‘నేనిక్కడ సంతోషంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయను.. నా దేశంలో స్వేచ్ఛకు దూరమైన నా స్నేహితురాళ్లు బాధపడకూడదు’

    • రచయిత, పీటర్ గిల్లిబ్రాండ్
    • హోదా, బీబీసీ న్యూస్‌బీట్

అఫ్గానిస్తాన్‌లో బాలికలకు సెకండరీ స్కూల్ ప్రవేశాలను తాలిబాన్లు నిషేధించారు. మహిళలు ఎక్కువగా బయటికి రాకుండా కట్టడి చేశారు.

2021లో రాజధాని కాబుల్‌లోకి తాలిబాన్లు ప్రవేశించడంతో 22 ఏళ్ల మాహ్ దేశం నుంచి పారిపోయారు.

ఆమె ఇప్పుడు బ్రిటన్‌లో చదువుకుంటున్నారు. ఈ వారం ఇంగ్లిష్‌లో జనరల్ సర్టిఫికేషన్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(జీసీఎస్ఈ) కోర్స్‌లో చేరనున్నారు మాహ్.

‘నేను ఇప్పుడు స్వేచ్ఛగా, సంతోషంగా, సురక్షితంగా ఉన్నాను’ అని ఆమె ‘బీబీసీ న్యూస్ బీట్‌’తో చెప్పారు.

‘కానీ అఫ్గానిస్తాన్‌లోని నా స్నేహితులు మాత్రం ఏమీ చేయలేకపోతున్నారు" అని అన్నారామె.

తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్న తరువాత గత మూడేళ్లలో ఆ దేశంలో మహిళల జీవితాలపై ఆంక్షలు పెరిగాయి.

పన్నెండేళ్లు దాటిన బాలికలు, మహిళలు పాఠశాలలకు వెళ్లకుండా నిషేధించారు.

చాలా యూనివర్సిటీల ప్రవేశ పరీక్షలకు హాజరుకాకుండానూ మహిళలను నియంత్రించారు.

బ్యూటీ సెలూన్‌లు మూసివేశారు. పార్కులు, జిమ్‌లు, స్పోర్ట్ క్లబ్‌లకు మహిళలు వెళ్లకూడదన్న ఆంక్షలు విధించారు.

‘నేను సంతోషంగా ఉన్నప్పుడు, స్నేహితులతో బయటకు వెళ్లినప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలను వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పెట్టను. నేను యూకేలో ఉన్నాను కాబట్టి స్వేచ్ఛగా ఉన్నానని అఫ్గానిస్తాన్‌లోని నా స్నేహితులు అనుకోవడం నాకు ఇష్టం లేదు’ అన్నారు మాహ్.

ప్రస్తుతం కార్డిఫ్‌లో ఉన్న మాహ్ జీసీఎస్ఈ పూర్తిచేసిన తరువాత వేల్స్‌లో మిడ్‌వైఫ్‌గా పనిచేసే అవకాశం దొరుకుతుందని ఆశగా ఉన్నారు.

‘నేనిక్కడ కాలేజీకి వెళ్లగలను, ఉద్యోగానికి వెళ్లగలను. కానీ, ఇదే సమయంలో నా దేశంలోని నా స్నేహితురాళ్లు మాత్రం ఇల్లు దాటి బయటకు రాలేకపోతున్నారు’ అన్నారు మాహ్.

మతపరమైన సమస్యల కారణంగా మహిళలు చదువుకోవడంపై నిషేధం విధించామని.. అవన్నీ పరిష్కారమయ్యాక మహిళలకు చదువుకునే అవకాశం కల్పిస్తామని తాలిబాన్లు చెప్తూ వస్తున్నారు.

కార్డిఫ్‌లో చదువుకోవడమనేది మాహ్‌కి అంత సులభంగా ఏమీ సాధ్యం కాలేదు.

తాలిబాన్లు దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్న తరువాత హెల్మండ్ ప్రావిన్స్ నుంచి కాందహార్‌కు.. అక్కడి నుంచి కాబుల్‌కు పారిపోయినట్లు ఆమె చెప్పారు.

అక్కడి నుంచి ఆమె మరికొందరితో కలిసి యూకే చేరుకున్నారు.

‘నేను అఫ్గానిస్తాన్‌లో ఉండి ఉంటే వారు నన్ను చంపేసేవాళ్లు, లేదంటే పెళ్లి చేసుకునేవాళ్లు’ అని మాహ్‌ అన్నారు.

నేను మా అమ్మతో 'అమ్మా, నేను వెళ్తున్నా' అన్నాను.

ఆమె 'ఎక్కడికి వెళుతున్నావు?" అని అడిగారు.

"నాకు తెలియదు" అని చెప్పాను.

‘నేను మా అమ్మకు సరిగా వీడ్కోలు కూడా చెప్పలేదు. నేను ఆమెను కౌగిలించుకోలేదు. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అఫ్గానిస్తాన్‌లో నేను పెరిగిన ప్రాంతం, పాఠశాల ఏదీ మర్చిపోలేను. నేను నా దేశాన్ని మరచిపోలేను’ అని బాధపడ్డారామె.

ఉర్ద్ (యూఆర్‌డీడీ) అనే యూత్ ఆర్గనైజేషన్ నుంచి మాహ్ సాయం పొందారు.

మాహ్ బ్రిటన్‌కి వచ్చినప్పుడు, ఆమెకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు.

"చాలా కష్టపడ్డాను. నాకెవరూ తెలియదు. అంతా కొత్తగా ఉండేది" అని ఆమె అన్నారు.

కానీ మూడేళ్ల తర్వాత, 20 నిమిషాలకు పైగా సాగిన ఆంగ్ల ఇంటర్వ్యూలో బీబీసీ న్యూస్‌బీట్‌తో మాహ్ మాట్లాడారు. ఇప్పుడు ఆమె వెల్ష్ కూడా నేర్చుకుంటున్నారు.

‘ఇక్కడి ప్రజలు తమకు నచ్చినట్లు ఉన్నారు. మహిళలకు హక్కులు ఉన్నాయి. సురక్షితంగా ఉన్నారు. చాలా అదృష్టవంతులు. వారంతా సంతోషంగా ఉండాలి’ అని మాహ్ అన్నారు.

అఫ్గానిస్తాన్‌ను విడిచిపెట్టిన మరో యువతి 17 ఏళ్ల అఖ్ధాస్.

ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. న్యూమెక్సికోలోని కళాశాలలో పూర్తి స్కాలర్‌షిప్‌‌తో ఆమె చదువుకుంటున్నారు.

తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న రోజును ఆమె గుర్తుచేసుకున్నారు.

"ఏం చేయాలో నాకు పాలుపోలేదు" అని అఖ్ధాస్ అన్నారు.

"వారు నా హక్కులను హరిస్తారా? 20 సంవత్సరాల క్రితం మా అమ్మ అనుభవించినట్లుగానే నేనూ హింసను అనుభవిస్తానా?" అనుకున్నాను.

"మా అమ్మ ఏడుస్తుండటం గమనించాను. ఆమె నా భుజంపై చేయి వేసి.. తాలిబాన్ల కారణంగా చదువు కొనసాగించలేకపోయా. కానీ, నీ తలరాతను తాలిబాన్‌లు రాయడమనేది జరగనివ్వను' అని అన్నారు.

ఆ తర్వాత హెరాత్ ఆన్‌లైన్‌ స్కూల్‌ ద్వారా అఖ్ధాస్ రహస్యంగా చదువుకున్నారు.

"నేను నా చదువును ఎప్పుడూ వదులుకోలేదు. అది ఆన్‌లైన్‌ కావచ్చు మరొకటి కావచ్చు, మార్గాన్ని వెతుకుతున్నాను" అని అఖ్ధాస్‌ చెప్పారు.

ఇదంతా అఖ్ధాస్‌కు సుదీర్ఘమైన, అస్తవ్యస్తమైన ప్రయాణమే.

అమెరికా స్కాలర్‌షిప్ పొందినప్పుడు ఆమెకు వీసా కావలసి వచ్చింది. కానీ అఫ్గానిస్తాన్‌లో రాయబార కార్యాలయాన్ని మూసివేశారు.

ఒక మహిళగా తనకు దేశం విడిచి వెళ్లడానికి అనుమతి లేనందున, మెడికల్ వీసాతో తండ్రితో కలిసి పాకిస్తాన్‌కు వెళ్లినట్లు అఖ్ధాస్‌ చెప్పారు.

అఖ్ధాస్‌‌ ఇప్పుడు తరగతులకు వెళ్తున్నారు.

"అఫ్గానిస్తాన్‌లో కేవలం బాలికల విద్య మాత్రమే సమస్య అని చాలామంది అనుకుంటారు. మానసిక ఆరోగ్యం వంటి ఇతర సమస్యలు కూడా ఉన్నాయి" అని ఆమె చెప్పారు.

"అఫ్గానిస్తాన్‌లోని బాలికలు ప్రతిరోజూ నిరాశ, ఆందోళనకు గురవుతున్నారు. వారికి సహాయం చేసేవారే లేరు" అని అఖ్ధాస్‌‌ చెప్పారు.

స్కూల్, యూనివర్శిటీలకు వెళ్లే బాలికలు, మహిళలపై నిషేధం విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం బీబీసీ న్యూస్‌బీట్‌తో చెప్పింది.

"ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, అప్గాన్ బాలికల హక్కులను కాపాడాలి" అని తాలిబాన్లకు సూచించింది.

మహిళలు, బాలికల విద్యను నిషేధించడంపై తాలిబాన్ల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)