You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డీఆర్‌జీ: మావోయిస్టుల అంతానికి మోహరించిన ఈ దళం గురించి స్థానిక గిరిజనులు ఏమంటున్నారు?-గ్రౌండ్ రిపోర్ట్
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘వాహనం నడుపుతూనే ఎడమవైపున ఉన్న అడవి వైపు చూస్తూ ఉండు. నీకు మన క్యాంప్ కనిపిస్తుంది. అక్కడ నా కోసం వెయిట్ చెయ్యి’’
బస్తర్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ సీనియర్ పోలీస్ అధికారి అన్నమాటలివి.
సాయుధ పోరాటానికి ప్రత్యక్ష సాక్షి అయిన ఈ ప్రాంతం ఏడు జిల్లాల్లో విస్తరించింది.
సాయుధ మావోయిస్టులు, ప్రభుత్వ బలగాలకు మధ్య పోరాటానికి ఇది కేంద్రం.
ఈ హింస కారణంగా గడచిన పాతికేళ్లలో వివిధ రాష్ట్రాల్లో 4వేల మందికి పైగా సామాన్యులు చనిపోయారు.
2026 మార్చ్ 31 నాటికల్లా నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు.
బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) ముందు వరసలో ఉంది.
ఓ అధికారి మాతో మాట్లాడిన క్యాంపులోనే డీఆర్‌జీ బృందాలు కూడా స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.
క్షేత్రస్థాయిలో పరిస్థితులెలా ఉన్నాయి?
పోలీసుల పర్యవేక్షణలో నడిచే డీఆర్‌జీ క్యాంపును సందర్శించేందుకు, ఆ శిబిరంలో సభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ బృందానికి అనుమతి లభించింది. డీఆర్‌జీ క్యాంపులో స్థానికులతోపాటు లొంగిపోయిన మావోయిస్టులు కూడా పని చేస్తున్నారు.
మావోయిస్టులకు వ్యతిరేకంగా డీఆర్‌జీ బాగా పని చేస్తోందని ప్రభుత్వం చెబుతుంటే, అది పని చేస్తున్న విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి
డీఆర్‌జీ "నకిలీ ఎన్‌కౌంటర్లు, మితిమీరిన చర్యలకు పాల్పడుతోంద"ని ఈ ప్రాంతానికి చెందిన అనేకమంది ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఈ దళం గురించి అర్థం చేసుకోవడానికి, ఈ సంఘర్షణ మధ్య జీవిస్తున్న ఆదివాసుల పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి బీబీసీ బృందం బస్తర్‌లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లింది.
చట్టం, భద్రతను దృష్టిలో ఉంచుకుని డీఆర్‌జీ సభ్యుల గుర్తింపును బీబీసీ వెల్లడించడం లేదు.
‘అడవులు మాకు కొట్టిన పిండి’
మేం డీఆర్‌జీ కమాండర్‌ను కలిశాం. ఆయన నాయకత్వంలోని బలగాలు, మిగతా బలగాల కంటే ఎలా భిన్నమో తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాం.
దానికాయన "మేం స్థానికులం. మాకు ఈ అడవులు, అందులో దారుల గురించి బాగా తెలుసు. మిగతా బలగాలకు తెలియదు. ప్రాథమికంగా ఇదొక తేడా" అని చెప్పారు.
ఈ ప్రాంతంలో ఆదివాసీలు మాట్లాడే భాషను డీఆర్‌జీ సభ్యులు చాలా స్పష్టంగా మాట్లాడగలరని పోలీసు అధికారులు చెప్పారు.
అడవుల్లో దాక్కున్న సాయుధ మావోయిస్టుల వ్యూహాలను అర్థం చేసుకోవడం, వారి స్థావరాలను గుర్తించడంలో డీఆర్‌జీలో మాజీ మావోయిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని కూడా పోలీసులు తెలిపారు.
మొదట డీఆర్‌జీ సభ్యులు బీబీసీతో మాట్లాడేందుకు సందేహించారు. కాసేపటి తర్వాత వారు తమ జీవితాలు, పోరాటం గురించి వివరంగా చెప్పారు.
డీఆర్‌జీ ఏర్పాటుకు ముందు
మావోయిస్టుల్ని ఎదుర్కొనేందుకు స్థానిక ఆదివాసీల్ని నియమించుకోవడం అనేది కొత్తదేమీ కాదు.
డీఆర్‌జీకి ముందు, 2005లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 'ప్రత్యేక పోలీసు అధికారులు' పేరిట స్థానిక ఆదివాసీ తెగల ప్రజలతో 'సల్వా జుడుం'ను ఏర్పాటు చేసింది.
సల్వా జుడుం ఏర్పాటుపై గతంలో సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం సల్వాజుడుం ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని 2011లో తీర్పు చెప్పింది.
మావోయిస్టులకు వ్యతిరేకంగా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను ఉపయోగించవద్దని సుప్రీంకోర్టు ఛత్తీగ్‌గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మావోయిస్టులపై పోరాటంలో స్థానిక ఆదివాసీలను ఉపయోగించడం న్యాయం కాదని కోర్టు చెప్పింది.
డీఆర్‌జీ ఏమిటి?
డీఆర్‌జీని 2015లో ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటు చేశారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న జిల్లాల్లో పోలీసుల వద్ద అనేక డీఆర్‌జీ టీమ్స్ ఉన్నాయి. ఈ విభాగంలో ఉన్న వారు తమకు స్థానిక పోలీసుల మాదిరిగానే జీతాలు, ఇతర సౌకర్యాలు లభిస్తాయని మాకు చెప్పారు.
తేడా ఏంటంటే అవి పని చేసే తీరు. డీఆర్‌జీలను ఎక్కువ శాతం పోరాటాలు లేదా ఎన్‌కౌంటర్ల కోసం ఉపయోగిస్తారు. రోజువారీ పోలీసింగ్‌లో వారి పాత్ర చాలా తక్కువ.
మారుమూల అటవీ ప్రాంతాల్లో డీఆర్‌జీ సభ్యులు ఎక్కువగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తారని మాతో చెప్పారు.
"ప్రత్యేకించి గత ఐదేళ్లలో అలాంటి ప్రాంతాల్లో మేం అనేక క్యాంపులు తెరిచాం. అక్కడ మొదట మమ్మల్ని చూసి స్థానికులు భయపడ్డారు. మాతో మాట్లాడ లేదు. మేం వాళ్లతో సోదరుల మాదిరిగా వారితో కలిసిపోయేందుకు ప్రయత్నించాం. ఇప్పుడు వాళ్లు మాతో బాగా మాట్లాడుతున్నారు" అని డీఆర్‌జీ సభ్యుడొకరు చెప్పారు.
డీఆర్‌జీలో మహిళలు కూడా ఉన్నారు.
‘‘2024లో డీఆర్‌జీలో చేరాను. ఆపరేషన్లలో పాల్గొంటున్నా. బలగాల్లో చేరిన తర్వాత కుటుంబాన్ని చూసేందుకు సొంతూరికి వెళ్లలేదు" అని ఒక మహిళా సభ్యురాలు చెప్పారు.
‘‘సాయుధ మావోయిస్టులు పూర్తిగా అంతరించిపోయారని మేం చెప్పలేం. వాళ్లు ఎప్పుడైనా దాడి చేయవచ్చు. ఆ భయంతోనే నా కుటుంబం నన్ను దూరంగా ఉంచుతోంది" అని ఆమె అన్నారు.
కొన్ని నెలల కిందట ఓ భూ వివాదంలో మావోయిస్టులు తన తండ్రిని కాల్చి చంపేశారని మరో సభ్యురాలు చెప్పారు.
"నా అన్న ఇప్పటికీ అక్కడే నివసిస్తున్నారు. అతని భద్రత గురించి నాకు ఎప్పుడూ ఆందోళనగానే ఉంటుంది" అని ఆమె అన్నారు.
శిక్షణ గురించి ప్రశ్నలు
డీఆర్‌జీ సభ్యులు 28 ఏళ్ల సైనికుడి వైపు చూపిస్తూ ఆయన సాయుధ మావోయిస్టులతో 11-12 ఏళ్ల పాటు పని చేశారని చెప్పారు.
ఏడాది కిందట డీఆర్‌జీ సభ్యులే పట్టుకున్నారని ఆయన చెప్పారు.
"నేను మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేయాలని అనుకున్నాను. పోలీసులను సంప్రదించేందుకు ప్రయత్నించాను. అయితే వీలుకాలేదు. నేను మా మామ ఇంట్లో ఉన్నానని తెలిసి డీఆర్‌జీ సభ్యులు అక్కడకు వచ్చారు. నేను లొంగిపోయాను" అని ఆయన చెప్పారు.
కొన్ని వారాల తర్వాత డీఆర్‌జీతో కలిసి పని చేయడం ప్రారంభించానని ఆయన అన్నారు. అయితే ఆయన శిక్షణ తీసుకున్నారా లేదా అనేది మా సంభాషణలో స్పష్టంగా తెలియలేదు.
‘‘మీరు ఇందులో పాల్గొనాలని స్వయంగా భావించారా’’ అని మేం ఆయన్ను ప్రశ్నించాం.
దానికాయన తన భార్య సోదరుడు ఆ సమయంలో డీఆర్‌జీలో ఉన్నాడని, బలగాల్లో చేరి పని చేయాలని ఆయనే సూచించాడని చెప్పారు.
డీఆర్‌జీ బలగాల్లో తన సహచరుడైన మరో మావోయిస్టు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు.
శిక్షణ గురించి ప్రశ్నించినప్పుడు ఇప్పటి వరకు తమకు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదని చెప్పారు.
‘‘మీరు కూడా డీఆర్‌జీ ఆపరేషన్లలో పాల్గొంటున్నారా’’ అని మేం ఆయన్ను అడిగాాం. "అవును, నేను వెళ్లకపోతే గైర్హాజరైనట్లు భావిస్తారు. నా జీతం ఆపేయవచ్చు. నేను వెళ్లాలని మా కమాండర్ చెబితే వెళతాను. మాలాంటి వాళ్లు చనిపోతూనే ఉంటారు" అని ఆయన చెప్పారు.
ప్రభుత్వాధికారులేమంటున్నారు?
డీఆర్‌జీ సభ్యులతో మా సంభాషణలో భాగంగా మాకు వచ్చిన సందేహాల గురించి బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్‌రాజ్‌ను అడిగాం.
"డీఆర్‌జీ సభ్యులు తమకు ప్రత్యేక శిక్షణ కావాలంటున్నారు. ట్రైనింగ్ చాలా ముఖ్యమైన అంశం. శిక్షణ లేకుండా మా బలగాల్లో ఎవరినీ ఆపరేషన్ల కోసం పంపించం" అని ఆయన చెప్పారు.
ప్రతీ సభ్యుడికీ ఆరు నెలల శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు.
అయితే ఓ మహిళా సభ్యురాలు మాత్రం తమకు రెండు నెలలు మాత్రమే శిక్షణ ఇచ్చారని, ఆ తర్వాత ఆపరేషన్లకు పంపించారని చెప్పారు.
చట్టాన్ని ఉల్లంఘించడమేనా?
సల్వాజుడుం ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసిన వారిలో నందిని సుందర్ ఒకరు.
సల్వాజుడుం ఏర్పాటులో భాగంగా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల నియామకం ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీల హక్కుల్ని ఉల్లంఘించడమేనని ఆమె కోర్టులో చెప్పారు.
"సాయుధ మావోయిస్టులకు వ్యతిరేకంగా 2005 నుంచి కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేస్తున్నది చట్టానికి వ్యతిరేకం అని మేం చెబుతూనే ఉన్నాం" అని ఆమె డీఆర్‌జీ గురించి తన అభిప్రాయం చెప్పారు.
"సుప్రీంకోర్టు నిర్ణయం చాలా స్పష్టంగా ఉంది. ఒక గ్రామంలో ఒక గ్రూపుకు చెందిన ప్రజలతో పోరాడేందుకు మీరు అదే గ్రామంలో మరో గ్రూపుకు ప్రజల్ని ఎంచుకోకూడదు" అన్నారామె.
"ఇక మావోయిస్టుల లొంగుబాటు గురించి చెప్పాలంటే ప్రభుత్వం గౌరవ ప్రదమైన విధానాన్ని అమలు చేయాలి. రండి సాధారణ ప్రజలతో కలిసి జీవించండి. పోరాటాన్ని ఆపేయండి. ఆయుధాలు వదిలేయండి, అని మీరు చెప్పలేరు. ఇప్పుడు మీరు ఆయుధాలు చేపట్టారు కాబట్టి జీవితాంతం పోరాడుతూనే ఉండాలి" అన్నది డీఆర్‌జీపై ఆమె విశ్లేషణ.
మావోయిస్టు సాయుధ పోరాటానికి ముగింపు?
2026 మార్చ్‌కల్లా మావోయిజాన్ని తుడిచి పెట్టేస్తామన్న ప్రభుత్వ ప్రకటన గురించి మేం డీఆర్‌జీ బలగాలను ప్రశ్నించాం.
"అది సాధ్యమని అనుకోవడం లేదు. వాళ్లేమీ యూనిఫామ్ వేసుకున్న సైన్యం కాదు. సాధారణ పౌరులతో కలిసిపోతుంటారు. వాళ్లను గుర్తించడం కష్టం" అని డీఆర్‌జీ సభ్యుడొకరు చెప్పారు.
"కొంతమంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. కొంతమందిని చంపేస్తున్నారు. మరోవైపు వాళ్లు కూడా దళంలోకి సభ్యుల్ని నియమించుకుంటున్నారు. అందువల్ల వాళ్లను సమూలంగా తుడిచి పెట్టేయడం సాధ్యం కాదని అనిపిస్తోంది" అని మరో సభ్యుడు అభిప్రాయపడ్డారు.
'పోలీసులు అతన్ని చంపేశారు'
ఇప్పుడీ అంశంలో మరొక కోణం చూద్దాం.
ఈ యేడాది ఆరంభంలో బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది సాయుధ మావోయిస్టులను చంపేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌జీ, ఇంకా ఇతర భద్రతా దళాలు పాల్గొన్నాయి.
మరణించిన వారిలో లచ్చు పోటం ఒకరు. ఆయనను పట్టుకుంటే బహుమతి ఉందని కూడా చెబుతారు. లచ్చు బీజాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఉండేవారు.
అక్కడికి చేరుకోవడం ఎంత కష్టమో మాకు తెలియలేదు. ముందు అసలు చాలాచోట్ల రోడ్లు లేవు. వర్షం కారణంగా మా కారు చక్రాలు పదేపదే బురదలో కూరుకుపోయాయి.
లచ్చు సోదరుడు అర్జున్ పోటంను గ్రామంలో కలిశాం. లచ్చుకు ఇద్దరు కూతుళ్లు. ఆయన భార్య అనారోగ్యంతో మరణించారు.
అర్జున్ ఆ రోజు జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ, "పోలీసులు రాత్రి మా ఊరుకు వచ్చారు. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి జనంపై కాల్పులు జరిపారు. చనిపోయినవారంతా నిరాయుధులే’’ అని వెల్లడించారు.
"కొంతమంది లొంగిపోవడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు వారి మాటలు వినడానికి నిరాకరించారు. చాలామందిని బంధించి, కొండల్లోకి తీసుకెళ్లి కాల్చి చంపారు. నా సోదరుడు గాయపడ్డాడు. వారు అతన్ని ఆ స్థితిలో అరెస్టు చేశారు. ఏడెనిమిదేళ్లు జైలుకు పంపినా మేం ఒప్పుకునేవాళ్లం. కనీసం అతను బతికి ఉండేవాడు’’ అని అర్జున్ పోటం చెప్పారు.
అర్జున్ చెప్పిన ఈ విషయాలను బీబీసీ స్వతంత్రంగా నిర్ధరించలేదు.
మీ సోదరుడికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా అని మేం అర్జున్‌ను అడిగాం.
‘‘మావోయిస్టులు కూడా పోలీసుల మాదిరిగానే జనాన్ని కొట్టారు. ఈ భయానక వాతావరణంలో ఆయన రెండు వర్గాలతోనూ సత్సంబంధాలు కొనసాగించాడు. కానీ ఎప్పుడూ ఆయుధం పట్టలేదు. మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనలేదు. తన పొలంలో పనిచేసుకునేవాడు" అని అర్జున్ అన్నారు.
లచ్చు సాయుధ మావోయిస్టు కాదని, గ్రామంలో సామాన్యుడిలాగే జీవితం గడిపాడని అక్కడి గ్రామస్తులు కూడా చెప్పారు.
అర్జున్ చేసిన ఆరోపణల గురించి విచారించడానికి బీబీసీ పోలీసులను సంప్రదించింది. లచ్చుపై ఉన్న అభియోగాలు ఏమిటో మేం వారిని అడిగాం. పదేపదే అడిగినప్పటికీ పోలీసులు సమాధానం ఇవ్వలేదు.
‘‘ఇటీవలి కార్యకలాపాలలో భద్రతా దళాలపై వచ్చిన ఆరోపణలు ఏవీ నిరూపణ కాలేదు. వచ్చిన ఆరోపణలు కూడా చాలా తక్కువే’’ అని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ అంటున్నారు.
గ్రామస్తులేమంటున్నారు?
సుక్మా జిల్లాలో ఒక గ్రామీణ గిరిజన కమ్యూనిటీ హైవే వెంబడి నిర్మించుకున్న ఒక స్మారక చిహ్నాన్ని మేం చూశాం.
2021లో ఇక్కడ ఒక క్యాంప్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన జరిగిందని గిరిజన ప్రజలు మాకు చెప్పారు. అప్పట్లో ఈ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఐదుగురు గిరిజనులు మరణించారు. వారి జ్ఞాపకార్థం ఆ స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు.
అయితే, సాయుధ మావోయిస్టులు ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టడంవల్లే కాల్పులు జరిగాయని పోలీసులు చెబుతున్నారు.
ఉర్సా భీముడు కూడా అదే కాల్పుల్లో మరణించారు. మేం ఆయన భార్య ఉర్సా నందేను కలిశాం.
‘‘పోలీసులు మా ఇళ్లలోకి వచ్చి కూడా కొట్టారు. అందుకే పోరాడాల్సి వచ్చింది. నా భర్త కూడా అక్కడికి వెళ్లాడు. అప్పుడే కాల్పులు ప్రారంభమయ్యాయి. ఎవరు ప్రారంభించారో తెలియదు. ఆయనను కూడా కాల్చారు’’ అని ఉర్సా నందే ఆరోపించారు.
"కాల్చిన తర్వాత, ఆయనపై నక్సలైట్ అనే ముద్ర వేశారు. సాధారణ మనిషికి, నక్సలైట్ కు మధ్య తేడా అధికారులకు తెలియదా?" అని ఆమె అన్నారు.
ఈ మధ్యకాలం వరకు ఈ ప్రాంతం సాయుధ మావోయిస్టులకు కీలక ప్రాంతంగా ఉండేదని స్థానికులు మాకు చెప్పారు.
"ఇప్పుడు ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేయడంతో మావోయిస్టులు వెనక్కి తగ్గారు" అని వారు వెల్లడించారు.
"మావోయిస్టులు కొన్నిసార్లు గ్రామస్థులకు సాయం చేశారు. ఉదాహరణకు, వారు కొన్నిసార్లు మాకు బియ్యంలాంటివి ఇచ్చేవారు. ఇప్పుడు ఎటువంటి సాయం రావడం లేదు. ప్రభుత్వం నుంచి మేం ఏం ఆశిస్తాం. కష్ట సమయంలో కూడా మాకు ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు" అని ఉర్సా నందే ఆరోపించారు.
మీడియా రిపోర్టుల ప్రకారం, 2021 సంవత్సరంలో జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు జరిగింది. దీని రిపోర్టు గురించి అధికారులను అడిగాం. కానీ వారినుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
శ్మశాన వాటిక వద్ద హెలిప్యాడ్
బీజాపూర్‌లో స్థానికులు గ్రామంలో కాంక్రీట్ మైదానం లాంటి ప్రాంతాన్ని చూపించారు. ఇది ఇక్కడున్న బలగాలు ఉపయోగించే హెలిప్యాడ్. ఇటీవలే ఇక్కడ భద్రతా బలగాలు శిబిరం ఏర్పాటు చేసుకున్నాయి.
"చనిపోయిన వారిని అక్కడే పూడ్చి పెట్టేవాళ్లం లేదా దహనం చేసే వాళ్లం. తరతరాలుగా ఇది మాకు శ్మశాన వాటిక. ఇప్పుడు మేం ఎక్కడకు వెళ్లాలి’’ అని అర్జున్ పోటం ప్రశ్నించారు.
ఈ భూమి ఎవరిదనే దాని గురించి బీబీసీ స్పష్టంగా చెప్పలేకపోతోంది. ఎందుకంటే ఇది బస్తర్ మారుమూల ప్రాంతంలో ఉంది. గ్రామస్థుల దగ్గర ఈ భూమికి సంబంధించిన పత్రాలేవీ లేవు.
బీజాపూర్ ఎస్పీ, కలెక్టర్‌ను బీబీసీ సంప్రదించింది. పదే పదే ప్రయత్నించినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)