You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విభజన అంశాలపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఏం చర్చించారంటే..
- రచయిత, బళ్ల సతీష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
విభజన అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
ఈ సమావేశంలో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ కమిటీలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో పాటు, మరో ముగ్గురు చొప్పున సభ్యులు ఉంటారని చెప్పారు.
ఈ కమిటీ పరిష్కరించలేని సమస్యలపై మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
తేల్చాల్సినవి ఇవే..
తెలుగు రాష్ట్రాలు విడిపోయి పదేళ్ళు గడిచినా పంపకాలు చాలా వరకూ తేలలేదు. దీనిపై గతంలో కేసీఆర్ - చంద్రబాబు, కేసీఆర్- వైఎస్ జగన్ కూడా సమావేశమైనా పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ సమావేశమయ్యారు.
ప్రభుత్వం కింద పనిచేసే వివిధ సంస్థల విభజన పూర్తిగా జరగలేదు. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లో 91, పదవ షెడ్యూల్‌లో 142 సంస్థలు ఉన్నాయి. చట్టంలో పొందుపరచని మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయి.
చట్టంలో పొందుపరిచిన వాటిల్లో 53 సంస్థలను ఎలా విభజించాలి? ఆస్తులు, అప్పులు ఎలా పంచుకోవాలి? అన్నది ఇప్పటి దాకా తేలలేదు.
ఇప్పటికే కేంద్రం నియమించిన షీలా బేడీ కమిటీ కొంత పనిచేసింది. చివరగా ప్రభుత్వాలు తుది నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
ఈ సంస్థల విభజనకు సంబంధించి తెలంగాణలో ఉన్న స్థిరాస్తులు, ఆంధ్రలో ఉన్న స్థిరాస్తులు, చరాస్తులు, నగదు నిల్వలు, అప్పులు – వీటిని ఎలా విభజించాలి? అనే విషయంలో ఒక్కో సంస్థకు సంబంధించి ఒక్కో రకమైన సమస్య ఉంది.
సాధారణంగా ఏపీ, తెలంగాణ మధ్య అన్నీ 58:42 నిష్పత్తిలో పంపిణీ జరుగుతూ ఉంటాయి. ఇరు రాష్ట్రాల జనాభా ఆధారంగా నిర్ణయించిన నిష్పత్తి ఇది.
ఇప్పుడు ఆ సంస్థల ఆస్తులు కూడా అదే నిష్పత్తిలో జరగాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. విభజన చట్టం ప్రకారం ఎక్కడ ఉన్న ఆస్తులు ఆ ప్రభుత్వానివే అన్నది తెలంగాణ మాట. అలా అయితే హైదరాబాద్‌లోనే ఎక్కువ సంస్థలు, వాటి ఆస్తులు ఉన్నాయి కాబట్టి తమకు నష్టం అని ఆంధ్రప్రదేశ్ అంటోంది.
ఇది కాక, సముద్రంలేని తెలంగాణకు పోర్టులో హక్కు, బొగ్గు గనులు లేని ఏపీకి సింగరేణిలో హక్కు వంటి సాంకేతిక అంశాలు.. రెండు రాష్ట్రాలకూ పనిచేసిన అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వంటి వాటి విభజన, డబ్బులతో ముడిపడిన ఫైనాన్స్ కార్పొరేషన్ వ్యవహారం .. ఇలా మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి.
ఈ అంశాలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య సుమారు 30 సమావేశాలు జరిగినా పూర్తి స్థాయిలో ఫలితం రాలేదు. దిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన కూడా పదేళ్లు పెండింగులో ఉండగా, 2024 మార్చిలో ఆ సమస్య పరిష్కారం అయింది.
ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల మీద ఉన్న అప్పుల పంపిణీ కూడా తేలాలి. వీటి విభజనకు సుప్రీంకోర్టు జడ్జితో కమిటి వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. కానీ ఆ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం అన్నది.
అసెంబ్లీ, సచివాలయం, బీఆర్కే భవన్ వంటి ఇతర ఆఫీసులకు పదేళ్ల గడవు ఉన్నప్పటికీ గతంలో చంద్రబాబు ముందుగానే ఖాళీ చేశారు. కానీ తెలంగాణకు అప్పగించలేదు. ఏపీలో వైఎస్ జగన్ సీఎం అయ్యాక వాటిని తెలంగాణకు అప్పగించారు. అయితే లేక్ వ్యూ అతిథి గృహం, సీఐడీ ఆఫీసు, హెర్మిటేజ్ భవనాలు ఇంకా ఏపీ ప్రభుత్వం కిందే ఉన్నాయి. అవి మరికొంత కాలం కావాలని ఏపీ అంటోంది.
చిక్కుముళ్ళు
విద్యుత్ రంగానికి సంబధించిన సమస్య కూడా ఉంది. తెలంగాణ తమకు రూ.7 వేల కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంటోంది. ఆంధ్రాయే తమకు 23 వేల కోట్ల వరకూ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఆ లెక్కలు కూడా సరికాదని రెండు ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఆంధ్రా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది.
ఉద్యోగులు
ఏపీలో 1,800 మంది తెలంగాణ స్థానికత ఉన్న వారు, తెలంగాణలో 1,400 మంది ఏపీ స్థానికత ఉన్న వారు ఉన్నారు. వారి బదిలీలు - సర్వీసుకు సంబంధించిన అంశం తేలాల్సి ఉంది.
ముంపు మండలాలు
పోలవరం కోసం ఆంధ్రప్రదేశ్ తీసుకున్న 7 మండలాల్లో కనీసం 5 గ్రామాలు తెలంగాణకు వెనక్కు ఇవ్వాలని స్థానికుల కోరిక.
భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న తమ గ్రామాలను ఆంధ్రలో కలపడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆ గ్రామాల ప్రజలు అంటున్నారు. తమ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
నీటి పంపిణీ
విభజన సమస్యల్లో అన్నిటికంటే క్లిష్టమైనది నదీ జలాల పంపిణీ. గోదావరి నీటి విషయంలో చిన్నా చితకా సమస్యలు ఉన్నా, కృష్ణా నీటి విషయంలో తీవ్రమైన అభిప్రాయ బేధాలు ఉన్నాయి.
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నీటి సమస్యను తీర్చేందుకు గోదావరి జలాలను కృష్ణకు తరలించాలని 2020లో కేసీఆర్- జగన్ అనుకున్నప్పటికీ అది ముందుకు సాగలేదు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా నీటిలో ఆంధ్రకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు.
కానీ వాస్తవంగా కృష్ణా నదికి తెలంగాణలో ఎక్కువ పరీవాహక ప్రాంతం ఉంది. ఆంధ్రలో తక్కువ పరీవాహక ప్రాంతం ఉంది. దీంతో నదీ జలాల పంపిణీ సహజ సూత్రాల కింద తెలంగాణకు ఎక్కువ నీరు రావాలనేది ఆ రాష్ట్ర వాదన.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వాటాలోని మొత్తం నీటిలో 70 శాతం లేదా సుమారు 558 టీఎంసీలు తమకు రావాలని తెలంగాణ పట్టుబడుతోంది. దీనికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు.
శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముందు నుంచీ రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
దానిపై గతంలో రేవంత్ అనుచరులే కేసులు వేశారు.
2014 ఎన్నికల తరువాత నాటి గవర్నర్ నరసింహన్ చొరవతో అదే ఏడాది ఆగష్టు 15న రాజ్ భవన్‌లో అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సమావేశం అయ్యారు.
కానీ, పెద్దగా సమస్యలు పరిష్కారం కాలేదు.
2019లో జూన్, ఆగస్టు, సెప్టెంబరు, 2020 జనవరిలలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిశారు.
2020 జనవరిలో సుదీర్ఘంగా సమావేశమై గోదావరి జలాలను కృష్ణా నదికి తరలింపు గురించి ఒక ప్రణాళిక కూడా అనుకున్నారు. కానీ అది ముందుకు సాగలేదు.
ఇక జగన్‌ను కాళేశ్వరం ప్రారంభానికి పిలిచారు కేసీఆర్. వీరి మధ్య అంత సఖ్యత సాగినప్పటికీ, విభజన సమస్యలు మాత్రం పెద్దగా పరిష్కారం కాలేదు.
ఇవి కూడా చదవండి:
- మోదీ మెచ్చిన అరకు కాఫీ అసలు ఆంధ్రప్రదేశ్‌లోకి ఎలా వచ్చింది?
- కరెంట్ లేనప్పుడు సెల్‌ఫోన్ చార్జ్ చేయడమెలా?
- టీ20 వరల్డ్ కప్ గెలిచాక టీమిండియా ఆటగాళ్లు బార్బడోస్‌లో ఏం చేస్తున్నారు, ఎప్పుడు తిరిగి వస్తారు?
- రిషి సునక్: కన్జర్వేటివ్ పార్టీ ఎందుకు ఓడిపోయింది, సునక్ హామీలు ప్రజలకు నచ్చలేదా?
- బ్రిటన్ ప్రధాని కాబోతున్న లేబర్ పార్టీ నేత సర్ కీర్ స్టార్మర్ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)