You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిమాలయాల వద్ద సొరంగాల నిర్మాణం ప్రమాదకరమా... సిల్క్యారా చెపుతున్న పాఠమేంటి?
ఎట్టకేలకు 17రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు.
వీరిని కాపాడేందుకు 17రోజులుగా చేసిన వివిధ ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు ర్యాట్ హోల్ మైనింగ్ విధానంలో వీరిని బయటకు తీసుకురావడంతో కథ సుఖాంతమైంది.
అయితే, ఈ సొరంగం పాక్షికంగా ఎందుకు కూలిపోయింది? హిమాలయ పర్వత ప్రాంతాలలో సొరంగాల నిర్మాణం సురక్షితమేనా? పర్వతప్రాంతాలలో సొరంగ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
హిమాలయాల్లో పెనుముప్పు ఇదే
భూమ్మీద హిమాలయాల పర్వతశ్రేణికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ, ఈ పర్వతప్రాంతాలలో అస్థిరత పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
సిల్క్యారా ప్రాంతంలో సొరంగాన్ని నిర్మిస్తున్న భారతీయ కంపెనీ జర్మనీ ఆస్ట్రియన్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ కంపెనీ ‘బెర్నార్డ్ గ్రూపు’ సేవలు పొందుతోంది. ‘ సొరంగ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఊహించినదానికంటే కూడా భౌగోళిక పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయని’ బెర్నార్డ్ గ్రూపు తెలిపింది.
2018లోనే సొరంగానికి అత్యవసర మార్గాన్ని నిర్మించేందుకు అనుమతి లభించినా ఎందుకు నిర్మించలేదనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.
41మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోవడం ఎంత పెద్ద సమస్యో అర్థం కావాలంటే అదెక్కడ నిర్మిస్తున్నారన్నది కూడా అర్థం చేసుకోవాలి. ఈ సొరంగాన్ని హిమాలయ పర్వత శ్రేణులలో నిర్మిస్తున్నారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత చిన్నవయసు పర్వతాలు.
4.5 కోట్ల సంవత్సరాల కిందట రెండు ఖండాలు ఢీకొనడం వలన హిమాలయాలు ఏర్పడ్డాయి. ఇక్కడి భూగర్భం చాలా క్రియాశీలకంగా ఉంటుంది. అంటే భూకంపాలకు అవకాశం ఉన్న ప్రాంతమన్నమాట.
ప్రసిద్ధ భూగర్భశాస్త్రవేత్త సీ.పీ. రాజేంద్రన్ మాట్లాడుతూ, ‘‘ఈ ప్రాంతంలో వివిధరకాలైన శిలలు, వివిధ బలాలతో ఉంటాయి. కొన్ని మృదువుగా, మరికొన్ని గట్టిగా ఉంటాయి. కొన్ని ముడిరాళ్ళు పెళుసుగా ఉంటాయి. ఈ కారణంగానే ఈ ప్రాంతం అస్థిరంగా ఉంటుంది'' అని చెప్పారు.
చార్‌ధామ్ పరిస్థితేంటి?
ఉత్తరాఖండ్‌లో ఛార్‌దామ్ విస్తరించిన నాలుగుజిల్లాల్లోని భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతం గంగ, దాని ఉపనదుల జన్మస్థలం. 60 కోట్ల భారతీయులకు గంగానది ద్వారానే సాగు,తాగునీరు అందుతోంది.
ఈ ప్రాంతంలో కొన్నిచోట్ల అడవులు, హిమనీనదాలు, కొన్నిచోట్ల నీటి ప్రవాహాలు ఉంటాయి. దేశంలోని వాతావరణం కూడా ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తోంది. ఇక్కడి నేల కార్బన్‌ను తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. అంటే ఇది సహజంగానే కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి, కాలుష్యకారక వాయువుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ఈ ప్రాంతంలో చార్‌దామ్ హైవే ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న రహదారిని రెండు వరుసలు హైవేగా మారుస్తున్నారు. ఇందుకోసం 16 బైపాస్‌లు, కొత్తగా రోడ్లు, టన్నెళ్ళు నిర్మిస్తున్నారు. 15 ఫ్లైఓవర్లు, 100 చిన్న వంతెనలను కూడా నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కింద రెండు ముఖ్యమైన సొరంగాలు ఉన్నాయి. ఇందులోమొదటిది సిల్క్యారా ప్రాంతంలోనూ, రెండోది చాంబాలో 400 మీటర్ల సొరంగ నిర్మాణం. దీంతోపాటు రైల్వేల కోసం, జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం కొన్ని సొరంగాలను నిర్మిస్తున్నారు.
125 కిలోమీటర్ల రైల్వే లైను కోసం పన్నెండుకు పైగా సొరంగాలను నిర్మించారు. హైడ్రో ప్రాజెక్టుల కోసం టన్నెల్స్ నిర్మిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇక్కడ 33 ప్రభుత్వ హైడ్రో ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం 14 నిర్మాణంలో ఉన్నాయి.
‘‘గడిచిన 15, 20 ఏళ్ళలో సొరంగాల నిర్మాణం పెరిగింది. ఇంత పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాలు నిర్మించేందుకు ఈ ప్రాంతం అనువైనది కాదు’’ అని పర్యావరణ వేత్త హేమంత్ థ్యానీ బీబీసీకి చెప్పారు.
ఏడాదిలో వెయ్యికిపైగా కొండిచరియల ఘటనలు
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఉత్తరాఖండ్‌లో వెయ్యికిపైగా కొండచరియలు విరిగిపడినట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో 48 మరణించారు. రుతుపవనాల సమయంలో కురిసిన భారీ వర్షాలు కొండచరియలు విరిగిపడటానికి ప్రధాన కారణమని చెపుతున్నారు.ఈ ఏడాది ఉత్తరాఖంఢ్‌లోని జోషిమఠ్ పట్టణంలో రహదారులు, వందలాది ఇళ్ళు బీటలు వారాయి.
హిమాలయపర్వత ప్రాంతాలలోని ఉపరితలంలోని నేల క్షీణత దేశంలో క్షీణించే నేల సగటుకంటే మూడురెట్లు ఎక్కువగా ఉంది. దీనివలన ఇక్కడి భూమి కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహించడం కూడా తగ్గుతోంది.
2013లో కేదార్‌నాథ్‌లో సంభవించిన భారీవర్షాలు భారీ విలయాన్ని సృష్టించి వేలాదిమంది ప్రజల ప్రాణాలు తీశాయి.
‘‘చిన్న సొరంగాలు కట్టమనే సూచనను పట్టించుకోలేదు. దీనివలన పేలుళ్ళు, సొరంగాలు కూలడం పెరుగుతున్నాయి’ అని ధ్యాని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నియమించిన నిపుణుల కమిటీలో ధ్యాని సభ్యునిగా ఉన్నారు.
ఈ అతిపెద్ద ప్రాజెక్టును చిన్న చిన్న భాగాలుగా 100 కిలోమీటర్ల చొప్పున విభజించి ఉంటే బావుండేది. ఈ భారీ ప్రాజెక్టుల వలన పర్యావరణానికి జరిగే హానిని లెక్కపెట్టలేం అని ధ్యాని చెప్పారు.
సొరంగ తవ్వకాల సాంకేతికతపై సందేహాలు
సొరంగాల తవ్వకాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భూగర్భ నిర్మాణంలో నిష్ణాతుడైన మనోజ్ గార్నాయక్ ఓ పత్రికతో మాట్లాడుతూ సొరంగాన్ని సరైన పద్ధతిలో కడితే, అది పర్వతాన్ని కానీ, పర్యావరణానికి గానీ హాని చేయదని చెప్పారు. సొరంగాలను తవ్వే సాంకేతికత 200 ఏళ్ళనాటిదని, దీనిని సవ్యంగా చేయాలంటే ముందు ఇక్కడి శిలల మన్నికను సంపూర్ణంగా పరిశీలించాలన్నారు.
సొరంగాలు నిర్మించేముందు ఆ ప్రాంతానికి సంబంధించిన లక్షణాలను దృష్టిలో పెట్టుకోవాలని ధ్యానీలాంటి పర్యావరణ వేత్తలు చెపుతున్నారు. ప్రతి ప్రాంతంలోని భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉంటాయని ఆయన చెప్పారు.
హిమాలయాల వంటి ప్రాంతాలలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేస్తున్నప్పుడు అవి వాతావరణ మార్పులను, విధ్వంసాలను తట్టుకునేలా ఉండేలా చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యంగా మతపరంగా, పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలలో విధానాలు రూపొందించేటప్పుడు వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు.
తాజాగా కార్మికులు చిక్కుకుపోయి 17 రోజుల ఉత్కంఠ పరిణామాలకు కారణమైన ప్రస్తుత సొరంగాన్ని దూరాభారం తగ్గించేందుకు నిర్మిస్తున్నారు. ఎక్కువగా మంచుతో ఉండే 25.6 కిలోమీటర్ల దూరం ఈ సొరంగం ద్వారా 4.5 కిలోమీటర్లకు తగ్గుతుంది. అంటే, దాదాపు 50 నిమిషాల ప్రయాణం 5 నిమిషాలకు తగ్గిపోతుంది.
ఏమైనా, ఈ సొరంగ ప్రమాదం మనం తగిన పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించిందని అంటారు పర్యావరణ వేత్త ధ్యానీ.
ఇవికూడా చదవండి:
- క్లియోపాత్రాకు ఇష్టమైన ఊదారంగు దుస్తులు వేసుకున్నందుకు స్నేహితుడిని చంపించిన రోమన్ చక్రవర్తి... బంగారం కన్నా ఖరీదైన ఆనాటి 'పర్పుల్ కలర్ కథేంటి?
- రింకూ సింగ్: నాడు బీసీసీఐ నిషేధించిన ఆటగాడే నేడు ‘నయా ఫినిషర్’ అయ్యాడా?
- తెలంగాణ ఎన్నికలు: ఆసక్తికర పోరు, మారుతున్న సన్నివేశాలు
- బర్రెలక్క: తెలంగాణ ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యకు ప్రతినిధి ఈమేనా..
- బలూచిస్తాన్: ఒక్కటవుతున్న వేర్పాటువాద సంస్థలు.. ఈ విలీనం పాకిస్తాన్‌కు సవాలుగా మారుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)