టిమ్ వాల్జ్: ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఎంచుకున్న ఈయన ఎవరు?

డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీలో ఉన్న కమలా హారిస్‌, ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్జ్‌ను ఎంచుకున్నారు.

ఈ మేరకు ఆమె అధికారికంగా ప్రకటన చేశారు.

‘టిమ్ వాల్జ్‌ని నా రన్నింగ్ మేట్‌గా ఉండాలని కోరినట్లు ప్రకటించడానికి గర్వపడుతున్నాను. గవర్నర్‌గా, కోచ్‌గా, ఉపాధ్యాయుడిగా, అనుభవజ్ఞుడిగా ఆయన తనలాంటి శ్రామిక కుటుంబాల కోసం పనిచేశారు. వాల్జ్ మాతో ఉండటం చాలా ఆనందంగా ఉంది" అని కమలా హారిస్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.

కాగా హారిస్ ప్రకటన తరువాత వాల్జ్ స్పందించారు.

‘నా జీవితకాలంలో దక్కిన గొప్ప గౌరవం ఇది’ అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

షికాగోలో జరగనున్న సమావేశంలో ప్రతినిధులు ఓటు వేసే సమయానికి ఆమె తన రన్నింగ్ మేట్‌ (ఉపాధ్యక్ష అభ్యర్థి)ని ఎంచుకోవాల్సి ఉండడంతో ఈ ప్రకటన వెలువడింది.

సాధారణంగా అధ్యక్ష అభ్యర్థి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేలా, వారికి ఉపయోగపడేలా ఉండే నేతను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసుకుంటుంటారు.

ఇదే సమయంలో టిమ్ పేరును ఖరారు చేసినట్లు అమెరికన్ మీడియాలో తొలుత కథనాలు వచ్చాయి.

అనంతరం కమలాహారిస్ కూడా అధికారికంగా ప్రకటన చేశారు.

ఇంతకీ ఎవరీ టిమ్? ఆయన నేపథ్యం ఏంటి?

మిన్నెసోటా గవర్నర్‌

వాల్జ్ నెబ్రాస్కా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత నుంచి వచ్చారు.

ఆయన 2018లో మిన్నెసోటా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అంతకుముందు కాంగ్రెస్‌లో 12 ఏళ్లపాటు ఉన్నారు, పోరాటపటిమ కలిగిన డెమొక్రాట్‌గా ఆయనకు పేరుంది.

డోనల్డ్ ట్రంప్, జేడీ వాన్స్‌లను "విచిత్రం" అని పిలిస్తూ ఆయన అమెరికా దృష్టిని ఆకర్షించారు. హారిస్‌ సహా అనేక మంది డెమొక్రాట్‌లకు ఈ పదం బాగా నచ్చింది.

"ట్రంప్ ఒక వింత, విచిత్రమైన వ్యక్తి మాత్రమే" అని నిధుల సేకరణ కార్యక్రమంలో వాల్జ్ అన్నారు.

రిపబ్లికన్ వ్యతిరేకతను ఎదుర్కోవటానికి పదునైన మాటలతో టిమ్ ప్రచారం చేస్తున్నారు.

జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత 2020లో మిన్నెసోటాలో జరిగిన నిరసనలను వాల్జ్ అదుపులోకి తీసుకొచ్చారు. అల్లర్లను అణచివేయడానికి ఆయన నేషనల్ గార్డ్‌ను మోహరింపజేశారు.

ఆర్మీ నేషనల్ గార్డ్‌లో వాల్జ్ 20 సంవత్సరాలకు పైగా పనిచేశారు, ఆయన ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పనిచేశారు. అసిస్టెంట్ ఫుట్‌బాల్ కోచ్‌గా కూడా పనిచేశారు. మిన్నెసోటా ప్రాంతం నిస్సందేహంగా హారిస్‌కు చాలా కీలకం.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)