You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
1986లో మిస్సయిన పర్వతారోహకుడి అవశేషాలు ఇప్పుడు దొరికాయి, కారణం ఏంటంటే...
- రచయిత, ఇమోజెన్ ఫౌల్క్స్
- హోదా, బీబీసీ జెనీవా ప్రతినిధి
స్విట్జర్లాండ్‌లోని ప్రసిద్ధ మాటర్‌హార్న్‌కు దగ్గరగా ఉన్న హిమానీనదంపై మానవ మృతదేహం అవశేషాలు కనుగొన్నారు. ఇవి 1986లో తప్పిపోయిన జర్మన్ పర్వతారోహకుడి మృతదేహానివిగా గుర్తించారు.
వాతావరణ మార్పుల కారణంగా వేగంగా కుంచించుకుపోతున్న ఆల్పైన్ హిమానీనదాల నుంచి బయటపడిన రహస్యాలలో ఇది తాజాది.
ఈ నెల ప్రారంభంలో జెర్మాట్ పైన ఉన్న థియోడుల్ హిమానీనదంపై అధిరోహకులు ఈ అవశేషాలను కనుగొన్నారు.
మంచు నుంచి ఒక హైకింగ్ బూట్, క్రాంపాన్స్ ( బూటుకు వాడే లోహపు కొక్కెం) బయటపడటాన్ని వారు గమనించారు.
ఈ అవశేషాల డీఎన్ఏను విశ్లేషించగా అది 37 సంవత్సరాల క్రితం అదృశ్యమైన జర్మన్ పర్వతారోహకుడివిగా తేలాయి.
ఆ సమయంలో ఈ జర్మన్ పౌరుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ అతని జాడను కనుగొనలేకపోయారు.
పోలీసులు ఆ అధిరోహకుడి పేరు చెప్పలేదు. అయితే, తప్పిపోయినపుడు అతని వయసు 38 ఏళ్లుగా చెప్పారు.
ఆల్ప్స్ పర్వతాల వద్ద ఉన్న హిమానీనదాల మాదిరి థియోడుల్ హిమానీనదం కూడా గత కొన్నేళ్లుగా కరుగుతూ వస్తోంది.
ఈ థియోడుల్ జెర్మాట్ అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా స్కీ రిసార్ట్‌లు తెరిచే ఉంటాయి. అంతేకాదు, జెర్మాట్‌లో ఐరోపాలోనే ఎత్తైన స్కీ ప్రాంతం ఉంది.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆల్పైన్ మంచు క్షేత్రాలు కరుగుతుంటాయి.
1980ల వరకు థియోడుల్ దాని పక్కన ఉన్న గోర్నర్ హిమానీనదంతో కలిసి ఉండేది. అయితే, ఇప్పుడు రెండూ విడిపోయాయి.
ప్రతి వేసవిలో కరుగుతున్న మంచు ఏదో ఒకటి లేదా ఎవరైనా దశాబ్దాలుగా కనబడకుండా పోయిన వాటిని బయట పెడుతున్నాయి.
1968లో కుప్పకూలిన విమాన శకలాలు గతేడాది అలెట్ష్ హిమానీనదంలో బయటపడ్డాయి.
1979లో కనిపించకుండా పోయి, 2014లో..
2014లో బ్రిటీష్ అధిరోహకుడు జోనాథన్ కాన్విల్లే మృతదేహాన్ని కనుగొంది ఓ హెలికాప్టర్.
స్విట్జర్లాండ్‌లోని మాటర్‌హార్న్‌లో పర్వతారోహకులకు వస్తువులు చేరవేయడానికి వెళుతుండగా పైలట్ మృతదేహాన్ని గుర్తించారు.
కాగా, జోనాథన్ కాన్విల్లే 1979లో కనిపించకుండా పోయారు.
జోనాథన్ కుటుంబం దశాబ్ధాలుగా ఆయన గురించి తెలియకుండానే గడిపింది. చివరకు జోనాథన్ బాగా ఇష్టమైన వాతావరణంలోేన మరణించారని అర్థం చేసుకుంది.
మరుసటి ఏడాది మాటర్‌హార్న్ హిమానీనదం అంచున ఇద్దరు జపనీస్ అధిరోహకుల మృతదేహాలు గుర్తించారు. వారు 1970లో అక్కడి మంచు తుఫానులో తప్పిపోయారు.
మంచు కరగడంతో మారిపోతున్న దేశాల సరిహద్దులు
గత ఏడాది మంచు కరిగిపోవడంతో స్విట్జర్లాండ్, ఇటలీ దేశాల మధ్య సరిహద్దు కూడా మారిపోయింది.
ఇరుదేశాలకు సరిహద్దును మొదట 'డ్రైనేజీ డివైడ్' వద్ద సెట్ చేశారు. ఆ ప్రాంతంలో మంచు కరిగి నీరు ఒకదేశం నుంచి మరొక దేశంలోకి ప్రవహిస్తుంది.
అయితే, హిమానీనదం తగ్గిపోవడంతో డ్రైనేజీ డివైడ్ స్థానం మారిపోయింది.
స్కీయర్‌లు, హైకర్‌లు ఎక్కువగా ఇష్టపడే ఇటాలియన్ మౌంటెన్ రిసార్ట్ రిఫుజియో గైడ్ డెల్ సెర్వినో ఇప్పుడు సాంకేతికంగా స్విట్జర్లాండ్‌లో ఉంది.
సరిహద్దును ఎలా తిరిగి గీయాలనే దానిపై స్విస్, ఇటాలియన్ ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
కానీ మంచు కరగడమనేది సరిహద్దు సమస్య లేదా అధిరోహకుల అవశేషాలు బయటపడటం కంటే ఎక్కువ ప్రభావాలను చూపుతుంది.
ఆల్పైన్ హిమానీనదాలు ఐరోపా పర్యావరణానికి కీలకం. రైన్, డాన్యుబ్ వంటి యూరోపియన్ నదులను ఈ శీతాకాలపు మంచు నింపుతుంది.
పంటలకు నీటిని అందిస్తుంది. అణు విద్యుత్ కేంద్రాలనూ చల్లబరుస్తుంది.
గత రెండేళ్ల కాలంలో కొన్ని సమయాల్లో రైన్ నదిలో నీటిమట్టం తగ్గడంతో సరుకు రవాణా చేసే బార్జ్‌లపై ప్రభావం పడింది.
హాలండ్, స్విట్జర్లాండ్ మధ్య ఈ బార్జ్‌ల ద్వారానే వస్తువులను రవాణా చేస్తారు.
కరిగే నీరు నదులను కూడా చల్లబరుస్తుంది. శీతలీకరణ ప్రభావం లేకపోతే నదుల్లోని నీరు వెచ్చగా మారుతుంది. దీంతో చేపలు చనిపోతాయి.
'శతాబ్దం చివరి నాటికి ఆల్పైన్ అదృశ్యం'
గత ఏడాది నుంచి మంచు కరిగే విధానం చూసి స్విస్ హిమానీనదం నిపుణులు ఆశ్చర్యపోయారు. 1931 నుంచి హిమానీనదాలు వాటి పరిమాణాన్ని సగం కోల్పోయాయి. శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే ఇది చాలా వేగంగా జరిగింది.
ఇలా అయితే, దాదాపు అన్ని ఆల్పైన్ హిమానీనదాలు ఈ శతాబ్దం చివరి నాటికి అదృశ్యమవుతాయి.
2023 జూన్ నెలలో స్విట్జర్లాండ్ అత్యంత వేడిగా, పొడిగా మారింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన అత్యంత వేడి గల సమయాలుగా ఈ జూలై మొదటి మూడు వారాలు నిలిచాయి.
కాగా, ఆగష్టు, సెప్టెంబరులో హిమానీనద నిపుణులు మళ్లీ మంచును కొలుస్తారు. దీంట్లో ఏం తెలుస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి
- జాన్వీ కపూర్ నటించిన ‘బవాల్’ సినిమాపై వివాదమేంటి? హిట్లర్ ప్రస్తావన, గ్యాస్ చాంబర్ సన్నివేశాలపై అభ్యంతరం ఎందుకు?
- ‘లవ్ బాంబింగ్’ అంటే ఏంటి, దీనికి ఎవరు ఎలా బలి అవుతారు?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)