‘జెల్లీ ఫిష్‌లు న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌‌ను ఆపేశాయి’

    • రచయిత, ఆడమ్ డర్బిన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఫ్రాన్స్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన ‘పాల్యువెల్ న్యూక్లియర్ ప్లాంట్‌’లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

దీనికి కారణం జెల్లీ ఫిష్‌లని ఫ్రాన్స్ జాతీయ ఇంధన సంస్థ తెలిపింది.

పాల్యువెల్‌ న్యూక్లియర్ ప్లాంట్ పంపింగ్ స్టేషన్‌లోని ఫిల్టర్లలోకి జెల్లీ ఫిష్‌లు గుంపులుగా ప్రవేశించాయని ఫ్రాన్స్ జాతీయ ఇంధన సంస్థ ఈడీఎఫ్ తెలిపింది.

దీంతో నార్మండీలోని ఈ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి 2.4 గిగావాట్ల మేర తగ్గింది.

అంతరాయం తరువాత మళ్లీ ఈ ప్లాంట్‌ను పూర్తి స్థాయిలో పని చేయించడానికి సిబ్బంది కృషి చేస్తున్నారు.

కాగా ఆగస్ట్‌లో ఫ్రాన్స్‌లోని మరో ప్రధాన అణు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తికి జెల్లీ ఫిష్‌ల వల్ల అంతరాయం ఏర్పడింది.

గ్రేవ్‌లైన్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోకి అనూహ్యంగా భారీ స్థాయిలో జెల్లీ ఫిష్‌లు రావడంతో ప్లాంట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

తాజా ఘటనలో జెల్లీ ఫిష్ కారణంగా పాల్యువెల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని నాలుగు రియాక్టర్లలో ఒక దానిని మూసి వేశారు.

రక్షణ చర్యల్లో భాగంగా మరో రియాక్టర్‌లో ఉత్పత్తిని తగ్గించారు. దీంతో మొత్తం 5.2 గిగావాట్ల విద్యుదుత్పత్తి చేయాల్సిన ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి సగానికి తగ్గిపోయింది.

ఫ్రాన్స్‌ వినియోగిస్తున్న మొత్తం విద్యుత్‌లో 70 శాతం అణు విద్యుత్తేనని వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ అంచనా.

పాల్యువెల్‌ ఫ్రాన్స్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్లలో ఒకటి. దాని నాలుగు యూనిట్లలో ఒక్కొక్కటి 1,300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది.

ప్లాంట్‌లోని ఫిల్టర్లలోకి స్థానిక సమయం ప్రకారం రాత్రి 9 గంటలకు జెల్లీ ఫిష్‌లు వచ్చినట్లు ఈడీఎఫ్ ప్రకటించింది.

రెండు రియాక్టర్లలో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయడానికి తమ బృందాలు కృషి చేస్తున్నాయని సంస్థ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)