You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సనాయె టకయిచి, ఈ ‘ఐరన్ లేడీ ఆఫ్ జపాన్’ ముందున్న సవాళ్లేంటి?
- రచయిత, షైమా ఖలీల్
- హోదా, జపాన్ కరస్పాండెంట్
జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నిక కావడం ద్వారా సనాయె టకయిచి చరిత్ర సృష్టించారు. జపాన్ పార్లమెంట్‌లో ఎగువ, దిగువ సభల్లో ఆమె మెజార్టీ ఓట్లు సాధించారు.
64 ఏళ్ల ఈ కన్సర్వేటివ్ నేతకు జపాన్ ఐరన్ లేడీగా గుర్తింపు ఉంది. ఆమె బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌కు వీరాభిమాని.
లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో అతివాద నాయకురాలిగా గుర్తింపు పొందారు. ప్రధానమంత్రి పదవి కోసం మూడుసార్లు పోటి పడిన ఆమె, మూడో ప్రయత్నంలో విజయం సాధించారు.
ఐదేళ్లలో నాలుగో ప్రధానిగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధానిగా ఎన్నికైన టకయిచి తన మంత్రి వర్గాన్ని ప్రకటించనున్నారు.
మంత్రుల పేర్లు ప్రకటించిన తర్వాత వారంతా ఇంపీరియల్ ప్యాలెస్‌కు చేరుకుని సంతకాలు చేసిన తర్వాత మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారు.
2025 సెప్టెంబర్ 7న ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు షిగెరు ఇషిబా ప్రకటించారు. అక్టోబర్ 3న ఎల్డీపీ 64 ఏళ్ల సనాయె టకయిచీని తమ కొత్త నాయకురాలిగా ఎన్నుకుంది.
అధికార పార్టీ సంప్రదాయ విధానాలకు బలమైన మద్దతుదారుల్లో టకయిచి ఒకరు.
ఆమె గతంలో మంత్రిగా కూడా పనిచేశారు.
టీవీ హోస్ట్‌గానూ, హెవీ మెటల్ డ్రమ్మర్ (భారీ డ్రమ్ములు వాయించేవారు)గా సుపరిచితురాలు.
స్కూబా డైవర్ కూడా.
కార్లంటే చాలా ఇష్టం. ఆమెకెంతో ఇష్టమైన టయోటా సుప్రా ప్రస్తుతం నరా మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు.
యూనివర్సిటీలో చదువుకునేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో యూనివర్సిటీ ఫీజులను తానే స్వయంగా చెల్లించేందుకు చదువుకుంటూనే పని చేశారు.
జపాన్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగానే కాదు, వివాదస్పదురాలిగా కూడా పేరుంది.
ఆర్థిక వ్యవస్థ మందగమనం, ద్రవ్యోల్బణం, చాలాకాలంగా పెరగని వేతనాల వంటి అనేక సవాళ్లను ఆమె ఎదుర్కోవాల్సి ఉంది.
డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వంతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న టారిఫ్ ఒప్పందం సహా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అమెరికా - జపాన్ సంబంధాలను కూడా గాడిన పెట్టాల్సి ఉంటుంది.
కొన్నేళ్లుగా కుంభకోణాలు, అంతర్గత కుమ్ములాటలతో అల్లకల్లోలంగా తయారైన పార్టీని ఏకతాటిపై నడిపించడం కూడా ఆమెకు ప్రధాన సవాల్ కానుంది.
ఐరన్ లేడీ కాగలరా?
"పార్టీ అంతర్గత కలహాలను చక్కదిద్దడంలో సనాయె టకయిచి సఫలీకృతమయ్యే అవకాశాలు చాలా తక్కువే"నని టోక్యోలోని టెంపుల్ యూనివర్సిటీలో ఏషియన్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ జెఫ్ కింగ్‌స్టన్ బీబీసీతో అన్నారు.
"ఆమె తనను తాను జపాన్ మార్గరెట్ థాచర్ అని చెప్పుకుంటారు. కానీ, ఆర్థిక క్రమశిక్షణ విషయంలో, థాచర్‌తో అసలు సంబంధమే లేదు" అని ప్రొఫెసర్ కింగ్‌స్టన్ అభిప్రాయపడ్డారు.
టకయిచి బలమైన సంప్రదాయవాది. పెళ్లి తర్వాత మహిళలు తమ పుట్టింటి పేరును కొనసాగించేలా అనుమతించే చట్టాన్ని ఆమె చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే స్వలింగ వివాహాలకూ ఆమె వ్యతిరేకం.
దివంగత నేత షింజో అబే శిష్యురాలైన టకయిచి, "అబెనామిక్స్"గా వ్యవహరించే ఆయన ఆర్థిక విధానాన్ని తిరిగి తీసుకొస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు.
ఈ ఎల్‌డీపీ సీనియర్ నాయకురాలు భద్రతాపరమైన విషయాల్లో కఠిన వైఖరి ఉన్న వ్యక్తి. అలాగే, జపాన్ శాంతికాముక రాజ్యాంగాన్ని సవరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
జపాన్ యుద్ధంలో మరణించిన వారితో పాటు యుద్ధ నేరస్థులుగా శిక్షలు పడినవారి స్మారక చిహ్నమైన, వివాదాస్పద యసుకుని మందిరాన్ని ఆమె తరచూ సందర్శిస్తుంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)