Kasar Devi-Cosmic Energy: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?

    • రచయిత, అశోక్ పాండే
    • హోదా, బీబీసీ కోసం

గురుదత్, పండిట్ రవిశంకర్ వ్యాహ్యాళి కోసం బయటకు వెళ్ళినపుడు వారికి సుమిత్రానందన్ పంత్ ఎదురయినట్లుగా ఒకసారి ఊహించండి. ఆయన సాయంత్రం సాధన చేసేందుకు అప్పుడే ఒక పాట రాశారు.

బహిరంగ వేదికపై, జోహ్రా సెహగల్, ఆమె ఫ్రెంచ్ డ్యాన్సర్ స్నేహితురాలు సిమ్కీ.. ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్‌ సంగీతానికి సాధనచేస్తున్నారు.

మరో ఆంగ్లేయుడు సిగరెట్ కాలుస్తూ ఈ దృశ్యం ఏమీ పట్టనట్లుగా ముందుకు వెళుతున్నారు.

ఆయన లేడీ చాటర్లీ కథను రాసిన ప్రముఖ రచయత డీహెచ్ లారెన్స్ అని తర్వాత తెలిసింది. ఆయన ఈల్ బ్రూస్టర్స్ స్నో వ్యూ కాటేజీలో అతిధిగా ఉన్నారు.

నోబెల్ గ్రహీత బాబ్ డైలాన్ కూడా కసార్‌దేవి‌కి చాలా సార్లు విచేసినట్లు ఈ గెస్ట్ హౌస్ రిజిస్టర్లు చూస్తే తెలుస్తుంది.

ఇక్కడ వీధుల్లో, మలుపుల్లో నడుస్తూ, శ్వేత వర్ణంలో ఉన్న నందా దేవి శిఖరాన్ని, ఎదురుగా ఉన్న త్రిశూల్, పాంచూలిని గంటల తరబడి చూస్తూ బాబ్ డైలాన్ రచించిన పాటల్లో ఎన్ని లైన్లు ఆయన మనసులో పుట్టాయో అని ఆలోచిస్తూ ఉంటాను.

కసార్‌దేవి పరిసర ప్రాంతాలకొక ప్రత్యేకత ఉంది. కసార్ దేవికి 4 - 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు గత 89 సంవత్సరాల నుంచి ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు వస్తూనే ఉన్నారు. ఇక్కడకు వచ్చిన తర్వాత చాలా మంది జీవిత గమనమే మారిపోయింది. భౌగోళికంగా ప్రత్యేక స్థానంలో ఉన్న కసార్‌దేవి మొదటి చూపులోనే సందర్శకులను ఆకర్షిస్తుంది.

ఇక్కడి నుంచి చూస్తే ఒక వైపు నుంచి అల్మోరా నగరం కనిపిస్తుంది. ఎదురుగా చూస్తే హరిత -నీలం-బూడిద రంగులో పరుచుకున్న విశాలమైన పర్వత శ్రేణి కనిపిస్తుంది.

ఈ పర్వతాలపై సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో మబ్బులు, మంచు చేసే మాయాజాలాన్ని చూడవచ్చు. మరో వైపు హిమాలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఆకాశం నీలంగా ఉండి మబ్బులు లేని రోజున గఢ్ వాల్ లోని చౌకంభ - కేదార్ శ్రేణి నుంచి మారుమూలనున్న నేపాల్ లోని ఆపి- నమ్పా శ్రేణి వరకు ఉన్న విస్తృతమైన నగాధిరాజ సామ్రాజ్యం కనిపిస్తూ ఉంటుంది.

కసార్‌దేవి అడవులు ప్రతీ నెలలో కొన్ని వందల రంగుల్లో రూపాంతరం చెందుతూ ఉంటాయి. ప్రకృతి ఇలాంటి సౌందర్యాన్ని కొన్ని ప్రదేశాలకు మాత్రమే ఇస్తుంది.

1930ల చివర్లో, నాట్యకారుడు ఉదయ్ శంకర్ కసార్ దేవి పక్కనే ఉన్న సిమ్‌టోలాలో తన డాన్స్ అకాడెమీని స్థాపించారు. ఈ చిన్న ప్రదేశం దేశీయ, విదేశీ ప్రతిభతో వెలిగి ఉండవచ్చని ఊహిస్తున్నాను.

ఎవరెవరు వచ్చారు?

జర్మనీ స్కాలర్ ఎర్న్స్ట్ లోథార్ హాఫ్‌మ్యాన్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆయన లామా అనే బిరుదును స్వీకరించిన తర్వాత అంగారిక గోవిందునిగా పేరు పొందారు.

ఆయన ముంబయికి చెందిన ర్యాటీ ప్యాటీ అనే ఒక పార్సీ ఫోటోగ్రాఫర్‌ను వివాహం చేసుకుని ఆమె పేరును లీ గౌతమిగా మార్చారు. వీరిద్దరూ కలిసి కసార్‌దేవిలో 1940లలో ఆర్య మైత్రేయ మండల్ స్థాపించారు.

అదే సమయంలో చైనా టిబెట్‌ను ఆక్రమించడం మొదలయింది. గౌతమి, గోవింద కలిసి టిబెటన్ శరణార్ధుల కోసం కోసం ఆశ్రమాన్ని స్థాపించారు. వంట కోసం ఒక టిబెట్ వంట మనిషిని కూడా నియమించారు. ఆ ఇంట్లో ప్రస్తుతం ఆ వంట మనిషి వారసులు ఉంటారు.

ఆధ్యాత్మిక అన్వేషణ కోసం కసార్ దేవికి వచ్చిన వారిలో డెన్మార్క్ కు చెందిన ఆల్ఫ్రెడ్ సోరెన్ సన్ , ఇంగ్లాండ్ కు చెందిన రోనల్డ్ నిక్సన్ కూడా ఉన్నారు. వారిద్దరూ నిజానికి సన్యాసులు. హిందూ మతం స్వీకరించిన తర్వాత ఈ ఇద్దరూ కూడా వారి పేర్లను శూన్యత బాబా, శ్రీ కృష్ణ ప్రేమ్ అని మార్చుకున్నారు.

ఆ తర్వాత శ్రీ కృష్ణ ప్రేమ్ మిర్తోలా అనే ప్రాంతంలో ఆశ్రమాన్ని నిర్మించారు. ఇది జాగేశ్వర్ కు కొంత దూరంలో ఉంటుంది.

ఆయన శిష్యుడు అలెగ్జాన్డర్ ఫిప్స్ (స్వామి మాధవ్ ఆశిష్) ఆధ్యాత్మికతతో పాటు వ్యవసాయం, పర్యావరణం గురించి అనేక ప్రయోగాలు చేశారు. ఇందు కోసం భారత ప్రభుత్వం ఆయనకు పద్మ శ్రీ కూడా ఇచ్చి సత్కరించింది.

కసార్‌దేవికి ఆ పేరెలా వచ్చింది?

సామాన్య శకం(కామన్ ఎరా) రెండవ శతాబ్ధంలో నిర్మించిన కసార్‌దేవి మయ్యా అనే గుడి నుంచి ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని అంటారు. సామాన్య శక పూర్వం 900 ఏళ్ల నాడు పశ్చిమ ఆసియా నుంచి వచ్చిన ప్రాచీన కాసైట్ శాఖకు చెందిన వారు కశ్యప శిఖరంపై ఈ మందిరాన్ని నిర్మించారని అంటారు.

వీరి పేరు మీదే ఈ ప్రాంతానికి కసార్‌దేవి అనే పేరు వచ్చినట్లు చెబుతారు. ఈ గుడిలో ఆధ్యాత్మిక సాధన చేస్తుండగా స్వామి వివేకానందకు జ్ఞానోదయం అయిందని కూడా అంటారు.

హార్వర్డ్, కాలిఫోర్నియా యూనివర్సిటీలలో సైకాలజీ ప్రొఫెసర్ టిమోథీ లియరీ ఈ గుడి ఆవరణలోనే అంతరాత్మకు సంబంధించిన అష్టా వక్ర మార్గాన్ని రూపొందించారు. ఇందుకోసం కొన్ని సైకోడెలిక్ మందులను కూడా సూచించారు.

ఆమె ఆదర్శాలు విన్న తర్వాత టిమోథీ లియరీని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని అమెరికా అధ్యక్షుడు నిక్సన్ పేర్కొన్నారు.

టిమోథీ లియరీను మానవ అంతరాత్మకు వ్యోమగామి లాంటి వారని పలుసార్లు పేర్కొన్న బీట్నిక్ కవులు అల్లెన్ గిన్స్ బర్గ్, గేరీ స్నైడర్ కూడా కసార్ దేవికి విచ్చేసారు. మానసిక శాస్త్ర నిపుణులు రాల్ఫ్ మాట్స్నర్, ఆర్ డీ ల్యాంగ్ కూడా కసార్‌దేవికి తరచుగా విచ్చేసేవారు.

హాలీవుడ్ తారలు కూడా...

ప్రపంచమంతా ఇక్కడకు విచ్చేసిన తర్వాత హాలీవుడ్ మాత్రం రాకుండా ఎలా ఉండగలదు? డ్యానీ కే నుంచి నీల్ డైమండ్ వరకు సినిమా వాళ్ళ జీవితాల్లో కసార్ దేవి అంతర్భాగంగా ఉంది. డ్యానీ కే కూతురు డీనా కసార్ దేవికి దగ్గర్లో ఉన్న దీనాపాణిలో ఒక ఆస్పత్రి కూడా నిర్మించారు.

సూపర్ స్టార్ ఉమా థర్మన్ బాల్యం కూడా కసార్‌దేవిలోనే గడిచింది. ఆమె తండ్రి రాబర్ట్ థర్మన్ లామా అంగరిక గోవిందాతో కలిసి ఇక్కడ ధ్యానం చేసేవారు.

కసార్ దేవికి విచ్చేసిన విదేశీ పర్యటకులు ఇక్కడ చౌకగా లభించే చరస్, గంజాయి కోసం వస్తూ ఉంటారని ఇక్కడి స్థానికులు భావిస్తారు.

1960లలో సాగిన హిప్పీ ఉద్యమానికి ఈ మాదకద్రవ్యాలు ఊపిరిగా పని చేశాయి. స్థానికుల మాటల్లో కూడా కొంత వాస్తవం ఉంది. అయితే, ఇక్కడకు వచ్చే ప్రతీ విదేశీయులు జ్ఞానం పొందటానికే రాలేదు.

ఈ గ్రామాల్లో నెలల కొలదీ గదులను అద్దెకు తీసుకుని ఉండేవారు. కొంత మంది బ్రిటిష్ వ్యక్తులు స్థానిక అమ్మాయిలను పెళ్లి చేసుకుని కసార్ దేవి లో శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారు. కొంత మంది ఇప్పటికీ కనిపిస్తూ ఉంటారు. కొంత మంది ఎక్కడికి వెళ్లారో తెలియదు.

వీరంతా కసార్‌దేవితో పాటు మాట్ మతేనా, గడోలీ, పాపర్ శైలీ, దీనాపాణి గ్రామాల ఆర్ధిక వ్యవస్థకు మూలస్తంభాల్లా పని చేశారు.

హిప్పీ ఉద్యమం వల్ల కసార్ దేవికి ఒకానొక సమయంలో హిప్పీ పర్వతం అనే పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత దీనిని క్రాంక్స్ రిడ్జ్ అని పిలవడం మొదలుపెట్టారు. 1970 - 2000 వరకు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులకు, కవులకు, సంగీతకారులకు, తత్వవేత్తలకు, విలేఖరులకు ఒక ధామంలా మారింది.

ఇక్కడకు వచ్చే వారిలో స్వీడన్ నుంచి అల్జీరియా వరకు , ఆస్ట్రియా నుంచి జపాన్ దేశాలకు చెందిన వారు ఉండేవారు. వారంతా చేసే చర్చల స్థాయిని చూసినప్పుడు అక్కడొక పెద్ద విశ్వ విద్యాలయం ఉందనే భావన కలిగించేది.

మేధావులకు నిలయం..

నాకు ఎరిక్ అనే ఒక జర్మనీ స్నేహితుడు ఉండేవారు. ఆయన సంవత్సరంలో ఆరు నెలలు కసార్‌దేవిలో ఉండేవారు. ఇక్కడకు రాక ముందు ఆయన బెనారస్ లోని సితార్ తయారు చేసే నిపుణుడి ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవారు.

ఆయన దగ్గర నుంచి సితార్ చేసిన తర్వాత పనికిరాకుండా పడేసిన చెక్క ముక్కలను చౌకగా కొనేవారు. కసార్‌దేవిలో ఉన్న ఆరు నెలల సమయంలో ఆ చెక్కలు, ఇత్తడి, రాగి తీగలతో ఆయన ఆఫ్రికన్ సంగీత వాద్యాలను తయారు చేసేవారు. వాటిని ఆయన జర్మనీలో అమ్మేవారు. ఆ డబ్బులు ఆయన మరో సంవత్సరం కసార్ దేవికి తిరిగి వచ్చేందుకు ఖర్చులకు సరిపోయేవి.

పోలండ్ నుంచి క్రిస్టోఫ్ స్ట్రెలేకీ అనే మరొక వ్యక్తి వచ్చేవారు. ఆయన టీ -కాఫీ అమ్మే చోట్ల కనిపించేవారు.

మోటార్ సైకిల్ పై తిరుగుతూ, నల్లని లెథర్ జ్యాకెట్ వేసుకుని ఉండేవారు. ఆయనను ఆది అని పిలిపించుకోవడానికి ఇష్టపడేవారు. ఆయనకు 50 సంవత్సరాలు. ఆయన సొంతంగా తన మోటార్ సైకిల్ మరమ్మతు చేసుకునేవారు. మెషీన్ల గురించి మాట్లాడటాన్ని ఇష్టపడేవారు.

ఆయన మనసు విప్పి లోతైన జీవితపు రహస్యాలు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాం. ఆయన చెప్పే విషయాల గురించి ఎన్నో ఏళ్ల నుంచి కొన్ని డజన్ల పుస్తకాలు రాసినట్లు తెలియడంతో పాటు ఆయనకొక కల్ట్ ఉందని తెలుస్తుంది. ఈ ప్రత్యేక కల్ట్‌కు తూర్పు ఆసియా దేశాల్లో కొన్ని లక్షల మంది అనుచరులు ఉన్నారు.

25 ఏళ్ల క్రితం కసార్‌దేవి మార్కెట్ లో చాలా తక్కువ సంఖ్యలో టీ షాపులు ఉన్న సమయంలో రోడ్డు పక్కన చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉన్న ఒక వృద్ధ ఇంగ్లీష్ వ్యక్తిని చూశాను. ఆయన కుర్తా పైజామా ధరించి, పొడవైన తెల్లని గెడ్డంతో ఉన్నారు. ఆయన గురించి ఉత్సుకత చూపించినప్పుడు, ఆయన బిన్సార్ లో ఉంటారని నా స్నేహితుడు చెప్పారు. ఒక్కొక్కసారి ఆయన కసార్ దేవికి కూడా వస్తూ ఉంటారని చెప్పారు.

ఆ వృద్ధుడు ఎవరో కాదు. ఇటలీలోని ఫ్లోరెన్స్‌కు చెందిన ప్రముఖ రచయత టిజియానో టార్జానీ. ఆయనతో మాట్లాడి ఉండాల్సిందని అనిపించింది. ఆయన జీవితపు చివరి రోజుల్లో జీవితపు రహస్యాన్ని తెలుసుకునేందుకు కసార్ దేవి బిన్సార్ వచ్చారు.

ఆయన 40 సంవత్సరాలు విలేఖరిగా ఉన్నారు. ఆసియా అంతా తిరిగిన ఈయన పుస్తకాలు కూడా రాశారు. ఆయన ఎక్కడున్నా ఆ ప్రాంతపు జీవన విధానం, ఆహారపు అలవాట్లు, స్థానిక దుస్తులు ధరించడం అలవాటు చేసుకున్నారు. ఆయన అద్భుతమైన రిపోర్టింగ్ చేసేవారు.

"రష్యన్ ఫెడరేషన్ విచ్చిన్నంపై ‘గుడ్ నైట్ మిస్టర్ లెనిన్’ అనే జీవిత చరిత్రను కూడా రాశారు. ఆయన శైలికి ఇదొక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. ఆయన రాసిన ఆఖరి పుస్తకం " ది ఎండ్ ఈజ్ మై బిగినింగ్" లో "నిజమైన గురువు ఈ అడవి, గుడిసె లేదా హిమాలయాల్లో మంచు పర్వతాల్లో లేదు. ఆయన మనలోనే ఉన్నారు" అని ఆయన కొడుకుకు చెబుతారు.

ఇంటర్నెట్‌లో పుకార్లు

గత కొన్నేళ్లుగా ఇంటర్‌నెట్ లో కసార్‌దేవి గురించి భిన్నమైన మాటలు వినిపిస్తున్నాయి. కసార్ దేవి భూమి పైనున్న భారీ అయస్కాంత క్షేత్రం పై ఉందని, దీనిని భూమికి వేన్ అల్లెన్ బెల్ట్" అని అంటారని నాసా చెబుతున్నట్లుగా ప్రచారం జరిగింది.

ఇక్కడున్న ప్రత్యేకమైన కాస్మిక్ ఎనర్జీ ఈ ప్రాంతమంతా ప్రసరిస్తుందని అంటారు. ఇలాంటి ఉదాహరణ ప్రపంచంలో మరో రెండు ప్రాంతాలు - ఇంగ్లాండ్ లోని స్టోన్ హెన్జ్, పెరూ లోని మచుపీచుకు మాత్రమే ఉందని చెప్పవచ్చు.

అయితే, దీని గురించి నాసా వెబ్‌సైటులో ఎక్కడా ప్రస్తావన లేదు. ఈ పుకారును ఎవరు లేవదీసారో కూడా తెలియదు. దీనిని కల్పించి, కొంచెం అతిగా చెప్పారు.

నేను గత 30 ఏళ్లుగా కసార్‌దేవికి వెళుతున్నాను. ప్రతీసారి గ్రామంలో వృద్ధులు, గ్రామస్థులు, పర్యటకుల నుంచి గతంలో ఎన్నడూ వినని ఏదో ఒక కొత్త కథను వింటూనే ఉంటాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)