జోషీమఠ్: భూమి కుంగిపోతూ, ఇళ్ళు బీటలు వారుతున్న చోట ప్రజలు ఎలా జీవిస్తున్నారు? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బద్రీనాథ్, ఔలి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, హేమ్‌కుండ్ లాంటి ప్రాంతాలకు ముఖద్వారంగా పిలిచే జోషీమఠ్ భవిష్యత్ ఏమిటి?

ఇక్కడ ఇళ్లు బీటలు వారాయి. బాధితులు తమకు ప్రభుత్వం సాయం చేయాలని ఎదురుచూస్తున్నారు. తమతోపాటు జోషీమఠ్ భవిష్యత్ ఏమిటని చాలా ప్రశ్నలు వారిని వెంటాడుతున్నాయి.

గత అక్టోబరులో జోషీమఠ్‌లో జీవించే సునయనా సకలానీ ఇంటికి మేం వెళ్లాం. అప్పుడే ఆమె ఇంటి గోడలకు పగుళ్లు కనిపించాయి.

జనవరి 2న ఇక్కడ చాలా మందిలానే తను కూడా ఏదో కుప్పకూలుతున్న శబ్దాన్ని విన్నానని సునయన చెప్పారు. ‘‘అంతా వణుకుతున్నట్లుగా అనిపించింది. ఉదయం అయ్యేసరికి అసలు ఎవరూ ఉండలేని పరిస్థితికి మా ఇల్లు వచ్చింది’’అని ఆమె చెప్పారు.

గత అక్టోబరులో జిల్లా పరిపాలనా విభాగం సాయం చేయాలని సునయన కుటుంబం అభ్యర్థించింది. కానీ, వారికి ఎలాంటి సాయం లభించలేదు. కానీ, ప్రస్తుతం ఇక్కడికి అధికారులు, రాజకీయ నాయకులు, మంత్రులు తరలివస్తున్నారు.

సునయన ఇంటి ముందు నిలబడి ఆమె తండ్రి దుర్గాప్రసాద్ మాట్లాడారు. ‘‘మా అమ్మాయికి ఏప్రిల్‌లో పెళ్లి చేయాలని భావించాం. అసలు మా ఇల్లు ఇలా అవుతుందని ఊహించుకోలేదు. ఇప్పుడు మాకు ఉండటానికి ఒక చోటు దొరికేవరకు మా అమ్మాయికి పెళ్లి చేయడం కుదరదు’’అని ఆయన చెప్పారు.

సమీపంలోని సుమేధా భాట్ ఇంటికి కూడా పగుళ్లు కనిపించాయి. జనవరి 2నాటి ఘటనతో తమ ఇల్లు ఎలా దెబ్బతిందో ఆమె మాకు చూపించారు. భయంతో తమ పిల్లలను దేహ్రాదూన్‌కు పంపించేశామని ఆమె వివరించారు.

భయానక దృశ్యాలు

దాదాపు ఇరవై వేల మంది నివసించే జోషీమఠ్‌లో ఇళ్ల గోడలకు పగుళ్లు రావడం ఇదేమీ కొత్తకాదు. కానీ, ఇప్పుడు ఇక్కడ నేల మీద కూడా భారీ పగుళ్లు కనిపిస్తున్నాయి.

‘‘జోషీమఠ్ నేల కుంగుతోంది. ఇక్కడ ఇళ్లు, భవనాలను కాపాడటం చాలా కష్టం’’అని దేహ్రాదూన్‌కు చెందిన జియాలజిస్టు డాక్టర్ ఎస్‌పీ సతి చెప్పారు.

‘‘నేను కాస్త కఠినంగా మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు చాలా మంది నేను చెప్పేది పట్టించుకోవచ్చు. కానీ, ఇలా జరగొచ్చని ఎప్పటినుంచో హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి’’అని ఆయన అన్నారు.

మరోవైపు జోషీమఠ్‌లో ఈ బీటలు భవిష్యత్‌లోనూ కొనసాగుతాయని భూకంపాలపై ఒక పుస్తకంరాసిన బెంగళూరుకు చెందిన జియాలజిస్టు సీపీ రాజేంద్రన్ చెప్పారు.

‘‘ఎంత భూమి కుంగుతుందని ఇప్పుడే చెప్పలేను. కానీ, ఇక్కడ నేల కుంగుతుంది. అన్ని భవనాలు కాకపోవచ్చు. కానీ, చాలా భవనాలు దెబ్బతింటాయి’’అని ఆయన వివరించారు.

జోషీమఠ్ ఎందుకు కుంగుతోంది?

అధికారిక లెక్కల ప్రకారం, జోషీమఠ్‌లో దాదాపు 1,800 భవనాలు ఉన్నాయి. 2011 గణాంకాల ప్రకారం ఇక్కడ 3900 కుటుంబాలు జీవిస్తున్నాయి.

కొండల్లోని రాళ్లు, మట్టి కుప్పకూలడంతో ఏర్పడిన నేలపై జోషీమఠ్ ఏర్పడిందని.. భారీగా నిర్మాణపు పనులు, జనాభా విపరీతంగా పెరగడం, డ్రైనేజీ వ్యవస్థలు లేకపోవడం లాంటి కారణాలతో ఇక్కడి నేల కుంగుతోందని నిపుణులు చెబుతున్నారు.

అయితే, జోషీమఠ్ భవిష్యత్‌ ప్రశ్నార్థకమంటూ జరిగే చర్చలతో స్థానికులకే నష్టం జరుగుతుందని అధికారులు అంటున్నారు.

‘‘హిమాలయాల సరిహద్దుల్లో పూర్తిగా విద్యుత్ సరఫరాలేని రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ మొదటి స్థానంలో ఉంటుంది. మిగతా హిమాలయ రాష్ట్రాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. కానీ, ఇక్కడ పరిస్థితి అలాకాదు. ఇక్కడ విద్యుత్ కొరత చాలా ఉంది. కానీ, రాష్ట్రాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు’’అని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కార్యదర్శి మీనాక్షి సుందరం ప్రశ్నించారు.

‘‘చైనా, నేపాల్, పాకిస్తాన్‌ ఇలా చోట్ల హిమాలయాలు ఉన్నాయి. అభివృద్ధి పనుల వల్లే పర్యావరణం దెబ్బతింటుంది అంటే, మొత్తం అన్నిచోట్లా ఈ పనులు నిలిపివేయాలి కదా?’’అని ఆయన ప్రశ్నించారు.

చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా మాట్లాడుతూ.. ‘‘మనం దీని గురించి ఎంత మాట్లాడుకుంటే, పర్యటకుల సంఖ్య అంత తగ్గిపోతుంది. మొత్తంగా ఈ ప్రభావం స్థానికులపైనే పడుతుంది. అసలు మొత్తం ప్రాంతమంతా కుంగుతుందని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు ఉండాలి’’అని అన్నారు.

ఇటీవల జోషీమఠ్ కుంగిపోతోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఓ నివేదికలో తెలిపింది. దీనిపై హిమాన్షు మాట్లాడుతూ.. ‘‘అధికారికంగా మాకు ఆ నివేదిక అందలేదు. ఒకవేళ మాకు వస్తే, ఏం చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తాం. ఇక్కడ ఇస్రో నిపుణులతోపాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నిపుణుల అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోవాలి’’అని ఆయన అన్నారు.

జనవరి 2న ఏం జరిగింది?

జనవరి 2వ తేదీన రాత్రి ఏం జరిగిందనే అంశంపై ఇక్కడ చాలా మంది మాతో మాట్లాడారు.

జోషీమఠ్‌కు జయ్‌పీ పవర్ ప్లాంట్‌కు సమీపంలోనే కంపెనీ ఉద్యోగులు, ఇంజినీర్లు నివసిస్తున్నారు. ఏడాది క్రితం అక్కడ కూడా బీటలు కనిపించాయి. అయితే, ఇక్కడి భవనాలతోపాటు మెస్‌లోనూ జనవరి 2న భారీ పగుళ్లు వచ్చాయి.

ఇక్కడి బ్యాడ్మింటన్ కోర్టు మధ్యలో భారీగా నేల కుంగిపోయింది. మైదానంలో ఒక భాగం ఎగువకు, మరోభాగం దిగువకు అయిపోయింది.

జనవరి మధ్యాహ్నం 12.30 గంటలకు కొండలపై నుంచి ఇక్కడకు బురదనీరు రావడం మొదలైంది. ఇప్పటికీ ఆ నీరు వస్తూనే ఉంది. అసలు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తోందో ఎవరికీ తెలియడం లేదు.

ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ విభాగం కార్యదర్శి డాక్టర్ రంజిత్ కుమార్ సిన్హా కూడా ఇక్కడి నేల కుంగిపోయిన స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ‘‘ఇక్కడ బీటలు ఇంకా పెరుగుతున్నాయా? కొత్త ప్రాంతాలకూ ఇవి విస్తరిస్తున్నాయా?’’లాంటి అంశాలు పరిశీలించేందుకు తాము ఇక్కడికి వచ్చినట్లు ఆయన చెప్పారు.

ఈ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చిన జియాలజిస్టు డాక్టర్ స్వప్నమితా వైదీశ్వరణ్ కూడా వచ్చారు. ఆమె కూడా మాతో మాట్లాడారు.

‘‘ఇక్కడ సమస్య ఏమిటంటే, క్షేత్రస్థాయిలో సమాచారం మనకు అందడం లేదు. ఇక్కడ కొత్తగా కూడా నేల బీటలు వారింది. ఇక్కడ ప్రకంపనలు ఎలా వస్తున్నాయో పరిశీలించేందుకు కొన్ని పరికరాలు ఏర్పాటుచేయాలని భావిస్తున్నాం. డేటాను పరిశీలిస్తేనే అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది’’అని ఆమె వివరించారు.

అయితే, ఇక్కడి నేలపై భారం తగ్గించాల్సిన అవసరముందని డాక్టర్ స్వప్నమిత్ర చెప్పారు.

పరిస్థితికి ఎన్‌టీపీసీనే కారణమా?

జనవరి 2 ఘటన తర్వాత ఎన్‌టీపీసీపై జోషీమఠ్ వాసుల్లో ఆగ్రహం ఎక్కువైంది. ‘‘ఎన్‌టీపీసీ గో బ్యాక్’’ పేరుతో రాసిన పేపర్లు వాహనాలు, ఇళ్ల గోడలపై కనిపించాయి.

సంస్థ నిర్మిస్తున్న ఒక సొరంగమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.

జోషీమఠ్ బచావో సంఘర్ష్ సమితి కన్వీనర్ అతుల్ సతి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ విధ్వంసానికి ఎన్‌టీపీసీనే కారణం. ఇక్కడ అందరికీ వారు పరిహారం చెల్లించాలి’’అని అన్నారు.

అయితే, ఈ ఆరోపణలను ఎన్‌టీపీసీ ఖండిస్తోంది. ‘‘మేం నిర్మిస్తున్న సొరంగం జోషీమఠ్ కింద నుంచి వెళ్లడం లేదు. నగరానికి ఒక కి.మీ. దూరం నుంచి ఆ సొరంగం వెళ్తోంది’’అని సంస్థ బీబీసీకి తెలిపింది.

మరోవైపు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ మాట్లాడుతూ.. జోషీమఠ్‌లో నేల కుంగడానికి, ఎన్‌టీపీసీకి ఎలాంటి సంబంధమూలేదని అన్నారు.

ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ విభాగం కార్యదర్శి డాక్టర్ రంజిత్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. ‘‘అటు ఎన్‌టీపీసీ, ఇటు విద్యుత్ మంత్రిత్వ శాఖ.. రెండింటికీ ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలని సూచించాం. ప్రజల్లో భయాందోళనలు మనం తొలగించాలి’’అని ఆయన అన్నారు.

‘‘ప్రజల్లో చాలా మంది దీనికి అదే కారణం అని చెబుతూ ఉండొచ్చు. కానీ ఎవరూ ఆధారాలతో రావడం లేదు. అందుకే దీనిపై విచారణ చేపట్టాలని మేం సూచించాం’’అని ఆయన చెప్పారు.

ప్రస్తుతం నగరం మధ్యలోని ఒక హోటల్ చాలా ప్రమాదకరంగా మారింది. దీన్ని కూలగొట్టేందుకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఇక్కడికి సమీపంలో నిర్మిస్తున్న ఇళ్లు కూడా ప్రమాదకరంగా ఉన్నాయి. అక్కడ కూడా పనులు నిలిపివేశారు.

హోటళ్లు, గురుద్వారాల్లో ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. ఎన్నిరోజులు అక్కడ ఉండాలో ప్రజలకు తెలియడం లేదు.

‘‘ఐదు ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు’’

ఇక్కడి నుంచి తరలిస్తున్న ప్రజలను ఐదు ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు డాక్టర్ రంజిత్ కుమార్ సిన్హా చెప్పారు.

‘‘జియోలాజికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (జీవోఐ) ఇప్పటికే నాలుగు చోట్ల సర్వే చేపట్టింది. మరోచోట కూడా సర్వే జరుగుతోంది. రెండు రోజుల్లో ఈ సర్వే పూర్తవుతుంది. ప్రస్తుతానికి మేం తాత్కాలిక శిబిరాలు ఏర్పాటుచేస్తున్నాం’’అని బీబీసీతో ఆయన చెప్పారు.

‘‘అక్కడ కూడా మేం మూడు రకాల షెల్టర్లను ఏర్పాటుచేస్తున్నాం. ప్రజలు వచ్చి వాటిని చూడనివ్వండి. వారికి అవి నచ్చితే పర్వాలేదు. లేదంటే కొత్తవి ఏర్పాటుచేస్తాం’’అని ఆయన వివరించారు.

ఎంతమంది కోసం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు? అని అడిగినప్పుడు.. ‘‘ప్రస్తుతం మేం 500 నుంచి 600 షెల్టర్లు ఏర్పాటుచేస్తున్నాం. కావాలంటే ఇంకా నిర్మిస్తాం’’అని ఆయన తెలిపారు.

‘‘2013లో కేదార్‌రాథ్ వరదల తర్వాత రెండేళ్లపాటు పర్యటకంపై తీవ్రమైన ప్రభావం పడింది. బహుశా కేదార్‌నాథ్‌లోనే వరదలు వచ్చి వచ్చుండొచ్చు. కానీ, మసూరీకి కూడా ప్రజలు రావడం మానేశారు. అందుకే ప్రస్తుతం ఈ విషయంపై మీడియాలో ప్రమాదకర శీర్షికలతో వార్తలు పెట్టొద్దని అభ్యర్థిస్తున్నా’’అని మీనాక్షి సుందరం అభ్యర్థించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పర్యటకం వాటా 12 నుంచి 16 శాతం వరకూ ఉంటుందని దూన్ యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగం అధిపతి రాజేందర్ పీ మమగైన్ చెప్పారు. ‘‘జోషీమఠ్‌లో నేల కుంగడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, స్థానిక ఆర్థిక పరిస్థితులు మాత్రం తీవ్రంగా ప్రభావితం అవుతాయి’’అని ఆయన చెప్పారు.

ఇక్కడ ప్రభావితమైన అందరినీ ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని పరిపాలనా విభాగం చెబుతోంది. అయితే, ఈ హామీ ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)