You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టేలర్ స్విఫ్ట్: ‘కమలాహారిస్ యోధురాలు.. ఆమెకే నా మద్దతు’
- రచయిత, మాడెలైన్ హాల్పెర్ట్
- హోదా, బీబీసీ న్యూస్,న్యూయార్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీపడుతున్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌కు పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మద్దతు ప్రకటించారు.
డోనల్డ్ ట్రంప్, కమలాహారిస్‌ల డిబేట్ ముగిసిన కొద్దిసేపటికే ఆమె ఈ ప్రకటన చేశారు.
ఈ మేరకు టేలర్ స్విఫ్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
‘2024 అధ్యక్ష ఎన్నికలలో నేను కమలాహారిస్, టిమ్ వాల్జ్‌లకు ఓటేయబోతున్నాను. హారిస్ హక్కుల కోసం, సరైన కారణాల కోసం పోరాడుతారు. అలా పోరాడాలంటే అధ్యక్షురాలిగా కమలాహారిస్ ఉండాలి. ఆమె యోధురాలు అని నేను నమ్ముతున్నాను" అని టేలర్ స్విఫ్ట్ అన్నారు.
హారిస్ ‘ప్రతిభావంతురాలైన నాయకురాలు’ అని ఆమె అన్నారు.
‘గందరగోళం లేని ప్రశాంతమైన నాయకత్వం మనకు ఉంటే ఈ దేశం ఇంకెంతో సాధించగలదని నేను నమ్ముతున్నాను’ అని ఆమె తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాశారు.
స్విఫ్ట్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఒక పిల్లితో తాను దిగిన ఫొటోను షేర్ చేసి, దానికి ‘చైల్డ్‌లెస్ క్యాట్ లేడీ’ అని రాశారు.
ఉపాధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ ఎంచుకున్న జేడీ వాన్స్ కొద్దికాలం కిందట చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ ఫొటో షేర్ చేశారు.
కమలాహారిస్ సహా అనేక మంది ప్రముఖ డెమొక్రాట్ మహిళా నేతలను ఉద్దేశిస్తూ వాన్స్ గతంలో ‘చైల్డ్‌లెస్ క్యాట్ లేడీస్’ అని వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యలతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
మరోవైపు ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఎంచుకున్న మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్‌ను టేలర్ స్విఫ్ట్ అభినందించారు.
ఇంతకుముందు ట్రంప్ వెబ్‌సైట్‌లో తాను ఆయనకు మద్దతిస్తున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఫేక్ ఇమేజ్‌ను పోస్ట్ చేయడం వల్లే తాను ఎవరికి ఓటేయబోతున్నాననేది ప్రజలకు చెప్తున్నాను అన్నారు స్విఫ్ట్.
‘ఏఐ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, ప్రమాదాలకు దారితీస్తుందని నేను భయపడ్డాను. అలాగే జరిగింది’ అన్నారామె.
సింగర్లు జాన్ లెజెండ్, ఒలీవియా రోడ్రిగో.. నటుడు జార్జ్ క్లూనీ, దర్శకుడు స్పైక్ లీ సహా హారిస్‌కు మద్దతు పలికిన అనేక మంది ప్రముఖులలో స్విఫ్ట్ కూడా ఒకరు.
మరోవైపు ఒకప్పటి రెజ్లర్ హల్క్ హొగన్, టీవీ స్టార్ అంబర్ రోజ్, బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్రంప్‌కు మద్దతిచ్చారు.
ట్రంప్‌పై పోటీచేసే డెమొక్రటిక్ అభ్యర్థిని ఈ పాప్ స్టార్ ఆమోదించడం ఇదే మొదటిసారి కాదు. 2020 ఎన్నికలకు ఒక నెల ముందు అప్పటి అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు జో బైడెన్, కమలాహారిస్‌లకు స్విఫ్ట్ మద్దతు పలికారు.
ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న్పపుడు.. పోలీసుల చేతిలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో టేలర్ స్విఫ్ట్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
పాప్ సింగర్ అయిన టేలర్ స్విఫ్ట్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 28.3 కోట్ల మంది ఫాలోవర్లున్నారు.
కమలకు మద్దతుగా స్విఫ్ట్ పోస్ట్ చేసిన అరగంటకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 20 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)