దిల్లీలో యమున నది వరద ఉద్ధృతి.. 9 ఫోటోలలో

దేశ రాజధాని దిల్లీలో యమునా నది ఉద్ధృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

సెప్టెంబర్ 6 ఉదయం 8 గంటల సరి యమున నది నీటి మట్టం దిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద 206.67 మీటర్లు ఉందని అధికారులు వెల్లడించారు.

ఇది ప్రమాద స్థాయిని దాటింది కానీ గరిష్ఠ వరద స్థాయి కంటే తక్కువేనని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది.

అంతకుముందు వరద స్థాయిని ప్రామాణికంగా తీసుకునే ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద ఈ సీజన్ గరిష్ఠ స్థాయి 207.48 మీటర్లకు యమున వరద ప్రవాహం చేరింది.

తరువాత క్రమంగా 207.12 మీటర్లకు తగ్గింది. ప్రస్తుతం 206.4 మీటర్లతో వరద తగ్గుముఖం పడుతోంది.

యమున నదిలో వరద ప్రవాహం పెరిగే సమయాల్లో అధికారులు ముందస్తుగా తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేస్తారు. యమున నదీ సమీపంలో రోడ్ల వెంబడి ఇలాంటివి పెద్ద సంఖ్యలో చూడొచ్చు.

ప్రజల కోసం ఏర్పాటు చేసిన టెంట్లలోకి కూడా వరద నీరు చేరడంతో గుడారాలను ఖాళీ చేశారు.

మయూర్ విహార్ ప్రాంతంలో సహాయ శిబిరాలలోకి నీరు చేరింది. దీంతో ఆ ప్రాంతాలను ఖాళీ చేశారు.

భారీవర్షాలకు తోడు హత్నికుండ్, వజీరాబాద్ బ్యారేజీల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటం యమునానది నీటిమట్టం పెరగడానికి కారణమవుతోంది.

ప్రజలు తమ సామాన్లతో వరద నీటి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

గురువారం(4.09.205)న వరద గరిష్ఠ స్థాయికి చేరింది. ఆ సమయంలో దిల్లీ ఓల్డ్ బ్రిడ్జిని తాకుతూ యమున నది ప్రవహించింది.

నోయిడా అథార్టీ వరద బాధితుల కోసం రిలీఫ్ క్యాంప్ ఏర్పాటుచేసి ఆహారాన్ని అందించింది.

యమునా నది వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 38 ప్రాంతాలలో సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు.

నిరాశ్రయులైనవారి కోసం 522 టెంట్లు ఏర్పాటు చేశారు.

ఇప్పటి వరకు 8,018 మందిని ఈ శిబిరాలకు తరలించారని అధికారులను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది.

మరోవైపు శాశ్వత శిబిరాలలో 2,030మంది ఉన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)