You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అరవింద్ కేజ్రీవాల్: ‘రెండు రోజుల తర్వాత రాజీనామా చేస్తా, ప్రజలు మళ్లీ తీర్పు ఇచ్చిన తర్వాతే సీఎం పీఠంపై కూర్చుంటా’
ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల తర్వాత రాజీనామా చేస్తానని దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఇటీవలే జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్, మళ్లీ ప్రజల తీర్పు కోరతానని, అప్పుడే తిరిగి సీఎం పీఠంపై కూర్చుంటానని స్పష్టం చేసినట్లు ఏఎన్ఐ తెలిపింది.
జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన కేజ్రీవాల్, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
‘‘ప్రజలు మళ్లీ నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చే వరకు నేను ఆ పీఠంపై కూర్చోను. నేను ప్రతి వీధికి, ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజాతీర్పును కోరతాను. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. కేజ్రీవాల్ నిజాయితీపరుడు అని మీరు భావిస్తేనే నాకు ఓటేయండి. నేను నీతిపరుడిని కాదనుకుంటే నాకు ఓటేయకండి. నా నిజాయితీకి మీ ఓటే సర్టిఫికెట్. మళ్లీ ఎన్నికయ్యాకే నేను సీఎం పీఠంపై కూర్చుంటా’’ అని ఆయన అన్నారు.
‘‘ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. మహారాష్ట్రతోపాటు నవంబర్‌లోనే ఎన్నికలు జరిపించమని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికలు జరిగే వరకు దిల్లీ సీఎంగా పార్టీకి చెందిన నేతల్లో ఎవరో ఒకరు ఉంటారు. రెండు రోజుల తర్వాత ఎమ్మెల్యేలు సమావేశమై తదుపరి సీఎం ఎవరో నిర్ణయిస్తారు’’ అని కేజ్రీవాల్ అన్నారు.
‘‘కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు సీఎం పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని కొందరు అడిగారు. రాజీనామా ఎందుకు చేయలేదంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి. ఇప్పుడు వాళ్ల దగ్గర ఒక కొత్త ఫార్ములా ఉంది. వాళ్లు ఓడిపోయినచోటల్లా అక్కడి ముఖ్యమంత్రులపై కేసులు పెడుతున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీద కేసు పెట్టారు. కేరళ సీఎం పినరయి విజయ్ మీద కేసు పెట్టారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని ఎందుకు నడిపించకూడదు అని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. నేను నాన్-బీజేపీ ముఖ్యమంత్రులకు ఒకటే మాట చెబుతున్నా. మీపై కేసులు పెడితే వెంటనే రాజీనామాలు చేయకండి’’ అని కేజ్రీవాల్ అన్నారు.
బీజేపీ ఏమంది?
రెండు రోజుల తర్వాత రాజీనామా చేస్తానన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనను ఒక పబ్లిసిటీ స్టంట్ అని బీజేపీ కొట్టిపారేసింది.
‘‘ఇది ఒక పీఆర్ స్టంట్. ఇప్పుడు ఆయనకు దిల్లీ ప్రజల్లో నిజాయితీపరుడన్న గుర్తింపులేదు. అవినీతిపరుడనే ముద్రపడింది. కోల్పోయిన ఇమేజ్‌ను తిరిగి సంపాదించడానికి ఆయన కష్టాలు పడుతున్నారు. తన బ్యాంకు బ్యాలెన్స్ సున్నా అని చెప్పిన ఆయన, అద్దాల మేడలో ఎలా నివసిస్తున్నారు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
బెయిల్ మంజూరు
అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఈ నెల 13న బెయిల్ మంజూరు చేసింది.
నిజానికి కేజ్రీవాల్‌కు జులై 12న ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ సీబీఐ ఆయనను అరెస్ట్ చేసింది.
దీంతో బెయిల్ వచ్చినప్పటికీ ఆయన జైలు నుంచి విడుదల కాలేకపోయారు.
దిల్లీ మద్యం పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగంతో 2024 మార్చిలో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది.
ఈ కేసులో జులై 12న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఇదే కేసులో విచారణకు సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది.
దీనివల్ల ఈడీ కేసులో బెయిల్ వచ్చినా ఆయన బయటకు రాలేకపోయారు. అయితే శుక్రవారం నాడు సుప్రీంకోర్టు సీబీఐ కేసులో బెయిల్ ఇచ్చింది.
ఈ కేసును విచారించిన జస్టిస్ సూర్యకాంత, ఉజ్వల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేసింది.
బెయిల్ మంజూరు సందర్భంగా జస్టిస్ ఉజ్వల్ భుయాన్ మాట్లాడుతూ సీబీఐ పంజరంలో చిలుక అనే పేరును పోగొట్టుకోవాలని చెప్పారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
అంతకుముందు లోక్‌సభ ఎన్నికల సమయంలో మే 10న సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
21 రోజులపాటు అంటే జూన్ 2వరకు ఎన్నికల ప్రచార నిమిత్తం ఆయన మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.
ఇదే కేసులో ఇటీవల దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోదియాకు కూడా బెయిల్ వచ్చింది.
17 నెలల జైలు జీవితం తరువాత సిసోదియా బెయిల్‌పై విడుదలయ్యారు.
అంతకుముందు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా బెయిల్ పొందారు.
కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి ప్రతిపక్ష నేతలకు బీజేపీ వల వేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.
బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ చట్టం ముందు అందరూ సమానమేనని చెబుతోంది.
ఏమిటీ దిల్లీ మద్యం పాలసీ?
దిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్‌లో కొత్త ఎక్సైజ్ పాలసీ (ఎక్సైజ్ పాలసీ 2021-22)ను ప్రవేశపెట్టింది.
ఈ కొత్త మద్యం పాలసీ అమలుతో మద్యం వ్యాపారం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది.
తొలి నుంచే ఈ విధానంపై వివాదం ఏర్పడింది. ఈ విధానం వల్ల ఆదాయం పెరుగుతుందని దిల్లీ ప్రభుత్వం వాదించింది. కానీ దిల్లీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తోసిపుచ్చి జులై 2022లో మరోసారి పాతపద్ధతివైపే మొగ్గుచూపింది.
లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు, న్యూదిల్లీ ఆర్థిక నేరాల విభాగానికి, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి సిసోదియాకు దిల్లీ ముఖ్య కార్యదర్శి నరేష్ కుమార్ ఓ నివేదిక పంపడంతో ఈ కేసు మొదలైంది.
ఈ నివేదికను 2022 జులై 8న పంపారు.
ఎక్సైజ్ శాఖ ఇన్‌చార్జ్‌గా ఉన్న సిసోదియా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండా కొత్త ఎక్సైజ్ పాలసీతో మోసపూరిత మార్గాలలో ఆదాయాన్ని ఆర్జించినట్లు ఆరోపణలు వచ్చాయి.
లైసెన్స్ ఫీజులో కంపెనీలకు రూ.144.36 కోట్ల మినహాయింపు ఇచ్చినట్లు నివేదిక తెలిపింది.
కరోనా కాలంలో లైసెన్స్ ఫీజు మాఫీ కోసం మద్యం వ్యాపారులు దిల్లీ ప్రభుత్వాన్ని సంప్రదించారని నివేదిక పేర్కొంది.
డిసెంబర్ 28 నుంచి జనవరి 27 వరకు దిల్లీ ప్రభుత్వం లైసెన్స్ ఫీజుపై 24.02 శాతం డిస్కౌంట్ ఇచ్చింది.
లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి చేకూర్చడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.144.36 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదిక పేర్కొంది.
అయితే ఇప్పటికే అమల్లోకి వచ్చిన విధానంలో ఏవైనా మార్పులు చేస్తే, దానిని ఎక్సైజ్ శాఖ ముందుగా క్యాబినెట్‌కు, ఆ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కోసం పంపాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
క్యాబినెట్, లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా చేసిన ఏ మార్పునైనా చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు.
ఈ నివేదికను సీబీఐకి పంపారు. దాని ఆధారంగా మనీష్ సిసోదియాను గత సంవత్సరం అరెస్టు చేశారు.
ఎవరెవరు, ఎప్పుడెప్పుడు?
2023 ఫిబ్రవరి, మార్చి: అప్పటి దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను సీబీఐ, ఈడీలు అరెస్టు చేశాయి.
2024 మార్చి 15: హైదరాబాద్‌లో సోదాల అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది.
2024 మార్చి 21: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది.
2024 ఏప్రిల్ 02: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
2024 ఏప్రిల్ 11: దిల్లీలోని తిహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్టు చేసింది.
2024 జులై12: ఈడీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు. కానీ సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన జైలు నుంచి విడుదల కాలేదు.
2024 ఆగస్టు 09: దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
2024 ఆగస్ట్ 27: తిహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
2024 సెప్టెంబర్ 13: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)