You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సీతక్క: బుల్లెట్ వదిలి బ్యాలెట్ పట్టి.. మంత్రి పదవి చేపట్టి..
‘‘గన్‌తో ఉన్నా, గన్‌మెన్‌తో ఉన్నా బలహీనవర్గాల కోసమే, వారి కూడు కోసం, గూడు కోసం, గుడ్డ కోసమే.’’ గతంలో తుపాకీ చేతిలో పట్టుకున్న ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ ములుగు ఎమ్మెల్యే సీతక్క చెప్పిన మాటలివి.
సీతక్క. ఈ పేరు రెండు తెలుగురాష్ట్రాలలోనూ సుపరిచితమే. ఈమె అసలు పేరు ధనసరి అనసూయ సీతక్క. కానీ సీతక్కగానే ఆమె చిరపరిచితురాలు. వయసు 52 సంవత్సరాలు.
పొలిటికల్ సైన్స్‌లో ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు.
ఈమె తల్లిదండ్రులు సమ్మయ్య, సమ్మక్క. సీతక్కకు ఒక కుమారుడు ఉన్నారు. పేరు సూర్య.
గతంలో జనశక్తి గ్రూపులో దళసభ్యరాలుగా ఉన్న ఆమె, తను ప్రేమించిన శ్రీరాములునే పెళ్ళి చేసుకున్నారు. కానీ తరువాత విడిపోయారు. ఏ మార్పు కోసం తాను అడవి బాట పట్టానో, అడవిని వీడాకా కూడా తన లైను మార్చుకోలేదని ఆమె చెప్తుంటారు.
అనసూయ మావోయిస్ట్ పార్టీలో చేరినప్పుడు పదో తరగతి చదువుతున్నారు. సుమారు రెండు దశాబ్దాల పాటు మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన సీతక్క తరువాత జనజీవన స్రవంతిలోకి వచ్చారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేందుకు లా కూడా చదివారు.
సీతక్క తెలుగుదేశం పార్టీ తరపున 2004లో ములుగు నుంచి పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పోడెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. తరువాత 2009లో వీరయ్యపైనే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపునే పోటీ చేశారు. కానీ టీఆర్ఎస్ అభ్యర్థి చందూలాల్ చేతిలో ఓటమిపాలయ్యారు.
2018లో సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరారు. ములుగు నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.
సీతక్క నిరాండబరత, సామాన్యుల్లో సామాన్యురాలిగా కలిసిపోయే స్వభావమే ఆమెకు ప్రత్యేకతను తీసుకువచ్చిందంటారు రాజకీయ విశ్లేషకులు.
కరోనాకాలంలో ఎవరికివారు అన్నట్టుగా ఉంటే సీతక్క మాత్రం మారుమూల పల్లెలకు సైతం వెళ్ళి ఆహారపదార్థాలు అందచేసిన వైనం అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచింది.
అలాగే, ఈ ఏడాది జులైలో తెలంగాణను ముంచెత్తిన కుంభవృష్ఠిలో ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలో కొండాయి గ్రామమంతా వరద నీటి మునిగడంతో ప్రజల కష్టాలు చూసి సీతక్క చలించిపోయారు. ఈ గ్రామ ప్రజలను రక్షించడానికి హెలికాప్టర్ పంపమంటూ ఆమె కన్నీరు మున్నీరైన వైనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసెంబ్లీలో ఆమె ములుగు సమస్యలపై గళమెత్తేవారు.
తాజాగా తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీతక్క మంత్రి పదవి పొందారు.
ఇవి కూడా చదవండి
- రేవంత్ రెడ్డి ఎలా గెలిచారు? కేసీఆర్ ఎందుకు హ్యాట్రిక్ మిస్సయ్యారు?
- ఒంట్లోని రోగాల గురించి చిగుళ్లు ఏం చెబుతాయి?
- హాయ్ నాన్న సినిమా రివ్యూ: నాని ఖాతాలో మరో హిట్ పడిందా?
- తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం
- మలేషియాలో చైనా కంపెనీ నిర్మించిన ఈ ‘ఘోస్ట్ సిటీ’ అంటే జనం ఎందుకు జడుసుకొంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)