ఉత్తరాఖండ్ : మంచు చరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

    • రచయిత, అసిఫ్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ సమీపంలో శుక్రవారం(ఫిబ్రవరి 28) మంచు చరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

మంచుచరియల్లో చిక్కుకుపోయిన వారిలో ఇప్పటివరకూ 50 మందిని రక్షించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచారని డెహ్రాడూన్‌కి చెందిన డిఫెన్స్ పీఆర్‌వో తెలిపారు.

మంచు చరియల్లో చిక్కుకుపోయిన మిగిలిన ఐదుగురి కోసం ఐబీఈఎక్స్ బ్రిగేడ్‌కి చెందిన రెస్క్యూ బృందం నేతృత్వంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌ను సీనియర్ ఆర్మీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ప్రమాద స్థలానికి వెళ్లే రోడ్లు మంచుతో మూసుకుపోవడంతో సహాయ చర్యల కోసం 6 హెలికాప్టర్లను మోహరించారు. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్‌కి చెందిన 3 చీతా హెలికాప్టర్లు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన 2 చీతా హెలికాప్టర్లు, ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక సివిల్ హెలికాప్టర్ సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.

ఈ ప్రమాదంలో 55 మంది కార్మికులు మంచు కింద చిక్కుకున్నారు. వారిలో శనివారం ఉదయానికి 50 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రక్షించిన వారిలో నలుగురు చనిపోయారు.

‘‘మంచుచరియలు విరిగిపడిన ఘటనలో నిన్నటి (ఫిబ్రవరి 28)నుంచి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. నిన్న 33 మందిని రక్షించాం. మరో 17 మందిని ఇవాళ రక్షించాం. మొత్తం 50 మందిని తరలించాం. ఐదుగురి ఆచూకీ ఇంకా తెలియలేదు. వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి’’ అని చమోలీ డీఎం(కలెక్టర్) సందీప్ తివారీ చెప్పారు.

బద్రీనాథ్‌ ధామ్‌కు సమీపంలోని మాణా గ్రామం వద్ద, శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.

''మాణా గ్రామానికి, మాణా పాస్‌కి మధ్య బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌ సమీపంలో ఈ మంచు చరియలు విరిగిపడ్డాయి'' అని సందీప్ తివారీ తెలిపారు.

శుక్రవారం ఏం జరిగింది?

ఆర్మీ కోసం జరుగుతున్న ఓ రోడ్డు నిర్మాణంలో 55 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారంతా మంచుచరియల్లో చిక్కుకుపోయారని సందీప్ తివారీ చెప్పారు. సైన్యంతో పాటు, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు.

మోకాలి లోతున్న మంచులో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు న్యూస్ ఏజెన్సీల చిత్రాల్లో తెలుస్తోంది.

"బీఆర్‌వో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో ఈ కార్మికులంతా పనిచేస్తున్నారు. ఆర్మీ కోసం రోడ్డు నిర్మిస్తున్నారు'' అని సందీప్ తివారీ బీబీసీతో చెప్పారు.

''నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి దగ్గరలో వారు శిబిరాలు ఏర్పాటు చేసుకుని కంటెయినర్లలో నివసిస్తున్నారు. ఉదయం మంచు చరియలు విరిగిపడగానే తమను తాము రక్షించుకునేందుకు పరుగులు తీశారు. వారిలో పది మంది ఐటీబీపీ క్యాంప్ దగ్గరకు పరుగులు తీశారు. 22 మంది జోషిమఠ్ వైపు వెళ్లారు'' అని సందీప్ తివారీ తెలిపారు.

ప్రమాదంపై ఎవరేమన్నారు?

ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదిక ఎక్స్‌ ద్వారా స్పందించారు. ''ఉత్తరాఖండ్‌లోని చమోలీలో జరిగిన మంచు చరియల ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామితో పాటు ఐటీబీపీ డీజీ, ఎన్డీఆర్ఎఫ్ డీజీతో మాట్లాడాను. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడమే మా మొదటి ప్రాధాన్యం. స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది’’ అని ఆయన తెలిపారు.

''మాణా ప్రాంతంలో దురదృష్టకర సంఘటన జరిగింది, బాధితులను రక్షించడానికి అధికారయంత్రాంగం శాయశక్తులా ప్రయత్నిస్తోంది'' అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

"స్థానిక సైనిక విభాగాలు కూడా సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయి. మంచులో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా తీసుకురావడానికి అన్ని వనరులను ఉపయోగిస్తున్నారు'' అని ఆయన తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)