You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీ మద్యం పాలసీ కేసులో మనీష్ సిసోదియాకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, ఈ కేసులో ఇప్పటి వరకు ఏం జరిగిందంటే..
దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దిల్లీ మద్యం పాలసీ కేసులో మనీష్ సిసోదియాను 2023 ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత మార్చి 9న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.
బీబీసీ ప్రతినిధి ఉమంగ్ పొద్దార్ తెలిపిన వివరాల ప్రకారం.. సిసోదియా పాస్‌పోర్టును అప్పగించాలని, అలాగే రూ.10 లక్షల బాండ్ డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది.
‘దిల్లీ ఎక్సైజ్ పాలసీ: 2021-22’ రూపకల్పన సమయంలో అవకతవకలు జరిగాయని, అందులో మనీష్ సిసోదియా ప్రమేయం కూడా ఉందనేది ఆరోపణ. అయితే, ఆ ఆరోపణలను సిసోదియా ఖండిస్తూ వస్తున్నారు.
ఇదే కేసులో అరెస్టైన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఇంకా జైలులోనే ఉన్నారు.
దిల్లీ మద్యం పాలసీ కేసు ఏంటి? ఎప్పుడు ఏం జరిగింది?
- 2020 సెప్టెంబరు 04: అప్పటి దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా కొత్త మద్యం పాలసీపై సిఫార్సుల కోసం అప్పటి దిల్లీ ఎక్సైజ్ కమిషనర్ రవి ధావన్ నేతృత్వంలో నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు.
- 2020 అక్టోబర్ 13: ధావన్ బృందం తన రిపోర్టును దిల్లీ ప్రభుత్వానికి సమర్పించింది. దానిని పబ్లిక్ డొమైన్‌లో ఉంచారు. 14,761 మంది ప్రజలు తమ సూచనలను పంపినట్లు ప్రభుత్వం తెలిపింది.
- 2021 ఫిబ్రవరి 05: పాత మద్యం పాలసీ, ప్రజల అభిప్రాయాలపై లోతుగా అధ్యయనం చేయడానికి మనీష్ సిసోదియా, పట్టణాభివృద్ధి మంత్రి సత్యేందర్ జైన్, రెవెన్యూ మంత్రి కైలాష్ ఖేలత్ నేతృత్వంలో దిల్లీ ప్రభుత్వం మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసింది.
- 2021 మార్చి 22: సిసోదియా నేతృత్వంలోని కమిటీ తన సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గానికి సమర్పించింది. మంత్రిమండలి ఈ కొత్త ఎక్సైజ్ పాలసీని ఆమోదించింది.
- 2021 ఏప్రిల్ 15: దిల్లీ కొత్త మద్యం విధానం ఫైలును అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు పంపారు. ఆయన కొన్ని సూచనలు చేసి, విధానాన్ని సమీక్షించి అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
- 2021 నవంబర్ 17: దిల్లీ కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చింది.
- 2022 జులై 8: మద్యం విధానంపై లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు దిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఒక రిపోర్టు అందించారు. మద్యం విధానం రూపకల్పన సమయంలో డబ్బు చేతులు మారినట్లు ఆరోపించారు. ఆర్థిక నేరాల విభాగానికి కూడా ఆయన ఆ రిపోర్టును సమర్పించారు.
- 2022 జులై 22: సీబీఐ విచారణకు సిఫారసు చేస్తూ కేంద్ర హోం శాఖకు అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాశారు.
- 2022 జులై 30: కొత్త ఎక్సైజ్ పాలసీ ఉపసంహరణకు నోటీసు ఇచ్చారు. ఆ తర్వాత ఆరు నెలలకు పాత మద్యం పాలసీని పునరుద్ధరించారు.
- 2022 ఆగస్టు 6: కొత్త మద్యం పాలసీని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ సహా దిల్లీ ఎక్సైజ్ శాఖకు చెందిన 11 మంది అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా సస్పెండ్ చేశారు.
- 2022 ఆగస్టు 7: మనీష్ సిసోదియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వారిలో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ సహా ముగ్గురు అధికారులు ఉన్నారు. వారిపై నేరపూరిత కుట్ర, మోసం అభియోగాలు మోపారు.
- 2022 ఆగస్టు 19: సిసోదియా ఇంట్లో సీబీఐ సోదాలు చేసింది. ఏడు రాష్ట్రాల్లో మొత్తం 21 చోట్ల సోదాలు జరిగాయి.
- 2022 ఆగస్ట్ 23: దిల్లీ ఎక్సైజ్ పాలసీలో మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసింది.
- 2022 సెప్టెంబర్ 28: ఇండోస్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, వ్యాపారవేత్త, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.
- 2022 అక్టోబర్ 8: దిల్లీ, హైదరాబాద్, పంజాబ్ సహా 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది.
- 2022 అక్టోబర్ 10: మద్యం వ్యాపారి అభిషేక్ బోయిన్‌పల్లిని సీబీఐ అరెస్టు చేసింది.
- 2023 ఫిబ్రవరి, మార్చి: అప్పటి దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను సీబీఐ, ఈడీలు అరెస్టు చేశాయి.
- 2023 అక్టోబర్ 4: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది.
- 2024 మార్చి 15: హైదరాబాద్‌లో సోదాల అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది.
- 2024 మార్చి 21: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది.
- 2024 ఏప్రిల్ 02: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
- 2024 ఏప్రిల్ 11: దిల్లీలోని తిహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్టు చేసింది.
- 2024 మే 10: మే 10న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
- 2024 జూన్ 2: బెయిల్ గడువు ముగియడంతో కేజ్రీవాల్ జూన్ 2న జైలులో లొంగిపోయారు.
- 2024 జూన్ 20: కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
- 2024 జూన్ 21: కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై దిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది.
- 2024 జూన్ 26: జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది.
- 2024 జులై 12: ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన జైలు నుంచి విడుదల కాలేదు.
- 2024 ఆగస్టు 09: దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)