You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మావోయిస్టు చలపతి: ఎనిమిదేళ్ల కిందట వరకు పోలీసులకు ఆయన ఎలా ఉంటారో తెలియదు, తరువాత ఎలా తెలిసిందంటే..
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఛత్తీస్‌గఢ్- ఒడిశా సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జయరాం మరణించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో చలపతి మృతదేహం కూడా ఉందని పోలీసులు ధ్రువీకరించారు.
చలపతి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఒడిశా సీపీఐ మావోయిస్టు పార్టీ ఇన్‌చార్జ్‌గానూ వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు పార్టీలో వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. గెరిల్లా యుద్ధంలో చలపతికి మంచి పట్టు ఉన్నట్టుగా ప్రచారం ఉంది.
మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే(రామకృష్ణ)కు సన్నిహితునిగా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్ మడావి హిడ్మాకు మెంటార్‌గా చలపతికి పేరుంది.
చలపతి చనిపోవడం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ అని ఏపీకి చెందిన రిటైర్డ్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
ఎవరీ చలపతి?
చలపతిది చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం ముత్యంపైపల్లి. తండ్రి శివలింగారెడ్డి, తల్లి లక్ష్మమ్మ. దాదాపు నాలుగు దశాబ్దాల కిందటే చలపతి ఊరు నుంచి వెళ్లిపోయారని బంధువులు చెబుతున్నారు.
చిత్తూరు జిల్లాలో డిగ్రీ వరకు చదువుకున్న చలపతి 1988లో పట్టు పరిశ్రమ శాఖలో ఫీల్డ్ ఫోర్‌మన్‌గా ఉద్యోగంలో చేరారు. విజయనగరంలో పట్టు పరిశ్రమ శాఖ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు.
''ప్రతాప్ రెడ్డి చదువుకునే రోజుల్లోనే నాస్తికత్వం వైపు మళ్లారు. దానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదివారు'' అని చెప్పారు సీనియర్ జర్నలిస్టు ఎం.వి.రమణ.
విజయనగరంలో ఉన్నప్పుడే రాడికల్ భావజాలం వైపు ఆకర్షితులైనట్లు చలపతి సన్నిహితులు చెబుతుంటారు.
''ప్రతాప్ రెడ్డి ఒకసారి ఏదైనా సరైనదని నమ్మితే దానికోసం ఏదైనా చేసేవారు. అప్పటికి ఆయన విద్యార్థి కాకపోయినా.. పరిస్థితుల కారణంగా విజయనగరంలోని రాడికల్ విద్యార్థి సంఘ నిర్మాణంలో భాగమయ్యారు'' అని ఎంవీ రమణ చెప్పారు.
చలపతితో 1986, 87 నుంచి సాన్నిహిత్యం ఉందని చెప్పారాయన.
విజయనగరంలోనే విప్లవబాట
విజయనగరంలో పట్టు పరిశ్రమ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో, కార్యాలయంలోనే రాత్రివేళ విప్లవ కార్యకలాపాలు నిర్వహించేవారని చలపతి సన్నిహితులు చెబుతున్నారు. అప్పట్లో విప్లవ కార్యకలాపాలపై నిషేధం లేదు.
''వ్యవస్థ మారాలంటే నూతన ప్రజాస్వామిక విప్లవమే మార్గమని ప్రతాప్ నమ్మేవారు. ఉద్యోగం చేస్తూనే ఎక్కువ సమయం విప్లవ కార్యకలాపాల్లో గడిపేవారు. ఉద్యోగం వదిలేసి పూర్తిగా ప్రజలకోసమే పని చేయాలని తీవ్రంగా ఆలోచించేవారు'' అని ఎంవీ రమణ చెప్పారు.
ఆ సమయంలో ఆయన విప్లవ కార్యకలాపాల్లోకి పూర్తిస్థాయిలో వెళ్లారని రమణ తెలిపారు.
''ప్రతాప్ విప్లవ కార్యక్రమాల్లో తిరుగుతున్నారని తెలిసి ఆయన తల్లిదండ్రులు, అన్నయ్య విజయనగరం వచ్చి సర్దిచెప్పి ఇంటికి తీసుకెళ్లాలనుకున్నారు. తాను విప్లవబాటలో వెళ్లాలనుకుంటున్నానని తన వాళ్లకు ఆయన చెప్పేశారు. అది విన్న ప్రతాప్ తల్లి తీవ్రంగా బాధపడ్డారు. ఎంతగా వివరించినా వినడం లేదని భావించిన చలపతి... ఎలాగోలా ఇంటి నుంచి తప్పించుకుని బయటకు వెళ్లాడు'' అని ఎంవీ రమణ చెప్పారు.
అలా ''గ్రామాలకు తరలి రండి'' అనే కార్యక్రమానికి వెళ్లిన ప్రతాప్ రెడ్డి... మళ్లీ ఉద్యోగానికి తిరిగి రాలేదు. పూర్తిస్థాయి విప్లవ కారుడిగా మారిపోయారు.
శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటంలో కీలకమైన ఉద్ధానం ఉద్యమ నిర్మాణంలో భాగమయ్యారు. అప్పటికే ఆయన పేరు సుధాకర్, సుధాగా మారిందని చెప్పారు ఎంవీ రమణ.
పీపుల్స్‌వార్‌లో భాగమై తక్కువ కాలంలోనే శ్రీకాకుళం జిల్లా కమిటీ సభ్యుడయ్యారు. 1990-91 సమయంలో అజ్జాతంలోకి వెళ్లిన ప్రతాప్ అలియాస్ చలపతి పీపుల్స్ వార్ (ప్రస్తుత మావోయిస్టు పార్టీ)లో దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా కొనసాగుతూ వచ్చారు.
ఎక్కువ కాలంపాటు ఏవోబీలోనే..
చలపతి నేపథ్యాన్ని గమనిస్తే, ఆయన ఎక్కువ కాలంపాటు ఏవోబీలోనే పనిచేసినట్లు అర్థమవుతోంది.
శ్రీకాకుళం-కోరాపుట్ డివిజన్ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. తర్వాత ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ, ఏవోబీ రాష్ట్ర మిలిటరీ కమిషన్లలో సభ్యుడిగా పనిచేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో జరిగిన మావోయిస్టు దాడుల్లో చలపతి పాత్ర ఉన్నట్లుగా పోలీసులు చెబుతుంటారు.
2003లో చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి ఘటనలో చలపతి పాత్ర ఉందని భావించినా, అందుకు సంబంధించిన ఆధారాలేవీ పోలీసులకు లభించలేదు.
2017లో ఆంధ్ర, ఒడిశా బోర్డర్‌లో సుంకి ఘాట్ సమీపంలో పోలీసులపై జరిగిన బాంబు దాడి ఘటనలోనూ చలపతి పాత్ర ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
బలిమెల దాడి, కోరాపుట్ జిల్లా పోలీసు కార్యాలయంపై దాడి ఘటనల్లోనూ ఆయన పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమపై దాడి చేసి హతమార్చిన బృందానికి చలపతి నేతృత్వం వహించారని పోలీసులు చెబుతున్నారు.
2015లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై జరిగిన దాడిలోనూ చలపతిది కీలకపాత్ర అని అప్పట్లో చర్చ నడిచింది.
చనిపోయింది చలపతి అనే ఎలా తెలిసిందంటే..
మావోయిస్టు పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నచలపతి ఎలా ఉంటారో ఎనిమిదేళ్ల కిందట వరకు తెలియదని పోలీసులు చెబుతున్నారు. చలపతి భార్య అరుణ అలియాస్ చైతన్య కూడా మావోయిస్టు పార్టీలోనే కొనసాగారు. ఆమెది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం.
''2016లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో అరుణ సోదరుడు ఆజాద్ చనిపోయారు. ఆయన వద్ద లభించిన ల్యాప్‌టాప్‌లో చలపతి, అరుణ తీసుకున్న సెల్ఫీ ఫొటో లభించింది. ఇది వీడియో అని కూడా చెబుతుంటారు. అప్పుడే చలపతి ఎలా ఉంటారో పోలీసులకు తెలిసింది'' అని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఒకరు చెప్పారు.
దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కొనసాగిన చలపతి మరణం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పారు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)