిద్వాయ్ చెప్పారు.

“ఇండియా కూటమిలోని బలహీనతల కారణంగానే ఎన్‌డీఏ మూడోసారి అధికారంలోకి వస్తోంది. వారు ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో పొత్తులు కుదుర్చుకోగలిగారు. అది మెజారిటీని ఇచ్చింది. కానీ ఇప్పుడు ఎన్డీఏ, మోదీ తిరిగి అధికారంలోకి వచ్చినందున, ‘ఇండియా’ దాని కూటమిని స్థిరపరుచుకోవాల్సిన అవసరం ఉంది. కూటమిని రాహుల్ ముందుండి నడిపించాలి.’’ అని కిద్వాయ్ చెప్పారు.

“ప్రభుత్వం ప్రతిపక్షాల వెంటాడటం ఆగకపోవచ్చు. కానీ అది కూడా ప్రభుత్వానికి అంత సులభం కాదు. వారు తమ రాజకీయాలను ప్రతీకారంతో కొనసాగించలేరు.’’ అని అన్నారు.

“గాంధీలు తమను తాము అధికారానికి ధర్మకర్తలు (ట్రస్టీలు)గా పరిగణిస్తారు, అధికారం అంటే ఏలడానికి కాదు. వారు కూడా మారాల్సిన సమయం వచ్చింది. రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టి నాయకత్వం వహించాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)