You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్ కన్నా ఆరు రెట్లు పెద్దదైన A23ఏ ఐస్‌బర్గ్ వేగంగా కదులుతోంది, ఏం జరగబోతోంది?
సముద్రం అడుగున ఉండిపోయిన ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్ దాదాపు 37 ఏళ్ల తర్వాత ఇప్పుడు వేగంగా కదులుతోంది.
ఈ ఐస్‌బర్గ్‌ను ఏ23ఏగా వ్యవహరిస్తారు.
1986లో అంటార్కిటికా తీర ప్రాంతం నుంచి విడిపోవడంతో ఈ ఐస్‌బర్గ్ ఏర్పడింది. ఐస్‌బర్గ్‌గా ఏర్పడిన తర్వాత వేగంగా కదిలి వెడ్డెల్ సముద్రం అడుగుకు చేరుకుని అక్కడే ఉండిపోయింది. అది సముద్రంలో ఒక మంచుద్వీపంలా మారింది.
దాదాపు 4,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం (1,500 మైళ్ళు) ఉండే ఈ ఐస్‌బర్గ్ హైదరాబాద్ కన్నా ఆరు రెట్లు పెద్దది. ఇది గ్రేటర్ లండన్‌కు రెండు రెట్ల కంటే పెద్దది.
దాని పరిమాణాన్ని మరింత దగ్గరగా చెప్పాలంటే దక్షిణ జార్జియాకి సమీపంలోని సౌత్ శాండ్‌విచ్ దీవుల విస్తీర్ణం 3,900 చదరపు కిలోమీటర్లతో పోల్చుకోవచ్చు. లేదా ఇంచుమించుగా 4,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన గ్రేట్ మాల్వినా (వెస్ట్ ఫాక్‌ల్యాండ్) విస్తీర్ణానికి దగ్గరగా ఉంటుంది.
గత ఏడాది ఈ ఐస్‌బర్గ్ వేగంగా కదులుతూ వచ్చింది. ఇప్పుడు అంటార్కిటికా జలాలను దాటి రానుంది.
ఏ23ఏ మందం దాదాపు 400 మీటర్లు, అంటే 1,312 అడుగులు.
యూరప్‌లోని అతిపెద్ద ఆకాశహర్మ్యం ‘లండన్ షార్డ్’ ఎత్తు 310 మీటర్లు కాగా, దాని కంటే కూడా ఇది దాదాపు వంద మీటర్లు ఎత్తుగా ఉంటుంది.
మంచుతో కప్పుకుపోయిన అంటార్కిటికా ఖండంలోని ఫిల్చ్‌నర్ ఐస్ షెల్ఫ్ నుంచి విడివడిన బర్గ్‌లలో ఏ23ఏ ఒకటి.
అప్పట్లో దీనిపై సోవియట్ రీసర్చ్ స్టేషన్ ఉండేది. ఇది కదిలిపోతుందనే భయంతో డ్రుజ్నయా 1 బేస్ నుంచి పరికరాలను రష్యా హుటాహుటిన తరలించింది.
కానీ, బల్లపరుపులా ఉండే ఈ ఐస్‌బర్గ్, వెడ్డెన్ సముద్రగర్భంలోని బురదనేలలో చిక్కుకుపోవడంతో అంటార్కిటికా తీరం నుంచి ఎక్కువ దూరం వెళ్లలేదు.
అయితే, 37 ఏళ్ల తర్వాత ఇది ఇప్పుడు ఎందుకు కదులుతోంది?
‘‘ఏ23ఏ ఐస్‌బర్గ్ ఎందుకు కదులుతోందనే విషయంపై నా సహోద్యోగులను అడిగాను. నీటి ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల ఇది కదిలి ఉండొచ్చని అనుకుంటున్నా. కానీ కచ్చితంగా చెప్పాలంటే కొంత సమయం పడుతుంది'' అని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేకి చెందిన రిమోట్ సెన్సింగ్ ఎక్స్‌పర్ట్ ఆండ్రూ ఫ్లెమింగ్ చెప్పారు.
''1986లో అది చిక్కుకుపోయింది. ఆ తర్వాత క్రమంగా పరిమాణం తగ్గుతూ, పట్టు కోల్పోయి కదలడం మొదలైంది. 2020లో దానిలో మొదటి కదలికను గుర్తించా'' అని ఆయన చెప్పారు.
ఇటీవల కొన్నినెలలుగా వీస్తున్న గాలులు, ప్రవాహాల కారణంగా ఏ23ఏ కదులుతోంది. ప్రస్తుతం అది అంటార్కిటికా ద్వీపకల్పం ఉత్తర కొన నుంచి దూరంగా వెళ్తోంది.
వెడ్డెల్ సెక్టార్‌లోని అత్యధిక ఐస్‌బర్గ్‌ల మాదిరే ఏ23ఏ కూడా ‘అంటార్కిటికా సర్కమ్‌పోలార్ కరెంట్’ దిశగా కదులుతోంది. అది దక్షిణ అట్లాంటిక్ వైపున ఉన్న ''ఐస్‌బర్గ్ అలీ''గా పిలిచే మంచుకొండల శ్రేణి వద్దకు చేరనుంది.
ఎంత పెద్ద ఐస్‌బర్గ్ అయినా చివరకు క్రమంగా కరిగిపోయి, నీటిలో కలిసిపోతుంది.
ఏ23ఏ కదలికను శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఏ23ఏ సౌత్ జార్జియాకి చేరితే, ఆ ద్వీపంలో సంతానోత్పత్తి చేసే లక్షల కొద్దీ సీల్స్, పెంగ్విన్, ఇతర సముద్ర పక్షులకు ముప్పు తలెత్తే అవకాశం ఉంది.
ఏ23ఏ భారీ పరిమాణం దృష్ట్యా అది అక్కడ నివసించే జంతువుల సాధారణ ఆహార సేకరణ మార్గాలకు ఇబ్బంది కలిగే వకాశం ఉంది. దాని వల్ల జంతువులు, వాటి పిల్లలకు ఆహార సేకరణలో ఇబ్బందులు తలెత్తుతాయి.
టైటానిక్ నౌక మునక లాంటి ఘటనల్లో మాదిరి, ఐస్‌బర్గ్‌లను ఈ రకమైన ప్రమాదాలను కలిగించే విపత్తులుగా మాత్రమే చూడలేం. పర్యావరణంలోనూ వాటి ప్రాముఖ్యం పెరుగుతోంది.
ఇలాంటి భారీ ఐస్‌బర్గ్‌లు, అంటార్కిటికాలోని రాతి ఫలకాల మీద మంచును తొలగిస్తున్నప్పుడు అవి కరిగిపోయి ఆ మంచులో ఉన్న ఖనిజ ధూళి బయటికి విడుదల అవుతుంది.
''ఈ ఐస్‌బర్గ్‌లు అనేక జీవసంబంధ కార్యకలాపాలకు మూలం. పలు రకాలుగా అవి జీవాన్ని అందిస్తాయి'' అని ఉడ్స్ హోల్ ఓషెనోగ్రఫిక్ ఇన్‌స్టిట్యూషన్‌కి చెందిన డాక్టర్ కేథరిన్ వాకర్ అన్నారు.
ఏ23ఏ విడిపోయిన సంవత్సరమే కేథరిన్ జన్మించారు.
ఇవి కూడా చదవండి:
- మాంట్ బ్లాంక్ మీద రత్నాల పెట్టె దొరికితే పోలీసులకు ఇచ్చాడు... ఎనిమిదేళ్ళకు అందులో అతడికి సగమిచ్చారు
- లెబనాన్: ట్రెక్కింగ్‌తో ఐక్యత సాధిస్తున్న దేశం
- ఆల్ఫ్స్ పర్వతాల్లో మంచు వింతగా ఎరుపు రంగులో ఎందుకుంది
- విశాఖ: తొట్లకొండకు ఆ పేరు ఎలా వచ్చింది.. ఫిల్మ్ క్లబ్‌కు భూమి ఇవ్వడంపై ఆందోళనలు ఎందుకు..
- హిమాలయాల్లోని ఈ అద్భుత పర్వతాన్ని అధిరోహించటం నిషిద్ధం... ఎందుకంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)