You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అయోధ్య: విశాలమైన రామ మందిర నిర్మాణం ఒకవైపు, శిథిల ఆలయాలు మరోవైపు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక శీతాకాలపు ఉదయం.. అయోధ్యలో సరయు నది తీరాన 'రాం కీ పైడీ' వద్ద భక్తులు గుమికూడి ఉన్నారు. నదిలో మునకవేస్తూ, ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కరిస్తున్నారు. తరువాత, నడుచుకుంటూనే ఊర్లోకి వెళుతున్నారు.
సరయు నది ఒడ్డున ఉన్న ఘాట్‌ల వరుసను 'రాం కీ పైడీ' అంటారు.
ఇక్కడకు కొద్ది దూరంలోనే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది. అయోధ్యకు వచ్చే భక్తులందరూ క్యూలు కట్టి రాముడిని దర్శిస్తుంటారు.
రాం కీ పైడీ వద్ద డజన్ల కొద్దీ దేవాలయాలు ఉన్నాయి. ఒక 'పురాతన సరయు దేవాలయలం'లో ఒక మహిళ హారతి ఇస్తున్నారు. ఆమె, ఆ మందిరంలో ప్రధాన అర్చకురాలు మహంత్ సుమన్ పాఠక్.
సుమన్ పాఠక్ కుటుంబం తరతరాలుగా ఈ దేవాలయం బాగోగులు చూసుకుంటూ ఇక్కడ పూజలు, అర్చనలు నిర్వహిస్తున్నారు.
"ఈరోజుల్లో కంటికి కనిపించే దానికే మార్కెట్లో గిరాకీ ఉంటుంది. అందరూ గొప్పల కోసం పాకులాడుతున్నారు తప్పితే భగవంతుడి మీద భక్తి కాదు" అని ఆమె అన్నారు.
సుమన్ చెబుతున్న గొప్పలేమిటో రాం కీ పైడీ దగ్గర స్పష్టంగా కనిపిస్తోంది.
2017లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తర్ ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తరువాత రాం కీ పైడీ దగ్గర ఉన్న ఘాట్‌లు, పెద్ద పెద్ద దేవాలయాలకు మరమ్మత్తులు చేయించి, రంగులు వేయించారు.
అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపావళి నాడు ఇక్కడ దీపోత్సవం జరుపుతున్నారు. ఆరోజు లక్షల్లో దీపాలు సరయూ నదిలో తేలుతూ కనిపిస్తాయి.
'ప్రసాదం లేకపోతే నీళ్లు తాగి పడుకుంటాం'
రాం కీ పైడీ ఎదురుగా అనేకే సందులు కనిపిస్తాయి. ఏ సందు పట్టుకున్నా ఊర్లోకి వెళతాం. ఒక సందులో 'భాగల్పూర్ మందిర్' ఉంది. ఆ ఆలయం గేటు శిథిలావస్థలో ఉంది. లోపలికెళితే పూజారి అయోధ్య దాస్ కనిపించారు.
"ఇది 150 ఏళ్ల నాటి గుడి. గతంలో 200 నుంచి 300 మంది భక్తులు ఈ దేవాలయానికి వచ్చేవారు. ఇక్కడ బస చేసేవారు. ఇప్పుడు మేం ముగ్గురమే మిగిలాం. బావి ఎండిపోయింది. చాలాచోట్ల పైకప్పు ఊడిపడుతోంది. భక్తులు రావట్లేదు. మాకెంత వరకు వీలవుతుందో అంతవరకు బడి నడిపిస్తున్నాం. ఎంత ఉంటే అంతలోనే గడుపుతున్నాం. నైవేద్యం పెట్టలేకపోతే.. నీళ్లతోనే కడుపు నింపుకుంటున్నాం" అని ఆయన చెప్పారు.
బాబ్రీ మసీదు, రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత అయోధ్య నడిబొడ్డున విశాలమైన రామ మందిర నిర్మాణాన్ని చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు కోట్లాది రూపాయల విరాళాలు అందించారు.
అయితే, ఇదే అయోధ్యలో మరో 175 దేవాలయాలు శిథిలావస్థలో పడిఉన్నాయి. వాటిని పట్టించుకునేవాళ్లే లేరు.
నగరంలో పతనావస్థలో ఉన్న 177 భవనాలను కూల్చివేయాలని లేదా మరమ్మత్తులు చేయించాలని 2018లో అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ఈ 177లో చాలా పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి.
అయోధ్యలో 6000 దేవాలయాలు ఉన్నాయన్న వాదన
హిందువులకు అయోధ్య చాలా పవిత్రమైన స్థలం. ఇది రాముడు పుట్టిన నేల అన్నది వారి విశ్వాసం. రాజులు, చక్రవరుల నుంచి అవధ్ నవాబుల వరకు ఎంతోమంది ఇక్కడ అనేక ఆలయాలు కట్టించారు.
"స్కంద పురాణంలోని అయోధ్య మహత్యం లేదా బ్రిటిష్ గెజిటీర్ పరిశీలిస్తే ఇక్కడ 6,000 దేవాలయాలు ఉన్నాయన్నది లెక్క. లేదా వందో రెండొందలో తక్కువ ఉండొచ్చు. వివిధ కులాలకు చెందిన ఆచారాల ప్రకారం నిర్మిచిన మందిరాలు ఉన్నాయి. ప్రతీ రెండో ఇల్లూ రాముడికి పూజనలు, అర్చనలు నిర్వహించే దేవాలయమే. గుడి అంటే ప్రత్యేకంగా కనిపించేది మాత్రమే కాదు. ఒక ప్రాంగణం, దానికో పైకప్పు, అందులో నలుగురు మనుషులు నివసిస్తూ, సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తూ ఉంటే అది దేవాలయమే" అని దాదాపు రెండు దశాబ్దాలుగా అయోధ్యపై పరిశోధనలు చేస్తున్న రచయిత, చరిత్రకారుడు యతీంద్ర మిశ్రా వివరించారు.
ఈ నగర విశ్వాసం అచంచలమైనప్పటికీ దాని హృదయం బీటలు వారుతోంది. వందల కొద్దీ దేవాలయాలు ఇప్పుడు పతనావస్థకు చేరుకున్నాయి. ప్రజల ఆశలు కూడా సన్నగిలుతున్నాయి.
రాం కీ పైడీకి కొద్ది దూరంలో 'నయా ఘాట్' ఉంది. ఇక్కడ పలు అఖాడాలు, మందిరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి కర్తాలియా బాబా ఆశ్రమం, దీనికి రాం దాస్ మహంత్‌గా ఉన్నారు.
"నోటీసులు జారీ చేసిన ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటి బాగోగులు చూసేవారే లేరు. ద్వారాలు విరిగిపోయి, పైకప్పు పడిపోతూ జీర్ణావస్థలో ఉన్నాయి. అవన్నీ త్వరలో అంతమైపోతాయి. ఈ నేల ప్రాచీనత ఇక్కడున్న మఠాలు, మందిరాల్లో ఉంది" అని ఆయన అన్నారు.
'ఈ మందిరంలో కూడా సీతారాములు ఉన్నారు'
ఇక్కడున్న దేవాలయాల పూజారులు, మఠాల మహంతులు వాటిని పునరుద్ధరించే స్థితిలో లేరు. ప్రభుత్వం గ్రాంటు మంజూరు చేసి వీటికి మరమ్మతులు చేయించాలని కొందరు భావిస్తున్నారు.
స్వర్గద్వార్ సమీపంలోని ఒక ఆలయంలో రెండస్తులు గత పదేళ్లల్లో కూలిపోయాయి. బయట గేటు దగ్గర మహంత్ కేశవ దాస్ కలిశారు.
"అన్ని చోట్లా దేవుడు ఒక్కడే. కానీ అక్కడ దేవుడు ఎక్కువగా కనిపిస్తాడు. మిగతాచోట్ల దేవుళ్లకు గౌరవం లేదు. భగవంతుడు అంతటా ఒకే రూపంలో ఉంటాడు కదా. అన్నిచోట్లా సీతారాములే ఉంటారు. కానీ అక్కడ కోట్ల రూపాయల సీతారాములు ఉంటే ఇక్కడ ఎనిమిది అణాల సీతారాములు ఉన్నారు" అని రామ మందిర నిర్మాణం వైపు వెళుతున్న భక్తులను చూపిస్తూ కేశవ దాస్ అన్నారు.
రామ మంది నిర్మాణం, దీపోత్సవం హంగుల మాయలో పడి, అయోధ్యకు ప్రత్యేకమైన ప్రాచీన వారసత్వ సంపదను తుంగలో తొక్కేస్తున్నారని స్థానికులు భావిస్తున్నారు.
"ఇక్కడ బ్రహ్మాండంగా దీపోత్సవం జరుగుతుందన్నదే కనిపిస్తుంది కానీ, ఇదే నేలపై అనేక ఇతర దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయన్నది మాత్రం కనిపించదు. ఇవి మాత్రం ఆలయాలు కావా? మేం ఈ అయోధ్యవాసులం కామా? కానీ, అవేమీ చూడరు. దీపోత్సవం ఒక బూటకం. ఓటు బ్యాంకు కోసం చేస్తున్నది. మనం ఓటు బ్యాంకులో జీవిస్తున్నాం" అని మహంత్ సుమన్ పాఠక్ అన్నారు.
'మంచి జరగాలంటే త్యాగం చేయాల్సిందే '
"ప్రాచీన వారసత్వాన్ని కాపాడాలి. కానీ, ప్రజల రక్షణ కూడా అవసరం" అని అయోధ్య స్థానిక ప్రభుత్వం అంటోంది.
"అభివృద్ధి జరిగితే మార్పులు వస్తాయి. అది అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. పాత దేవాలయాలు పడిపోతుంటే ప్రజల ప్రాణానికీ ముప్పు. ఇది ఏకపక్ష నిర్ణయం కాదు. ఏదైనా మంచి జరగాలంటే కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మార్పు వస్తుంది" అని అయోధ్య అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అంకితా శుక్లా అన్నారు.
అయోధ్యలో అనేక దేవాలయాలు, ధర్మశాలలు చాలాకాలంగా కిరాయిదారుల చేతుల్లో ఉన్నాయి. శిథిలమవుతున్నవాటికి మరమ్మత్తులు చేయించడం తగ్గింది.
యజమానులు, కిరాయిదారుల మధ్య కోర్టు గొడవల వలన కూడా ఈ దేవాలయాలు జీర్ణావస్థకు చేరుకున్నాయని స్థానికులు అంటున్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం రామ మందిర నిర్మాణాన్ని "స్వర్ణాధ్యాయం"గా, "చారిత్రక విజయంగా" అభివర్ణిస్తోంది. కానీ, అదే నగరం నుంచి మరో కోణం కూడా తెర పైకి వస్తోంది.
ఆధునీకరణ వలన దుకాణాలు కోల్పోతున్నారు
కొత్తగా కడుతున్న రామ మందిరానికి వెళ్లే రహదారులను 18 అడుగుల వెడల్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వ్యతిరేకత వస్తోంది.
అయోధ్య పురాతన నగరమే కాక జనసాంద్రత అధికంగా ఉన్న ప్రదేశం. ఇప్పుడు ఈ రహదారులను వెడల్పు చేసే ప్రక్రియలో భాగంగా రోడ్లకు ఇరు వైపుల్లా ఉన్న చిన్న చిన్న దుకాణాలు, ఆలయాలు లేదా ఇంటి ప్రహారీ గోడలను కూల్చివేస్తారు. అయితే, వీరికి నష్టపరిహారం చెల్లించి, వేరేచోట స్థలాలను కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
కాగా, సుమారు 1,200 కుటుంబాలు ఈ స్థానభ్రంశం పట్ల అసంతృప్తితో ఉన్నాయి. 52 ఏళ్ల రంభా దేవికి ఒక గుడి ముందు పూజా సామాగ్రని అమ్మే చిన్న దుకాణం ఉంది. దాన్ని తొలగించాలని ఆమెకు నోటీసులు అందాయి.
"నాకు ఈ దుకాణమే జీవనాధారం. మా పిల్లలిద్దరూ కూలి పనులకు వెళుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నాకు వేరే చోట స్థలం ఇప్పించినా, అక్కడకు భక్తులు వస్తారా, రారా అనే సందేహం తొలుస్తోంది. ఇక్కడైతే రామ మందిరానికి వెళ్లే భక్తులంతా ఇటు నుంచే వెళతారు. మాకు గిరాకీ ఉంటుంది. మమ్మల్ని దుకాణాలు తొలగించమంటే, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని దిగులుగా ఉంది" అని ఆమె చెప్పారు.
ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు
అయోధ్యలోని దేవాలయాలు, ధర్మశాలల్లో నివసిస్తున్న ప్రజల ఆందోళనలు అధికార బీజేపీ వరకు చేరుతున్నాయి. వీరి మొర ఆలకించాలని సంత్ సమాజ్, విశ్వహిందూ పరిషత్ సహా కొన్ని హిందూ సంస్థలు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
"ఆర్థికాభివృద్ధి జరగనంతవరకూ మార్పు రాదు. పర్యటక రంగం అభివృద్ధి చెందితే అయోధ్యకు లాభాలు చేకూరుతాయి. ఇది ప్రారంభం మాత్రమే. దీనివల్ల అయొధ్య కచ్చితంగా బాగుపడుతుంది. హోటళ్ల నిర్మాణంపైనా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం అతిథి గృహాలను నిర్మిస్తోంది. రామ మందిరం చూడ్డానికి అయోధ్యకు వచ్చే భక్తులు చుట్టుపక్కల ఆలయాలనూ సందర్శిస్తారు. అది మేలు చేస్తుంది" అని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సంజయ్ చౌదరి అన్నారు.
అయితే, రానున్న రోజులు ఎలా ఉండబోతాయోననే భయం అయోధ్యవాసులకు ఉంది. కానీ, రామ మందిరం పైన మాత్రమే దృష్టి ఉన్న భక్తులకు ఇది బహుశా కనిపించకపోవచ్చు.
"రామ మందిరంపై దృష్టి కేంద్రీకరించండి. కానీ, దాన్ని మరీ విశాలం చేసి, ఆకలితో అలమటిస్తున్నవారందరూ చిప్ప పట్టుకుని దాని ముందే కూర్చునే పరిస్థితి కల్పించకండి" అని సరయూ కుంజ్ ఆలయానికి చెందిన మహంత్ యుగళ్ శాస్త్రి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారీ విగ్రహాలను చైనా నుంచే ఎందుకు తెప్పిస్తున్నారు, ఇక్కడ తయారు చేయలేరా
- ఇజ్రాయెల్‌లో పెగాసస్ కలకలం - నేతలు, జర్నలిస్టుల ఫోన్లను పోలీసులు హ్యాక్ చేశారని ఆరోపణలు
- ఆ ఇంటి బేస్మెంట్లో హిట్లర్ మందిరం
- BBC ISWOTY నామినీ లవ్లీనా బోర్గోహెయిన్: ఒక పూట భోజనం ఉంటే రెండో పూట ఉండేది కాదు
- ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలలో అసదుద్దీన్ ప్రభావం చూపలేకపోతున్నారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)