You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహారాష్ట్ర: రైల్వే ట్రాక్‌పైకి దూకిన ప్రయాణికులు, మరో రైలు దూసుకురావడంతో 11 మంది మృతి
మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో రైలు కింద పడి పదకొండు మంది ప్రయాణికులు మరణించారని రైల్వే ప్రజా సంబంధాల అధికారి తెలిపారు.
పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు తాము ఎక్కిన రైలులో అగ్ని ప్రమాదం జరిగిందని భావించి భయంతో ఎదురుగా ఉన్న ట్రాక్ మీదకు దూకారు.
అదే సమయంలో, కర్ణాటక ఎక్స్‌ప్రెస్ దూసుకురావడంతో వారంతా ఆ రైలు కింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నారని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పదకొండు మంది చనిపోయారని తెలిపారు. ఇంకా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను జలగావ్ ప్రభుత్వ వైద్యకళాశాలకు తరలించారు.
ప్రమాదంలో గాయపడిన 12 మందిని పచరో రూరల్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని జల్‌గావ్ జిల్లా కలెక్టర్ బీబీసీతో చెప్పారు.
అసలేం జరిగింది?
ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా వివరించారు. ‘‘లక్నో నుంచి ముంబయికి వెళుతున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగినట్టు భావించి, ఎవరో చైను లాగడంలో మహేజీ, పార్దాడే స్టేషన్ల మధ్య రైలు ఆగిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు బోగీల నుంచి కిందకు దిగారు. పక్కనే ఉన్న ట్రాక్‌పైకి కర్ణాటక ఎక్స్‌ప్రెస్ వేగంగా వచ్చి ప్రయాణికులను ఢీకొంది’’ అని తెలిపారు.
గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలంలో సహాయక, రక్షక చర్యలు కొనసాగుతున్నాయి.
రూ. 5లక్షల పరిహారం
‘‘జలగావ్ జిల్లా పచరో వద్ద జరిగిన ప్రమాదం దురదృష్టకరం. మృతులందరికీ నివాళులర్పిస్తున్నాను, మంత్రి గిరీష్ మహాజన్, ఎస్పీ ఘటనాస్థలికి వెళ్ళారు. జిల్లా యంత్రాంగమంతా రైల్వే అధికారులతో సమన్వంయ చేసుకుంటోంది’ అని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చెప్పారు.
‘‘ఎనిమిది అంబులెన్స్‌లు తరలివెళ్లాయి. ప్రభుత్వాస్పత్రి సహా సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రులను కూడా సిద్ధం చేశారు. గాయపడినవారికి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు’’ అని తెలిపారు.
ప్రమాదంలో మరణించినవారికి ఒకొక్కరికి 5 లక్షల రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే గాయపడినవారికి ఉచితంగా చికిత్స అందిస్తామని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)