మావోయిస్టులవిగా చెబుతున్న రెండు లేఖలు, రెండు ఆడియో సందేశాలు ఆ ఉద్యమం గురించి ఏం చెబుతున్నాయి?

    • రచయిత, అలోక్ పుతుల్
    • హోదా, బీబీసీ కోసం

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)‌ రెండు రోజుల వ్యవధిలో విడుదల చేసినట్లు చెబుతున్న రెండు లేఖలు, రెండు ఆడియో సందేశాలు మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని చెబుతున్నాయి.

ప్రస్తుతం ఈ ప్రకటన మావోయిస్టులే విడుదల చేశారా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే మావోయిస్టు ఉద్యమంతో సంబంధం ఉన్న చాలామంది ఈ ప్రటనలు పార్టీ నుంచే వచ్చాయని నమ్ముతున్నారు.

ఈ ప్రకటనల ప్రకారం ప్రభుత్వం నెల రోజులు కాల్పుల విరమణ ప్రకటించాలని పార్టీ కేంద్ర ప్రతినిధి అభయ్ ప్రతిపాదించారు.

ఈ నెల రోజుల కాలంలో జైళ్లలో ఉన్న తమ సీనియర్ నాయకులను సంప్రదించి చర్చలకు ప్రతినిధి బృందాన్ని తయారు చేసుకుంటుంది.

కేంద్ర హోంమంత్రి లేదా ఆయన ప్రతినిధులతో చర్చలు జరుపుతామని ఈ సందేశాల్లో ఉంది.

అయితే, ఈ ప్రతిపాదనలు మావోయిస్టు పార్టీ నుంచే వచ్చాయా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర హోంమంత్రి విజయ్ శర్మ చెప్పారు.

లేఖల్లోని అంశాలతో పాటు అవి వాస్తవమైనవా కాదా అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్‌ కూడా తెలిపారు.

మావోయిస్టుల నుంచి వచ్చిందని చెబుతోన్న లేఖలు, ఆడియోలను పరిశీలించిన తర్వాత అందులో భాష, నక్సలైట్ల సంప్రదాయ భాషకు భిన్నంగా ఉందని భావిస్తున్నారు.

ఈ ప్రకటనల విషయంలో, మావోయిస్టుల ఆలోచనా ధోరణి నిజంగానే మారిందా లేక సంక్షోభ సమయంలో వ్యూహాత్మక మార్గమా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.

పోరాటం నిర్ణయాత్మక దశకు చేరిందా?

భారతదేశంలో నక్సల్ ఉద్యమం గురించి తెలిసిన, అర్థం చేసుకున్నవారు ప్రస్తుతం ఉద్యమం క్రాస్‌రోడ్స్‌లో ఉందని అంటున్నారు.

బుల్లెట్లను పేల్చే తుపాకులు ఇప్పుడు చర్చల ప్రస్తావన చేయడం వెనుక స్పష్టమైన కారణాలు కనిపిస్తున్నాయి.

ఈ ప్రకటనలు కచ్చితంగా మావోయిస్టులే చేసి ఉంటే, వాళ్లు ఆయుధాలు వదిలి చర్చలకు సిద్ధమైనట్లు భావించాలి.

అయితే, తాజా ప్రకటనలు 5 నెలల కిందట మావోయిస్టు ప్రతినిధి అభయ్ చేసిన ప్రకటనకు భిన్నంగా ఉన్నాయి.

కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్‌ నిలిపివేయాలని ఇకపై ఎక్కడా కొత్తగా శిబిరాలు ఏర్పాటు చేయకూడదనే షరతులతో చర్చలకు సిద్ధమని మావోయిస్టు ప్రతినిధి అభయ్ 2025 ఏప్రిల్ 2న ప్రతిపాదించారు.

కాల్పుల విరమణ సమయంలో బలగాలను శిబిరాలకు పరిమితం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే ఈ 5 నెలల్లో మావోయిస్టులు...పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు వందలమంది కార్యకర్తలను కోల్పోయారు.

దీంతో ఇప్పుడు ఎలాంటి షరతులు లేకుండా చర్చలకు ముందుకొచ్చినట్లు భావిస్తున్నారు.

మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టకపోతే ప్రభుత్వం వారితో చర్చలు జరపదనేది నక్సల్ సమస్యలపై అధ్యయనం చేసిన డాక్టర్ పీవీ రమణ అభిప్రాయం.

"మార్చి-ఏప్రిల్‌లో చర్చల ప్రతిపాదన వచ్చింది. అయితే అప్పుడు కేంద్రం స్పందించలేదు. కేంద్ర బలగాల ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. సంస్థ ప్రధాన కార్యదర్శితో పాటు అనేకమంది కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు" అని ఆయన వివరించారు.

మావోయిస్టులు ఆయుధాలు వదిలేస్తే వారిని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకువచ్చేందుకు అవకాశం ఇవ్వాలని పీవీ రమణ బీబీసీతో చెప్పారు.

దేశంలోని అనేక రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి ఉంది. కేవలం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చలతో సమస్య పరిష్కారం కాదని రమణ అన్నారు.

కష్టాల్లో మావోయిస్టులు

మావోయిస్ట్ ఉద్యమం ప్రస్తుతం కఠిన పరీక్షల్ని ఎదుర్కొంటోంది. సంస్థ కోణంలో చూస్తే ఒకప్పుడు 42 మంది సభ్యులున్న కేంద్ర కమిటీలో ప్రస్తుతం 12 మంది ఉన్నారు.

జనరల్ సెక్రటరీ బసవరాజు, మోడెం బాలకృష్ణ వంటి సీనియర్ నాయకులు ఇటీవల కేంద్ర బలగాల దాడుల్లో చనిపోగా కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత లొంగిపోయారు.

ఈ సంఘటనలు సంస్థలోని నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీశాయి.

అయితే మావోయిస్టు ప్రతినిధి తమ పోరాటం ఆయుధాలపై మాత్రమే ఆధారపడి లేదని లేఖలో స్పష్టం చేశారు.

మావోయిస్టు ఉద్యమం సమాజంలోని మహిళలు, కార్మికులు, దళితులు, గిరిజనులను ఏకం చేసి వారికి గుర్తింపు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

అయితే వాస్తవం ఏంటంటే రెండేళ్లుగా కేంద్ర బలగాల ఆపరేషన్, మావోయిస్టులపై ఒత్తిడి పెంచింది.

కేంద్ర బలగాల దాడులతోపాటు ప్రజల్లో తగ్గుతున్న ఆదరణ కూడా మావోయిస్టుల్ని ఇబ్బంది పెడుతోంది.

మావోయిస్టులు చర్చల ప్రతిపాదనతో ముందుకు రావడం ఇదే తొలిసారి కాదు. అయితే గతానికి, వర్తమానానికి తేడా ఏంటంటే సంస్థ ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది.

అంతర్గత విభేదాలు కూడా సవాలు విసురుతున్నాయి.

ఒక వర్గం చర్చల్ని కోరితే, మరోవర్గం హింసా మార్గం కొనసాగించాలని పట్టుబట్టవచ్చు.

ఈ సందర్భంగా మావోయిస్టుల తాజా ప్రతిపాదనను రెండు విధాలుగా చూడవచ్చు.

అది ఉనికిని కాపాడుకునే వ్యూహం కావచ్చు లేదా ప్రజా సమస్యలను తుపాకులతో పరిష్కరించలేమనే వాస్తవాన్ని గ్రహించి ఉండవచ్చు.

"చర్చల ప్రతిపాదన ఉనికిని కాపాడుకునే వ్యుహమా లేక ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనేందుకు వేసుకుంటున్న మార్గమా అని చెప్పడం తొందరపాటవుతుంది. అయితే వాళ్ల ప్రస్తుత వైఖరి గతానికి భిన్నంగా ఉందనేది సుస్పష్టం" అనిసీనియర్ జర్నలిస్ట్ ప్రఫుల్ ఠాకూర్ చెప్పారు.

"మావోయిస్టు నాయకత్వం తొలిసారి ప్రజా సమస్యలను ప్రజాస్వామ్య పద్దతిలో పరిష్కరించాలని కోరుకుంటున్నట్లు అంగీకరించింది. సాయుధ పోరాటం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యంకాదని గుర్తించడం వారి సైద్ధాంతిక ఆలోచనలో మార్పును సూచిస్తోంది" అని ఆయన అన్నారు.

గతంలోనూ చర్చలకు ప్రయత్నాలు

ప్రభుత్వం- మావోయిస్టుల మధ్య చర్చల ప్రతిపాదన ఇదే తొలిసారి కాదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చర్చల అజెండాను నిర్ణయించేందుకు 2002లో మొదటగా సంప్రదింపులు జరిగాయి. అయితే ఇందులో ఏమీ తేలలేదు.

2004 అక్టోబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో చర్చలు మొదలయ్యాయి.

అప్పట్లో చర్చలకు నాయకత్వం వహించిన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే చర్చలకు ఒక రోజు ముందు ‘ఇది మరో రకమైన యుద్ధం’ అని అన్నారు.

అక్టోబర్15 నుంచి 17 వరకు మూడు రోజులపాటు జరిగిన చర్చల్లో, భూ సంస్కరణలు, దళాల ఉపసంహరణ, ప్రజాసంఘాలను గుర్తించడం వంటి డిమాండ్లను ప్రధానంగా ప్రస్తావించారు మావోయిస్టులు.

చర్చలు ప్రారంభం కావడానికి ముందు, అంటే అక్టోబర్ 11న ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.

‘‘ఇది చర్చల ప్రక్రియను చెడగొట్టే కుట్ర’’ అని ఆర్కే విమర్శించారు.

చర్చలు జరుగుతూ ఉండగానే అక్టోబర్ 16న మావోయిస్టులు ఎమ్మెల్యే ఆదికేశవులు నాయుడిని హత్య చేశారు.

దీంతో చర్చలు విఫలం అవుతాయని అందరూ భావించారు.

2005 జనవరిలో "ప్రభుత్వం మోసం చేసినందున ఇకపై చర్చలు ఉండవు" అని మావోయిస్టు సంస్థలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

గతంలోనూ చర్చలకు ప్రయత్నాలు

ప్రభుత్వం- మావోయిస్టుల మధ్య చర్చల ప్రతిపాదన ఇదే తొలిసారి కాదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చర్చల అజెండాను నిర్ణయించేందుకు 2002లో మొదటగా సంప్రదింపులు జరిగాయి.

అయితే ఇందులో ఏమీ తేలలేదు.

2004 అక్టోబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చర్చలు మొదలయ్యాయి.

అప్పట్లో చర్చలకు నాయకత్వం వహించిన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే చర్చలకు ఒక రోజు ముందు "ఇది మరో రకమైన యుద్ధం" అని అన్నారు.

అక్టోబర్15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు జరిగిన చర్చల్లో మావోయిస్టులు భూ సంస్కరణలు, దళాల ఉపసంహరణ, ప్రజా సంఘాలను గుర్తించడం వంటి డిమాండ్లను ప్రధానంగా ప్రస్తావించారు.

చర్చలు ప్రారంభం కావడానికి ముందు, అంటే అక్టోబర్ 11న ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మరణించారు.

"ఇది చర్చల ప్రక్రియను చెడగొట్టే కుట్ర" అని ఆర్కే విమర్శించారు.

చర్చలు జరుగుతూ ఉండగానే అక్టోబర్ 16న మావోయిస్టులు ఎమ్మెల్యే ఆదికేశవుల నాయుడిని హత్య చేశారు.

దీంతో చర్చలు విఫలం అవుతాయని అందరూ భావించారు.

2005 జనవరిలో "ప్రభుత్వం మోసం చేసినందున ఇకపై చర్చలు ఉండవు" అని మావోయిస్టు సంస్థలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

2010లో కేంద్ర హోంమంత్రిగా ఉన్న పి. చిదంబరం శాంతి చర్చలకు చొరవ చూపారు.

జూన్ 2010లో మావోయిస్టు ప్రతినిధి ఆజాద్ కాల్పుల విరమణ, చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ లేఖ రాశారు.

అయితే చర్చలు ప్రారంభం కాక ముందే, అంటే 2010 జులై 1న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండేలను హత్య చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

ఆజాద్‌ను పోలీసులు నాగ్‌పూర్‌లో పట్టుకుని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి బూటకపుఎన్‌కౌంటర్ చేశారని సంప్రదింపులకు మధ్యవర్తిగా ఉన్న స్వామి అగ్నివేష్ ఆరోపించారు.

ప్రభుత్వం చర్చల పేరుతో మావోయిస్టు నాయకత్వాన్ని నిర్మూలించాలని కోరుకుంటోందని మావోయిస్టులు ఆరోపించారు.

2011లో మావోయిస్టు నాయకుడు కిషన్‌జీ చర్చల పట్ల సుముఖత వ్యక్తం చేశారు. అయితే అదే ఏడాది నవంబర్ 24న వెస్ట్ మిడ్నపూర్ జిల్లాలో ఆయనను హత్య చేశారు.

దీంతో ఈ చర్చల ప్రక్రియ మొదలు కాకుండానే ఆగిపోయింది.

కిషన్‌జీ హత్యపై సందేహాలు చెలరేగాయి. దీంతో చర్చల ప్రక్రియలో ప్రభుత్వం తరఫు మధ్యవర్తులు చర్చల ప్రక్రియ నుంచి తప్పుకున్నారు.

ఈ సంఘటన తర్వాత కూడా అనేక సందర్భాల్లో శాంతి చర్చలు జరపడానికి అవకాశం లభించిందని మావోయిస్టు డాక్యుమెంట్లు సూచిస్తున్నాయి.

అయితే కేంద్రం ఆపరేషన్ కగార్ ప్రారంభించిన తర్వాత మావోయిస్టులు పదే పదే చర్చలకు ప్రతిపాదించారు.

ఆపరేషన్ కగార్ ఆపేస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు 2025 మార్చ్ 28న మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

తర్వాత ఏప్రిల్ 2న మరోసారి మావోయిస్టుల నుంచి చర్చల ప్రతిపాదన వచ్చింది.

ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే, వెంటనే కాల్పుల విరమణకు సిద్ధమని మావోయిస్టుల కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ఏప్రిల్ 3న ప్రకటించారు.

"నిర్ణీత కాల పరిమితితో కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ వెంటనే బేషరతుగా చర్చలు ప్రారంభించాలి" అని మావోయిస్టు ప్రతినిధి అభయ్ ఏప్రిల్ 25న విజ్ఞప్తి చేశారు.

అయితే మావోయిస్టులు ముందు ఆయుధాలు అప్పగిస్తేనే చర్చలు జరుగుతాయని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

మావోయిస్టులు లొంగిపోతేనే చర్చలు సాధ్యమని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ అన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలన్నారు.

చర్చలపై సందేహాలు

మావోయిస్టులకు, ప్రభుత్వానికి మధ్య చర్చల్లో ఎప్పుడూ పరస్పర విశ్వాసంలేదని నిపుణులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసాధ్యమైన షరతులను మావోయిస్టులు ప్రతిసారీ చర్చలకు ముందు పెడుతుంటారని వారు అంటున్నారు.

అదేవిధంగా, ఇటు ప్రభుత్వం వ్యవహార శైలి కూడా అలాగే ఉంటుందని వారు అంటున్నారు. ప్రతి రౌండ్‌లో చర్చలతో పాటు బలగాల కార్యకలాపాలు కొనసాగాయి. ఆజాద్, కిషన్‌ జీ హత్యలు ప్రభుత్వంపై అపనమ్మకాన్ని మరింత పెంచాయి.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక రిటైర్డ్ పోలీసు అధికారి అభిప్రాయం ప్రకారం, మావోయిస్టులు ఎప్పుడూ శాంతి చర్చలను లొంగుబాటు, హింసకు మించి ఉండాలని కోరుకుంటారు. భూ సంస్కరణలు, గిరిజన హక్కులు, వలసలు, మైనింగ్ ప్రాజెక్టులు, ప్రజాస్వామిక స్వేచ్ఛ వంటి అంశాలను చర్చించాలని వారు కోరుకున్నారు.

కానీ, ప్రభుత్వాలు మాత్రం చర్చలను శాంతిభద్రతలు, భద్రత చుట్టూనే తిప్పడం మామూలే.

"చర్చల నిబంధనలపై ఎల్లప్పుడూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మావోయిస్టులు ఎప్పుడూ భద్రతా దళాల కార్యకలాపాలను ఆపాలని పట్టుబడుతుంటారు. ప్రభుత్వం ఎప్పుడూ లొంగుబాట్ల గురించి పట్టుబడుతుంది. చర్చల చర్చలు కొనసాగుతున్నప్పుడే, మావోయిస్టు హింస, ఎన్‌కౌంటర్‌లు జరిగిన సందర్భాలున్నాయి. ఫలితంగా, శాంతిచర్చలు ఎప్పుడూ ఫలవంతంగా జరగలేదు. ఇప్పుడు అలాంటి అవకాశం కనిపించడం లేదు" అని ఆ రిటైర్డ్ అధికారి అన్నారు.

భారతదేశంలో సీపీఐ (మావోయిస్ట్) అతిపెద్ద సంస్థ. కానీ వివిధ ప్రాంతాలలో కనీసం 18 ఇతర మావోయిస్టు సంస్థలు పనిచేస్తున్నాయని ఒక పోలీసు అధికారి చెప్పారు.

ఒక ప్రధాన ప్రశ్న ఏమిటంటే, సీపీఐ (మావోయిస్ట్) సభ్యులు తమ ఆయుధాలను విడిచిపెడతారు సరే, మిగిలిన మావోయిస్టు సంస్థలు కూడా దీనిని అనుసరిస్తాయా? అన్నది.

ప్రజాస్వామ్య రాజకీయాలను స్వీకరించే వారిని "రివిజనిస్టులు"గా ముద్ర వేసి, హింసాత్మక రాజకీయాలను కొనసాగించిన సుదీర్ఘ చరిత్ర మావోయిస్టులకు ఉంది.

అయితే, నక్సల్ ప్రభావిత ప్రాంతంలోని ఒక చిన్న గ్రామమైన సంగంలో నివసిస్తున్న గిరిజన జర్నలిస్ట్ మంకు నేతమ్ ఆలోచన వేరే ఉంది.

మావోయిస్టులు నిజంగా తమ ఆయుధాలను వదులుకోవాలంటే, గిరిజన ప్రాంతాలలో వారికి గౌరవప్రదమైన పునరావాసం, రాజకీయ భాగస్వామ్యం, గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధి విషయంలో స్పష్టమైన హామీ తీసుకోవాలని ఆయన అంటున్నారు.

మరోవైపు, ప్రభుత్వం బలప్రయోగం, లొంగుబాట్లపైనే ఆధారపడే విధానాన్ని అవలంబిస్తే, హింసను అణచివేయవచ్చు. కానీ అది అంతటితో అంతం కాదు. అసమానతల పేరుతో అది కొత్త రూపంలో మళ్లీ రావచ్చు.

‘‘గిరిజన వర్గాలకు విద్య, ఉపాధి, గౌరవప్రదమైన జీవితానికి అవకాశాలు కల్పించే వరకు, హింస పునాది అలాగే ఉంటుంది. కొత్త రూపాల్లో ఉద్భవిస్తూనే ఉంటుంది. ఇది ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)