You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, ధన్నీపూర్‌లో మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చాయంటే... గ్రౌండ్ రిపోర్ట్
- రచయిత, అనంత్ ఝణాణె
- హోదా, బీబీసీ ప్రతినిధి, అయోధ్య నుంచి
2019 నవంబర్ 9నాటి సుప్రీం కోర్టు తీర్పు అయోధ్య రామమందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.
నాటి తీర్పులో సుప్రీం కోర్టు మసీదు నిర్మాణానికి గానూ ముస్లింలకు 5 ఎకరాల భూమిని ఇవ్వాలని ఆదేశించింది. అయోధ్యకు 26 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్ అనే గ్రామంలో మసీదు నిర్మాణం కోసం భూమిని కేటాయించారు.
అక్కడ మసీదు నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి? అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఎప్పటివరకు పూర్తవుతుందో తెలుసుకోవడం కోసం బీబీసీ బృందం ధన్నీపూర్‌కు వెళ్లింది.
అనుమతుల కోసం ఎదురుచూపులు
ధన్నీపూర్‌లో భూ సంరక్షకుడు సోహ్రాబ్ ఖాన్‌ను మేం కలిశాం. మసీదు నిర్మాణం కోసం కేటాయించిన అయిదు ఎకరాల భూమిని ఆయన మాకు చూపించారు. ''ఇదే ఆ అయిదు ఎకరాల స్థలం. ఇది మొత్తం ట్రస్టు భూమి. మసీదు నిర్మాణం, నక్షా (మ్యాప్) దగ్గరే ఆగిపోయింది. అభివృద్ధి సంస్థ ఈ నక్షాను జారీ చేయాల్సి ఉంటుంది. ఎన్‌ఓసీ ఇవ్వడంలో ఏవో ఇబ్బందులు తలెత్తాయి. త్వరలోనే ఇది పూర్తవుతుందని ఆశిస్తున్నా'' అని ఆయన చెప్పారు.
కాగితాలపై రాసుకున్న ప్రాజెక్టు ప్రకారం, 23,507 చదరపు మీటర్ల భూమిలో ఒక మసీదు, ఆసుపత్రి, దాని బేస్‌మెంట్, ఒక మ్యూజియం, ఒక సర్వీస్ బ్లాక్‌ను నిర్మించాలి.
ఆసుపత్రిలో 200 పడకలు ఏర్పాటు చేయాలి. మసీదులో 2000 మంది ప్రార్థనలు చేసేలా ఉండాలి. 1857 స్వాతంత్ర్య పోరాటం థీమ్‌తో మ్యూజియంను నిర్మించాలి. దాన్ని మౌల్వీ అహ్మదుల్లా షాకు అంకితం చేయాలి.
ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక దర్గా కూడా ఉంది.
ఆ భూమికి చెందిన ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్, మ్యాపులను తయారు చేసి వాటిని 'అయోధ్య అభివృద్ధి సంస్థ'కు సమర్పించారు.
కానీ, కోవిడ్ వల్ల ఆరంభంలోనే ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత అధికారులు, ఎన్‌వోసీ కావాలని అడిగారు. ఇప్పుడు ట్రస్టుకు ఎన్‌వోసీ ఇవ్వాలి. ఇక్కడ మరో సవాలు ఏంటంటే, 5 ఎకరాల భూమికి కేవలం 4 మీ. వెడల్పు కలిగిన దారి ఉంది. దాన్ని మరింత విస్తరించాలి. అయితే, ఆ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి.
ప్రాజెక్టు ఫండింగ్
ఈ నిర్మాణ పనుల కోసం ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ మసీదు ట్రస్ట్ ఇప్పటిరకు రూ. 35 లక్షలు సేకరించింది. ఆ ప్రాంత ప్రజలే మసీదును నిర్మించాలని ఇస్లాం చెబుతుంది. మసీదు నిర్మాణం కోసం కొంతమంది నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని ఫౌండేషన్ తెలిపింది.
ఇప్పటివరకు పెద్దగా నిధులు పోగు కాలేదు. రెండు నెలల క్రితం ఫరూఖాబాద్‌లో డబ్బుల సమీకరణకు ప్రయత్నించి రూ. 10 లక్షలు సేకరించారు. నిర్మాణ పనులకు అన్నిఅనుమతులు లభించిన తర్వాత దేశవ్యాప్తంగా నిధుల సేకరణ కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తామని ట్రస్ట్ చెబుతోంది.
ధన్నీపూర్‌లో రూ. 300 కోట్లతో రెండు దశల్లో నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదించారు.
తొలి దశలో ఆసుపత్రిలో కొంతభాగం, మసీదు, కల్చరల్ సెంటర్, ఒక గ్రీన్ బెల్ట్ నిర్మాణం జరపాలి. రెండో దశలో ఆసుపత్రి విస్తరణ పనులు చేపట్టాలి. వీటి కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేసే యోచనలో ఉన్నారు.
అధికారుల నుంచి అనుమతులు వచ్చిన రెండేళ్లలో మొదటి దశ పనులు పూర్తవుతాయని ట్రస్టు అంచనా వేస్తోంది.
మరో రెండు వారాల్లో అనుమతులు వస్తాయి, తర్వాత నిర్మాణ పనులు మొదలుపెట్టొచ్చని ట్రస్టు కార్యదర్శి అథర్ హుస్సేన్ ఆశిస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో మ్యూజియం నిర్మాణం ఒక కీలక భాగం. రామ మందిరం నిర్మాణం, దానితో ముడిపడిన ఘటనల వల్ల సమాజంలో చీలిక వాతావరణం నెలకొందని ట్రస్ట్ అభిప్రాయపడింది.
1857 నాటి తొలి స్వాతంత్ర్య పోరాటం హిందూ-ముస్లిం ప్రజల ఉమ్మడి పోరాటమని ట్రస్ట్ విశ్వసిస్తుంది. ఆ వాతావరణాన్ని మ్యూజియంలో ప్రదర్శించాలని ట్రస్ట్ కోరుకుంటోంది.
లఖ్‌నవూలోని చిన్హట్‌లో యుద్ధానికి నాయకత్వం వహించి బ్రిటిష్ వారిని ఓడించిన అవధ్ మౌల్వీ అహ్మదుల్లా షాకు ఈ మ్యూజియాన్ని అంకితం చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది.
'రెండు నిర్మాణాలను పోల్చడం సరికాదు'
మసీదు నిర్మాణ పనులు, దానితో ముడిపడిన సవాళ్లను బాగా అర్థం చేసుకోవడానికి మేం ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ మసీద్ ట్రస్ట్ లక్నో కార్యాలయానికి కూడా వెళ్లాం.
అక్కడ ట్రస్ట్ కార్యదర్శి అథర్ హుస్సేన్ దీని గురించి బీబీసీతో మాట్లాడారు.
"మొదటగా నేనొక విషయం చెప్పాలనుకుంటున్నా. రామ మందిరాన్ని, మసీదు కోసం ఇచ్చిన ఈ 5 ఎకరాల భూమిని పోల్చడం సరికాదు. అలా పోల్చాల్సిన అవసరం కూడా లేదు. రామ మందిరం, దానికి సంబంధించిన ఏర్పాట్లు చాలా ముందు నుంచే చేస్తున్నారు. మసీదు కోసం 5 ఎకరాల భూమి ఇస్తున్నట్లు 2019 నవంబర్‌లో చెప్పారు.
మరో ఏడాది తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు. రామమందిరం కోసం జరుగుతోన్న ప్రచారం లేదా ఉత్సాహం ఈ ప్రాజెక్టులో అసలు కనిపించదు. ఇక్కడ ఒక స్వచ్ఛంద ఆసుపత్రిని కట్టడమే మా లక్ష్యం. మసీదు కోసం భూమిని కేటాయించారు కాబట్టి మసీదును నిర్మించాల్సిందే. 1857 సంగ్రామానికి అంకితం ఇవ్వడానికి ఒక మ్యూజియంను నిర్మిస్తాం'' అని ఆయన చెప్పారు.
ధన్నీపూర్ కూడా అయోధ్య తరహాలో అభివృద్ధి కేంద్రంగా మారగలదా? అని మేం ధన్నీపూర్‌లో సంరక్షకుడు సోహ్రాబ్ ఖాన్‌ను అడిగాం.
దానికి ఆయన సమాధానం ఇచ్చారు. "ఇక్కడికి వచ్చే మీడియా వారు, చాలామంది ప్రజలు, బయటి నుంచి ఈ ప్రాంతానికి వచ్చే ప్రజలు ఒకే ప్రశ్న అడుగుతుంటారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తుంటారు. అక్కడ అయోధ్య నగరంలో అభివృద్ధి గంగ ప్రవహిస్తుంది. కానీ, ఇక్కడ ఆ గంగలో నుంచి ఒక్క ధార కూడా కురవలేదు'' అని ఆయన ఉదహరించారు.
అయోధ్య తరహాలోనే ఇక్కడికి కూడా వేల సంఖ్యలో జనాలు వస్తారా? అని అడిగితే... ''వేలల్లో, లక్షల్లో ప్రజలు ఇప్పుడేం రావట్లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మధ్య మధ్యలో ప్రజలు వస్తూనే ఉన్నారు'' అని చెప్పారు.
ధన్నీపూర్ మసీదు గురించి అయోధ్య ముస్లింలు ఏమంటున్నారు?
ధన్నీపూర్ గురించి అయోధ్య ముస్లింలు ఏం అనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం అయోధ్యలోని చోటి కోఠియాకు మేం వెళ్లాం. అక్కడ బాబ్రీ మసీదు కేసుతో సంబంధం ఉన్న ఇక్బాల్ అన్సారీని కలిశాం.
''మసీదు కోసం ఇచ్చిన 5 ఎకరాల భూమితో బాబ్రీ మసీదు కేసులో ఉన్నవారెవరికీ ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. ఆ భూమిని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ఇచ్చారు. అక్కడ ఏదైనా కట్టుకోవచ్చు. అది వారి ఇష్టం. అయోధ్యలో ముస్లింలు కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. ఇప్పుడు మేం దాని గురించి పట్టించుకోవడం లేదు. మసీదును నిర్మించాలనుకునేవారు నిర్మించుకోవచ్చు'' అని ఆయన చెప్పారు.
సమీపంలోని ఒక దుకాణం వద్ద కూర్చున్న 62 ఏళ్ల షఫీవుల్లా మాట్లాడుతూ.. ‘‘మసీదు కోసం స్థలం ఇచ్చారు. కానీ ఇంతవరకు దాన్ని చూడలేదు'' అని అన్నారు.
ధన్నీపూర్ గురించి ఆయనను మేం అడిగినప్పుడు...''అవును ధన్నీపూర్‌లో భూమి ఇచ్చారు. అక్కడేదో గొడవ జరుగుతుందట. దాని గురించి నాకేం తెలియదు'' అని అన్నారు.
అటుగా వెళ్తున్న 25 ఏళ్ల పర్వేజ్ ఆలమ్‌తో మేం మాట్లాడాం. ''ధన్నీపూర్ పేరును వార్తల్లో విన్నా. మసీదు కోసం ధన్నీపూర్‌లో భూమిని కేటాయించారు. కానీ, దాని నక్షకు ఇంకా అనుమతులు రాలేదని వార్తల్లో చెప్పడం విన్నాను'' అని ఆయన మాతో అన్నారు.
రామ మందిరం నిర్మాణం ఎంత వేగంగా జరుగుతోంది?
రామమందిరం నిర్మాణం ఎంత వరకు వచ్చింది? ఇంకా చేయాల్సిన పనులు ఏంటి? అనే వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ఒక యానిమేషన్ వీడియో చూపిస్తోంది.
ఆ వీడియో ప్రకారం చూస్తే,
- 2021 జనవరిలో మందిర నిర్మాణం కోసం తవ్వకాలు మొదలుపెట్టారు
- 2021 మార్చిలో తవ్వకం పనులు పూర్తయ్యాయి
- 2021 ఏప్రిల్‌లో ఫౌండేషన్ ఫిల్లింగ్ వర్క్ మొదలైంది
- 2021 సెప్టెంబర్‌లో ఫిల్లింగ్ వర్క్ ముగిసింది
- 2021 సెప్టెంబర్‌లో టవర్ క్రేన్ ఏర్పాటు చేశారు.
- సెప్టెంబర్‌లోనే రాఫ్ట్ వర్క్ మొదలు పెట్టారు
- నవంబర్‌లో రాఫ్ట్ వర్క్ పూర్తయింది
- 2021 నవంబర్‌లో శంకుస్థాపన పనులు ప్రారంభం అయ్యాయి
- మార్చిలో శంకుస్థాపన పనులు ముగిశాయి
- 2022 జనవరిలో ఆలయ స్తంభాలను ఏర్పాటు చేసే పనులు మొదలుపెట్టారు
- తర్వాత బీమ్‌ల కోసం రాళ్లు వేయడం మొదలుపెట్టారు
- తర్వాత స్లాబ్ స్టోన్
- మందిరం పైకప్పు, గోపురం పనులు 2023 ఆగస్టులో పూర్తవుతాయి
మందిరం ఎత్తును 141 అడుగుల నుంచి 161 అడుగులకు పెంచినట్లు అర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపురా తెలిపారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
అదనంగా మరో మూడు గోపురాలను జోడించారు. స్తంభాల సంఖ్యను 160 నుంచి 366కి పెంచారు.
రామ మందిరం నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది?
దీని గురించి తెలుసుకోవడం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కార్యదర్శి చంపత్ రాయ్‌తో మాట్లాడాం. ''దేవుడి ఇల్లుకి ఎంత ఖర్చు అవుతుందో ఎవరికి తెలుసు. రాముడు రాజులకే రాజు. కాబట్టి ఖర్చుకు సంబంధించిన ఆలోచనే చేయట్లేదు. సరే రూ. 1800 కోట్ల వరకు ఖర్చు అయిందని అనుకోండి. ఇంకా ఎక్కువ కూడా అయ్యుండొచ్చు లేదా తక్కువ కూడా కావచ్చు. ఇక్కడ లెక్కలు వేయడం అర్థరహితం'' అని అన్నారు.
మందిర నిర్మాణ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి?
''ఇంజినీరింగ్ పనుల్లో పర్సంటేజీ ప్రకారం పనులు ఎంతవరకు వచ్చాయో చెప్పలేం. కానీ, మొత్తం జరిగిన పనిని చూస్తే 40 శాతం పనులు పూర్తయినట్లు పరిగణించవచ్చు. రాతి పనులు పూర్తయ్యాయి. వాటిని అమర్చడం మిగిలి ఉంది.
పీఠాన్ని నిర్మించారు. చాలా వరకు పనులు జరిగాయి. వచ్చే ఏడాది నాటికి గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తిగా అయిపోతాయి. పూర్తిగా అంటే 350 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు 20 అడుగుల ఎత్తుకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. గ్రౌండ్ ఫ్లోరింగ్ అనేది చాలా పెద్ద పని'' అని చంపత్ రాయ్ చెప్పారు.
మందిర నిర్మాణంలో ఎంత రాయిని ఉపయోగించారు? ఎక్కడి నుంచి రాయిని తీసుకువస్తున్నారు?
''తెలంగాణ, కర్ణాటక నుంచి గ్రానైట్ తెప్పిస్తున్నాం. 17000 గ్రానైట్ ఫలకాలు వస్తున్నాయి. ఒక్కొక్కటి 5 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు ఉంటుంది. రాజస్తాన్‌లోని భరత్‌పూర్ జిల్లా నుంచి గులాబీ రాయిని, మక్రానా నుంచి తెలుపు మార్బుల్‌ని తీసుకువస్తున్నారు'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రిషి సునక్: భారత్‌ను ఏలిన బ్రిటన్‌కు ప్రధాని అయిన రిషి గురించి ప్రజలు ప్రైవేటుగా ఏమనుకుంటున్నారు?
- రిషి సునక్ భార్య అక్షత మూర్తి ఎవరో తెలుసా?
- విరాట్ కోహ్లీ 'అహంకారి' అని వ్యాఖ్యానించిన ఆస్ట్రేలియా మీడియా తీరు మారిందా?
- రిషి సునక్: బ్రిటన్ చరిత్రలో మొట్టమొదటి హిందూ ప్రధాన మంత్రి - జీవిత ప్రస్థానం ఫొటోల్లో
- మునుగోడు: మద్యం, డబ్బు ఏరులై పారుతోన్న ఈ నియోజకవర్గంలో... ఏళ్లుగా నీళ్లు రావడం లేదెందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)