You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జపాన్: హత్య కేసులో 56 ఏళ్ల సుదీర్ఘ జైలుశిక్షలో ఉన్న వ్యక్తి నిర్దోషిగా గుర్తింపు
- రచయిత, గావిన్ బట్లర్ , షైమా ఖలీల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
జపాన్‌లో యాభైయేళ్లకు పైబడి జైలు శిక్షను ఎదుర్కొని, దశాబ్దాలపాటు శిక్షను అనుభవించిన 88 ఏళ్ల వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది ఒక కోర్టు. హత్య కేసులో ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ కాలం జైలు శిక్షను అనుభవించిన వ్యక్తిగా ఐవాఓ హకమాడా నిలిచారు.
ఆయన తన బాస్‌ను, బాస్ భార్యను, వాళ్ల ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన కేసులో దోషిగా తేలుస్తూ 1968లో కోర్టు మరణ శిక్ష విధించింది.
అయితే విచారణాధికారులు తప్పుడు ఆధారాలు సమర్పించారని గుర్తించిన కోర్టు, ఐవాఓ హంతకుడు కాదని తేల్చింది.
హకమాడ నాలుగు హత్యలకు పాల్పడినట్లు చూపించడానికి అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులు తప్పుడు సాక్ష్యాలను సృష్టించారనే అనుమానాల మధ్య ఈ కేసును పునర్విచారించి తీర్పు వెలువరించారు.
హకమాడ కేసు జపాన్‌లో చాలా ఫేమస్ కేసు. అలాగే సుదీర్ఘకాలంగా విచారణ జరిగిన కేసుల్లో అది కూడా ఒకటి.
ఈ కేసులో తుది తీర్పు వినడానికి గురువారం నాడు షిజుకా కోర్టుకు దాదాపు 500 మంది వచ్చారు.
న్యాయమూర్తి తీర్పు వెలువరించగానే కోర్టు బయట ఉన్న హకమాడ మద్దతుదారులు ‘బంజాయ్’ అని గట్టిగా నినదిస్తూ సంబరాలు చేసుకున్నారు. జపనీస్ భాషలో ‘బంజయ్’ అనేమాటకు ఇంగ్లీషులో హుర్రే అన్నది సమాన ధ్వని.
తీర్పు వచ్చిన సమయంలో హకమాడ కోర్టులో లేరు. ఆయన మానసిక స్థితి బాగా లేకపోవడంతో విచారణకు హాజరుకావడంపై మినహాయింపు ఇచ్చారు.
అయితే, ఆయన జైలులో కూడా లేరు. ఎందుకంటే, ఈ కేసు పునర్విచారణకు ఆదేశిస్తూనే ఇన్నేళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్న హకమాడను విడుదల చేయాలని 2014లోనే ఆయనను విడుదల చేస్తూ జపాన్ కోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి హకమాడ తన సోదరితో కలిసి ఉంటున్నారు.
రక్తపు మరకలతో దుస్తులు లభ్యం...
హకమాడ మాజీ ప్రొఫెషనల్ బాక్సర్. తర్వాత ఆయన మిసో ప్రాసెసింగ్ ప్లాంట్‌లో పని చేశారు. 1966లో తన యజమాని ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో యజమాని, ఆయన భార్య, ఇద్దరు బిడ్డల మృతదేహాలను బయటికి తీశారు.
తరువాత శవాలను పరిశీలించగా వీరిని కత్తితో పొడిచి చంపినట్లుగా అధికారులు గుర్తించారు. ఆ సమయంలో హకమాడ మిసో ప్రాసెసింగ్ ప్లాంట్‌లోనే పని చేస్తున్నారు.
దీంతో, ఆ హత్యలు హకమాడ చేశారని, ఆ తరువాత ఇంటికి నిప్పు పెట్టి ప్రమాదంగా చిత్రీకరించి 2 లక్షల యెన్‌లు ( సుమారు రూ. 1.15 లక్షల) దొంగిలించారని ఆరోపిస్తూ హకమాడను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.
మొదటగా ఈ హత్యలు చేసినట్లు, దొంగతనం చేసినట్లు హకమాడ ఒప్పుకోలేదు. తరువాత రోజూ 12 గంటల పాటు విచారణలో చిత్రహింసలు పెట్టడంతో నేరం చేసినట్లు హకమాడ ఒప్పుకున్నారట.
దీంతో ఈ కేసులో హకమాడను దోషిగా తేల్చుతూ కోర్టు 1968లో మరణ శిక్షను విధించింది.
మృతదేహాలు దొరికిన సమయంలోనే మిసో ప్లాంట్ ట్యాంకులో రక్తపు మరకలతో కూడిన దుస్తులను గుర్తించారు. ఆ దుస్తులే హకమాడను దోషిగా నిరూపించడంలో కీలకంగా మారాయి.
ఐతే, ఏళ్లు గడిచినప్పటికీ ఈ కేసు విచారణ ఆగిపోలేదు. ఆ దుస్తులపై ఉన్న డీఎన్ఏతో హకమాడ డీఎన్ఏ మ్యాచ్ కాలేదని, వాటిని వేరేవాళ్లు ఉపయోగించి ఉండవచ్చని హకమాడ న్యాయవాది వాదించారు. పోలీసులే తప్పడు సాక్ష్యాలు సృష్టించారని ఆయన అన్నారు.
ఆ దుస్తులు హకమాడ ఉపయోగించలేదన్న న్యాయవాది వాదనలతో కోర్ట్ ఏకీభవించింది. ఇప్పటికే అనేక ఏళ్లుగా జైలులో గడిపిన హకమాడ నిర్దోషి అనడానికి ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో ఇంకా ఆయన్ను నిర్బంధంలో ఉంచడం సరికాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో హకమాడ జైలు నుంచి విడుదలయ్యారు.
ఆ తర్వాత విచారణ కొనసాగింది. గతేడాది మొదలైన పునర్విచారణ ప్రక్రియ పూర్తయింది. గురువారం తీర్పు వచ్చింది. హకమాడను నిర్దోషిగా ప్రకటిస్తూ, ఈ కేసులో ప్రాసిక్యూటర్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని కోర్ట్ అన్నది.
తమ్ముడి కోసం అక్క న్యాయ పోరాటం...
దశాబ్దాల నిర్బంధం, ఎప్పుడో ఒకప్పుడు ఉరి తీస్తారనే భయంతో హకమాడ మానసిక ఆరోగ్యం క్షీణించిందని ఆయన తరపు న్యాయవాదులు, కుటుంబ సభ్యులు చెప్పారు.
హకమాడ కోసం ఎక్కువ కాలం పోరాటం చేసింది ఆయన 91 ఏళ్ల సోదరి హిడెకో. గతేడాది కేసు పునర్విచారణ ప్రారంభమైన సందర్భంలో “ఎన్నోయేళ్లుగా నా భూజాలపై మోస్తున్న భారం ఇక దిగిపోయింది” అని ఆమె అన్నారు.
హత్యకేసులో శిక్ష పడిన ఖైదీలకు పునర్విచారణ జరగడం జపాన్‌లో చాలా అరుదు.
అమెరికాతో పాటు జీ7 దేశాలలో జపాన్ ఒక్కటే ఇప్పటికీ మరణశిక్షను అమలు చేస్తోంది. అక్కడ మరణశిక్షకు గురైన ఖైదీలకు కేవలం కొన్ని గంటల ముందే శిక్ష అమలు గురించి తెలియజేస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)