బర్రెలక్క ఎన్నికల అఫిడవిట్‌లో ఏముంది? ఆస్తులు.. అప్పులు.. ఇంకా..

    • రచయిత, భాను ప్రకాశ్ కర్నాటి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అకౌంట్లో రూ.1,500.. చేతిలో రూ. 5,000 నగదు.. బర్రెలక్క అలియాస్ శిరీష ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలివి.

తెలంగాణ ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మాత్రం ప్రధాన పార్టీ అభ్యర్థులతో పోటీగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నె శిరీష (బర్రెలక్క) నిర్వహిస్తున్న ప్రచారం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

కొన్నేళ్ల క్రితం గేదెలు కాస్తూ తీసిన వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసిన సమయంలో ఎన్ని డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని, అందుకే గేదెలు కాస్తున్నానని చెప్తూ పాపులర్ అయ్యారు శిరీష.

ఇప్పుడు ఎన్నికల బరిలో దిగి, అదే బర్రెలక్క పేరును ఎన్నికల అఫిడవిట్‌లో కూడా పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆమె చేస్తున్న ప్రచారం సోషల్ మీడియా వైరల్‌గా మారింది.

బర్రెలక్క ఎన్నికల అఫిడవిట్‌..

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష తాను సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తాను డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీకాం పూర్తి చేసినట్లుగా పేర్కొన్నారు.

తన దగ్గరున్న నగదు వివరాలను పేర్కొంటూ, తన చేతిలో రూ. 5,000, బ్యాంకు ఖాతాలో రూ.1500 ఉన్నాయని పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకు సంబంధించి తనపై ఒక కేసు (ఐపీసీ 505 (2)) కోర్టులో ఉన్నట్లుగా ప్రస్తావించారు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో తనకు సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నట్లు, వాటి వివరాలను నమోదు చేశారు.

ఇన్‌స్టాగ్రాంలో ఈమెకు 5.73 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 1.07 లక్షలమంది ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 1.59 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, ఉన్నారు.

నగదు మినహా, తనకు ఆస్తులు, వాహనాలు ఏమీ లేవని, అప్పులు కూడా లేవని రాశారు.

సోషల్ మీడియాలో ట్రెండింగ్..

బర్రెలక్క స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీఎఆర్ఎస్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు.

ఎన్నికల నామినేషన్ వరకు ఈ నియోజకవర్గంపై రాజకీయ విశ్లేషణలు ఎలా ఉన్నా, ఆ తరువాత సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది కొల్లాపూర్ నియోజకవర్గం.

తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు బర్రెలక్క.

నామినేషన్ మొదలు ప్రచారం వరకు సామాజిక మాధ్యమాల్లో ఆమె చర్చకు తెరలేపారు. యూట్యూబర్లు, సామాజిక ఉద్యమకారులు ఆమెకు మద్దతునివ్వడంతో అక్కడి ప్రచారం ట్రెండ్ అవుతోంది.

ఎన్నికల సంఘం కేటాయించిన విజిల్ గుర్తుపై ఆమె పోటీ చేస్తున్నారు.

'నాకు జీవితాన్నిచ్చింది బర్రెలే'

తాను గేదెలు మేపుతూ చేసిన వీడియో వల్లనే తనకు ఇంతటి ఆదరణ లభించిందని బర్రెలక్క అన్నారు.

బీబీసీతో ఆమె మాట్లాడుతూ, తాను చేసిన వీడియో వలన ఆదరణ లభించినా, అదే వీడియో వల్ల కేసు నమోదై మానసికంగా కుంగుబాటుకు లోనయ్యానని అన్నారు. తనకు ఆదరణ తెచ్చిన బర్రెలను అమ్మాల్సి వచ్చిందని, మళ్లీ తిరిగి తెచ్చుకుంటానని చెప్పారు.

తాను ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అయ్యానని, గ్రూప్ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు.

“ఆ వీడియోపై కేసు పెట్టినప్పుడు జీవితం నాశనం అయిపోయిందని అనిపించింది. డిప్రెషన్‌లోకి వెళ్లా” అని చెప్పారు.

“మాకూ భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కదా? మేం మాట్లాడొద్దా? నేను సేవ చేయాలని అనుకున్నా” అని చెప్పారు.

బర్రెలక్క మేనిఫెస్టో..

బర్రెలక్క ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. నిరుద్యోగ సమస్యనే ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకున్న బర్రెలక్క, తనని గెలిపిస్తే, నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

మేనిఫెస్టోలో పేర్కొన్న మరికొన్ని అంశాలు..

  • ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల చేసేందుకు పోరాటం
  • పేదల ఇళ్ల నిర్మాణానికి కృషి
  • నిరుద్యోగులందరికీ భృతి ఇప్పించేందుకు కృషి
  • ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మాణం
  • ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)