You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యూఎస్ ఎలక్షన్స్ 2024: హారిస్, ట్రంప్ తొలి డిబేట్‌లో ఎవరిది పైచేయి?
అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న డోనల్డ్ ట్రంప్, కమలాహారిస్ మధ్య మొదటి డిబేట్ వాడీవేడిగా సాగింది.
పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలోగల ‘నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్’ వేదికగా రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలాహారిస్ కీలక అంశాలపై ఒకరితో ఒకరు దూకుడుగా మాట్లాడారు.
90 నిమిషాల పాటు సాగిన ఈ చర్చలో వీరిద్దరు ఒకరినొకరు అబద్ధాలకోరు అని పిలుచుకున్నారు.
వేదికపైకి చేరుకోగానే కమలాహారిస్, ట్రంప్ కరచాలనం చేసుకున్నారు. నాలుగేళ్ల కిందటి కంటే అమెరికన్లు మెరుగ్గా ఉన్నారని నమ్ముతున్నారా అనే తొలి ప్రశ్నకు తొలుత హారిస్ స్పందిస్తూ తాను ‘‘అవకాశాల ఆర్థిక వ్యవస్థ’ నిర్మాణానికి యోచిస్తున్నట్టు చెప్పారు. గృహనిర్మాణ వ్యయాన్ని భరించి యువతకు చేయూతనిస్తామన్నారు.
ట్రంప్ గతంలోలానే ధనవంతులకు, కార్పొరేట్లకు పన్నులు తగ్గించాలనే యోచనలో ఉన్నారని హారిస్ అన్నారు.
ట్రంప్ కనుక అధికారంలోకొస్తే అమెరికన్లు తాము కొనే నిత్యావసరాలపై ‘ట్రంప్ టాక్స్’ను కట్టాల్సి ఉంటుందని హారిస్ అన్నారు.
‘డోనల్డ్ వద్ద ఎలాంటి ప్రణాళికా లేదు’
అయితే ట్రంప్ ఈ విషయం నుంచి దృష్టిని మరల్చుతూ వాణిజ్యం, వలసల అంశాన్ని ప్రస్తావించారు.
ఇతర దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన చైనా ప్రస్తావన తెస్తూ తాను అధికారంలో ఉండగా తీసుకున్న చర్యల కారణంగా, చైనా నుంచి సుంకాల రూపంలో భారీ ఆదాయం వచ్చిందని, తాను పదవి నుంచి వైదొలిగిన తరువాత కూడా ఈ పన్నులు వస్తున్నాయని చెప్పారు.
అయితే హారిస్ ట్రంప్ ఆర్థిక విధానాలను విమర్శించారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ సాధించిన 16మంది ఆర్థికవేత్తలు, ట్రంప్ విధానాలు అమలు చేస్తే వచ్చే ఏడాదికల్లా ఆర్థిక మాంద్యం వస్తుందని నమ్ముతున్నారనే విషయాన్ని ప్రస్తావించారు.
‘‘డోనల్డ్ ట్రంప్ వద్ద మీకోసం ఎలాంటి ప్రణాళికా లేదు. మీ కోసం పనిచేయడం కంటే ఆయన తనను తాను రక్షించుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారని’’ హారిస్ అన్నారు.
దీనిపై ట్రంప్ గట్టిగా బదులిస్తూ తన విధానాలను ఆర్థికవేత్తలు ‘అద్భుతం’, ‘మంచి పథకాలు ’ అని మెచ్చుకున్నారని చెప్పారు.
అయితే ట్రంప్, ఆయన మిత్రపక్షాలు మాట్లాడటానికి ఇష్టపడని ప్రాజెక్ట్ 2025, కోవిడ్ మహమ్మారి అంశాలను కమలాహారిస్ లేవనెత్తారు.
కన్జర్వేటివ్‌లు రెండోసారి ట్రంప్ పాలనను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ విధాన ప్రతిపాదనలతో తనకు సంబంధం లేదని ట్రంప్ ఖండించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ట్రంప్ తీరును కమలాహారిస్ లేవనెత్తారు.
అబార్షన్ హక్కులపై ఏమన్నారు?
తరువాత మోడరేటర్లు అమెరికా ఓటర్లకు ఎంతో కీలకమైన అబార్షన్ హక్కుల అంశాన్ని ప్రస్తావించారు. గతంలో ఈ అంశంపై మిశ్రమస్పందన తెలియజేసిన ట్రంప్‌ను ఈ విషయంపై ఆయన విధానమేమిటో చెప్పాలని అడిగారు.
తొమ్మిదో నెలలో కూడా గర్భస్రావానికి అనుమతించాలని డెమొక్రాట్లు కోరుకుంటున్నారని ట్రంప్ చెప్పారు. ఈ విషయంలో వారు "రాడికల్"గా ఉన్నారని ఆయన చెప్పారు, ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ ఎంపిక చేసిన టిమ్ వాల్జ్, తొమ్మిదో నెలలో గర్భస్రావం కోసం వాదించారు.
ఈ సమస్యపై నిర్ణయం తీసుకునే విషయాన్ని తిరిగి రాష్ట్రాల పరిధిలోకి తీసుకురావడానికి తాను సహాయపడ్డానని.. అత్యాచారం, అక్రమ సంబంధం కేసుల్లో మినహాయింపులను తాను నమ్ముతానని ట్రంప్ చెప్పారు.
దీనిపై హారిస్ మాట్లాడుతూ ‘నేను మన దేశంలోని మహిళలతో మాట్లాడాను’ అని ఆమె గొంతు పెంచి చెప్పారు .
జనవరి 6 నాటి క్యాపిటల్ హిల్స్ అల్లర్ల పై , ట్రంప్ ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. కానీ ఆనాటి గందరగోళాన్ని కమలాహారిస్ మరోసారి గుర్తు చేశారు.
90 నిమిషాల పాటు సాగిన చర్చలో కమలా హారిస్ ట్రంప్‌ను అనేకసార్లు నిలదీశారు. జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి సమయంలో ఆయన వ్యవహరించిన తీరును, , ఆయనపై మాజీ అధికారులు చేసిన విమర్శలను పదేపదే ప్రస్తావించి ఆయన రక్షణాత్మక ధోరణిలో పడేలా చేశారు.
చర్చ సాగుతున్న కొద్దీ హారిస్ ట్రంప్‌ను డిఫెన్స్‌లోకి నెట్టేశారు. ఆయనను బలహీనుడని పిలిచారు. విదేశీ నేతలు ఆయనను చూసి నవ్వుకుంటున్నారన్నారు. ఆయన ర్యాలీలకు వచ్చే ప్రజలు ముందుగానే వెళ్లిపోతున్నారని విమర్శించారు.
అయితే ద్రవ్యోల్బణం, వలసలు, అఫ్గానిస్తాన్ నుంచి సేనల ఉపసంహరణ వంటి అంశాలలో బలమైన వాదనలు లేని కమలాహారిస్‌ను ట్రంప్ ఇరుకున పెట్టలేకపోయారు.
మొత్తం మీద కమలాహారిస్ ట్రంప్ బలహీనతలను, నిస్సహాయతలను ఎత్తిచూపుతూ ఆయనను రక్షణాత్మకధోరణిలోకి నెట్టేయగా... కమలాహారిస్ బలహీనతలపై దాడిచేసే అవకాశాన్ని ట్రంప్ వదులుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)