First Hindu PM- రిషి సునక్: బ్రిటన్ చరిత్రలో మొట్టమొదటి హిందూ ప్రధాన మంత్రి - జీవిత ప్రస్థానం ఫొటోల్లో

బ్రిటన్ చరిత్రలో ప్రధాన మంత్రి అయిన మొదటి బ్రిటిష్-ఆసియా వ్యక్తిగా రిషి సునక్ చరిత్ర సృష్టించారు. ఈ పదవి చేపట్టిన మొదటి హిందువు కూడా ఆయనే.

లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో అధికార కన్జర్వేటివ్ పార్టీ రిషి సునక్‌ను తమ నాయకుడిగా ఎన్నుకుంది.

బోరిస్ జాన్సన్ రాజీనామాతో ప్రధానమంత్రి పదవి చేపట్టిన లిజ్ ట్రస్ 45 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది.

రిషి సునక్ జీవిత ప్రస్థానం.. ఫొటోల్లో..

బ్రిటన్ తొలి హిందూ ప్రధాని..

బ్రిటన్ దేశానికి ప్రధాన మంత్రి అయిన తొలి హిందువు రిషి సునక్.

ఆయన 1980లో సౌతాంప్టన్‌లో జన్మించారు.

రిషి సునక్ తండ్రి యశ్వీర్ సునాక్ వైద్యుడు. తల్లి ఉష సొంతంగా మందుల దుకాణం నడిపేవారు.

సునాక్ తల్లిదండ్రులు ఇద్దరూ తూర్పు ఆఫ్రికాలో జన్మించారు. భారతీయ మూలాలు ఉన్న వీరి కుటుంబాలు తదనంతరకాలంలో బ్రిటన్‌లో స్థిరపడ్డాయి.

రిషి సునాక్ తండ్రి యశ్వీర్ ప్రస్తుత కెన్యా దేశంలో పుట్టి, పెరిగారు. తల్లి ఉష ప్రస్తుత టాంజానియా దేశంలో భాగమైన టాంగాన్యికా ప్రాంతంలో పుట్టారు.

రిషి సునాక్ తాతలు బ్రిటిష్ పాలనలోని భారతదేశంలో, పంజాబ్ ప్రావిన్సుకు చెందినవారు. తదనంతరకాలంలో వారు తూర్పు ఆఫ్రికా ప్రాంతానికి వలసవెళ్లారు. 1960ల్లో వీరి కుటుంబాలు బ్రిటన్‌ చేరుకున్నాయి.

2009లో రిషి సునక్ అక్షతా మూర్తిని పెళ్లి చేసుకున్నారు. ఆమె ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడైన ఎన్.ఆర్.నారాయణమూర్తి కుమార్తె. అప్పటికి నారాయణమూర్తి భారతీయ సంపన్నుల్లో మొదటి 10 మందిలో ఒకరు.

రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. కృష్ణ, అనౌష్క.

2001 నుంచి 2004 వరకు రిషి సునాక్ గోల్డ్‌మన్ సాచెస్ కంపెనీలో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పనిచేశారు. తర్వాత రెండు హెడ్జ్ ఫండ్స్ (ప్రైవేటు ఇన్వెస్టర్ల సంపద)లో భాగస్వామిగా ఉన్నారు.

బ్రిటన్‌లోని సంపన్న పార్లమెంటు సభ్యుల్లో రిషి ఒకరని భావిస్తుంటారు. అయితే, తన ఆస్తి విలువ ఎంతో ఆయన ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించలేదు.

2015 నుంచి యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నియోజకవర్గం నుంచి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా రిషి సునక్ ఉన్నారు.

థెరిసా మే ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా, బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ట్రెజరీ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు.

2000వ సంవత్సరం ఫిబ్రవరిలో రిషి సునక్ ఎక్స్‌చెకర్ ఛాన్స్‌లర్ (ఆర్థిక శాఖ మంత్రి) అయ్యారు.

కొన్ని వారాల్లోనే కరోనావైరస్ మహమ్మారి ప్రభావంతో లాక్‌డౌన్లు మొదలు కావడం వల్ల యూకే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందులు పడింది. అలాంటి సమయంలో రిషి సునక్ ఆర్థిక మంత్రిగా దేశాన్ని బాగా నడిపించారని పేరొందారు.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా దేశంలో ఆర్థిక వ్యవస్థలు దాదాపుగా మూతపడ్డాయి. ఈ సమయంలో 1.16 కోట్ల మంది కార్మికులకు వేతనాలు చెల్లించే ప్రభుత్వ ప్రణాళిక ‘విరామ పథకం’ను అత్యంత విజయవంతంగా అమలు చేసిన ఘనత రిషి సునాక్‌కే దక్కుతుందని బ్రిటన్‌లో చాలామంది అభిప్రాయపడ్డారు.

‘హెల్ప్ ఔట్ టు ఈట్ ఔట్’ (ఆర్థిక వ్యవస్థకు సహకరించేందుకు బయటకు వెళ్లి తినండి) పథకాన్ని ఆయన అమలు చేశారు. ఈ పథకాన్ని అమలు చేసినందుకు గర్వపడతానని తర్వాత ఆయన చెప్పారు.

కరోనా లాక్‌డౌన్లను ఎత్తేసిన తర్వాత యూకేలోని ప్రజలు రెస్టారెంట్లకు, బార్లకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసేలా కొన్ని రాయితీలను ఇచ్చారు. ఇలా ప్రజలు బయటకు వెళ్లేలా ప్రోత్సహిస్తే కోవిడ్19 కేసులు పెరుగుతాయనే భయాలు ఉన్నప్పటికీ ఈ పథకాన్ని అమలు చేశారు.

జూలై నెలలో బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.

దీంతో రిషి సునాక్ ప్రధాని పదవికి పోటీలో నిలబడ్డారు.

అప్పట్లో ఆయన ఒకే ఒక్క అంశంపై తన దృష్టిని కేంద్రీకరించారు. అది.. యూకే ఆర్థిక వ్యవస్థ. అప్పటికే బ్రిటన్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. దానిని సరిదిద్దటమే తన లక్ష్యమని రిషి ప్రకటించారు.

వాస్తవానికి అప్పట్లోనే రిషి సునక్ ప్రధాని అవుతారని చాలామంది అనుకున్నారు. కానీ, సొంత పార్టీ నాయకుల మనసు గెలవలేకపోయారు. కన్జర్వేటివ్ పార్టీ సెప్టెంబర్ నెలలో తమ నాయకురాలిగా లిజ్ ట్రస్‌ను ఎన్నుకుంది. దీంతో ఆమె ప్రధానిగా 10 డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్లారు.

బ్రిటన్ ప్రభుత్వం గత రెండు నెలలుగా గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీంతో కొత్త ప్రధాన మంత్రి వీటన్నింటినీ చక్కదిద్ది, సరికొత్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తారని చాలామంది ఆశిస్తున్నారు.

ఒకపక్క పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు, మరోపక్క యుక్రెయిన్ యుద్ధం వల్ల తలెత్తిన పరిస్థితులతో బ్రిటన్ ప్రజలు ఇంటా, బయట ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గత ఏడు నెలల్లో కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఎన్నికైన మూడవ ప్రధాన మంత్రి రిషి సునక్.

మొదటి బ్రిటిష్-ఆసియన్ ప్రధాన మంత్రిగా, మొదటి హిందూ ప్రధాన మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)